Sunday 12 August 2018

stanabhAradaLanmadhyapaTTabandhavaLitrayA స్తనభారదళన్మధ్య-పట్టబంధ-వళిత్రయా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

అక్షుద్రమిక్షుచాపమ్| పరోక్షమవలగ్నసీమని త్ర్యక్షమ్|
క్షపయతుమే క్షేమేతర|ముక్షరధ ప్రేమ పక్ష్మలమ్ తేజః|| (కామేశీస్తుతి-ఆర్యాద్విశతి)

స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా

స్తనభారస్తనములభారముచేత
దళత్విరుగుచున్న
మధ్యనడుము
పట్టబంధకట్టబడినటువంటి పట్టీలవంటి
వళిత్రయముమూడుముడుతలు

స్తనభారమునకు తట్టుకొనలేక, విరుగునేమోనని నడుమునకు కట్టిన పట్టీలవంటి మూడుముడుతలతో కూడిన నడుముగలిగిన తల్లికి నమస్కారము.  


మూకపంచశతినందలి ఆర్యాశతకమంతయు తల్లియొక్క కఠినమైన, పుష్టియైన, కూలంకషకుచకుంభములవంటి స్తనములను సూచించబడుతూ ఉంటుంది. అటువంటి స్తనములభారముచేత తల్లినడుమునందు మూడుముడతలు ఏర్పడినవి. అవి చూచుటకు స్తనభారమును తట్టుకొనలేక వంగుచున్ననడుమును నిలుపుటకు కట్టినపట్టీలవలెనున్నవి. దీనినే లలితోపాఖ్యానమునందు అతిపీవరవక్షోజభారభంగురమధ్యభూః అని జెప్పబడినది.

మరి ఈ నడుము దేనితో కట్టబడినదని తెలుసుకొనుటకు శంకరభగవత్పాదులే శరణము. సౌన్దర్యలహరి 80వశ్లోకమునందు కనకకలశములవంటి కుచభారమునకు వంగుచున్న తల్లి వలగ్నమును అతిలావణ్యమై, కోమలమై, కాంతియుతమైన శ్వేతవర్ణలత, లవలీలతచే కామదేవుడు కట్టినట్లు వర్ణించారు.

మధ్యేన సా వేదివిలగ్నమధ్యా వళిత్రయమ్ చారు బభార బాలా
ఆరోహణార్థమ్ నవయౌవనేన కామస్యసోపానమివ ప్రయుక్తమ్
సాక్షాత్ యజ్ఞస్వరూపిణియైన (769వ నామము) తల్లియొక్కనడుమును యజ్ఞవేదికవలగ్నముతో పోల్చి, ఆనడుముమీది మూడుముడుతలు కామదేవుని సోపానములవలెనున్నవని  కాళిదాసు మహాకవి పార్వతీదేవిని కుమారసంభవము ప్రథమసర్గ 39శ్లోకమునందు వర్ణించారు. అంతేకాదు, తృతీయ సర్గము 54శ్లోకమునందు కించిదావర్జితేనస్తనాభ్యామ్ తల్లి,స్తనభారముచే కొంచమువంగినట్లున్నదని వర్ణించారు.
నడుము వంగియుండుటచే శరీరాకారము త్రిభంగియనబడు మూడువంపులతో ఒప్పుచున్నది. ఇక్కడ రెండు విషయములు. త్రిభంగియనిన వెంటనే నల్లనివాడు చేతిలో పిల్లనగ్రోవితో, వ్యత్యస్తపాదములతో నుంచొనియున్న భంగిమ గుర్తుకువస్తుంది. మరి ఆవిడ, ఆయన ఒకటే కదా!! ఈ విషయము మనము ఇదివరకే ప్రస్తావించుకొన్నాము.  త్రిభంగీమధురాకృత యని కృష్ణ అష్టోత్తరశత నామములయందు ఒకటి.

ఇంకొకటి, లలితాత్రిపురసుందరియే సాక్షాత్తు కాంచీపురకామాక్షిగా విరాజిల్లుతున్నదని బ్రహ్మాండపురాణమునందు చెప్పబడినది.

పాశాంకుశేక్షుకోదండపంచబాణలసత్కరా
లలితాసైవ కామాక్షీ కాంచ్యామ్ వ్యక్తిముపాగతా||
(బహ్మాండపురాణము ఉత్తరభాగము 3-39-23,24)
కాంచికామాక్షి రూపముచూచినవారికి తల్లియొక్క నడుమువంపు తప్పక స్మృతికి వస్తుంది.

మార్కండేయపురాణమునందలి కామాక్షీవిలాసమునందు, ఈ క్రింది స్వర్ణకామాక్షీ శ్లోకము చెప్పబడుచున్నది.

పరా ఫాలాక్షీసంభూతా కామాక్షీ స్వర్ణవిగ్రహా
ద్వినేత్రా ద్విభుజా శ్యామా దక్షహస్తాలసచ్చుకా
లంబా వామకరాంబోజ త్రిభంగీ దక్షకుంచితా
సా ధనుర్విగ్రహాతన్వీ సర్వాభరణభూషితా

మూడుముడుతలతోకూడిన సన్నని నడుము ఉత్తమసాముద్రికా లక్షణముగ చెప్పబడుచున్నది. ఈ మూడు ముడతలు మూడుగుణములకు సంకేతము. ఈ వివరము తదుపరి నామమునందు చూద్దాము.

మధ్యభాగమునందలి వళిత్రయముతో శోభిల్లు త్రిగుణాతీతమైన తల్లి, గుణత్రయముతో కూడిన భవబంధములనుండి విముక్తిచేయవలసినదిగా ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment