Wednesday 8 August 2018

కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా Kamesa baddha mangalya sutra sobhitha kandhara

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

 శ్రీగురుభ్యోనమః

కోటికందర్పలావణ్యశివవామాంకవాసినీమ్

ప్రసన్నవదనాంబోజామ్ సమందహసితేక్షణమ్

పాశాఙ్కుశేక్షుకోదండ పంచబాణలసత్కరామ్

మణిమంగళసూత్రేణ విలసత్ కంబుకంధరామ్

పంచప్రేతాసనామీడే పంచప్రణవరూపీణీమ్

కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా

కామేశబద్ధకామేశునిచే కట్టబడిన

మాంగల్యసూత్ర -మంగళసూత్రముతో

శోభిత -  శోభిల్లుతున్న

కంధరాకంఠముగల తల్లి

 

కామేశబద్ధమాంగల్యసూత్రశోభికంధరాయై నమః

మహాకామేశునిచేతకట్టబడిన మంగళసూత్రముతో శోభిల్లుతున్న కంఠముగల తల్లికి నమస్కారము.

 

బ్రహ్మాండపురాణాంతర్గతమైన లలితోపాఖ్యానమునందు కామేశ్వరీకామేశ్వరుల వివాహఘట్టమును వర్ణించినప్పుడు మంగళసూత్రధారణ చెప్పబడలేదు. కానీ అదే బ్రహ్మాండపురాణమందలి లలితాసహస్రనామ స్తోత్రమునందు వాగ్దేవతలు మృత్యుంజయుని పత్నియైన నిత్యసుమంగళి కంఠసీమనలంకరించియున్న మంగళసూత్రశోభను ఈ నామమునందు వర్ణించుచున్నారు.

 

శివ/స్కాంద పురాణములందు దాక్షాయణి-శివుల, శివ-పార్వతుల వివాహ సందర్భమున పాణిగ్రహణము ముఖ్యముగా చెప్పబడినది కానీ మంగళసూత్రధారణ చెప్పబడలేదు. వాల్మీకి రామాయణమునందు కూడా సీతారాములకళ్యాణమునకు పాణిగ్రహణము మాత్రమే చెప్పబడినది. స్కాంద పురాణమునందు పద్మావతీశ్రీనివాసుల కళ్యాణవిశేషములను ప్రస్తావించినప్పుడు మాత్రము మంగళసూత్రధారణ చెప్పబడినది.

 

బ్రహ్మాదిదేవయూథైశ్చసహితౌ భూమిజాహరీ మాంగల్యసూత్రబంధాది సాంకురార్పణమబ్జజః|

వైవాహికమ్ కారయిత్వా లాజహోమాంతమేవ చ వ్రతదేశమ్ సమాజ్ఞాయ సహితౌ కమలాహరి|

(వైష్ణవఖండము – (1వ భాగము) వేంకటాచలమహాత్మ్యము - 8-24శ్లో)

 

దేవతామూర్తుల ఆభరణాలంకారములను మానవులు అనుకరించుట మనకు తెలిసినదే!! మంగళసూత్రధారణ విశేషములను ఇప్పుడు చూద్దాము.

 

షోడశసంస్కారముల (గర్భాధానము నుండి అంత్యేష్టి వరకు) సంబంధిత వేదోక్తమంత్రగర్భిత విధానములను గృహ్యసూత్రములుగా ఋషులు మనకు అందించినారు. వేదము, శాఖననుసరించి పల గృహ్యసూత్ర గ్రంథములు, ఉదాహరణకు ఋగ్వేద (అశ్వలాయన, సాంఖ్యాయన,..), యజుర్వేద (పారస్కర, ఆపస్తంబ, హిరణ్యకేశి,..), సామవేద (గోబిల, ఖదిర, జైమిని), అథర్వ (కౌశిక) మొదలగునవి గలవు.

 

వివాహమునందు కన్యాదానము, హోమము, పాణిగ్రహణము, అగ్నిపరిణయన (ప్రదక్షిణ), అశ్మారోహణము, లాజహోమము, సప్తపది, గృహప్రవేశము  మొదలగునవి ముఖ్యముగా చెప్పబడిన వైదీకవిధులు. ప్రతియొక్కవిధికీ, వేదములందు చెప్పబడిన మంత్రవిధివిధానములే ఈ సూత్రములు. ఈ గృహ్యసూత్రములందు మాంగల్యతంతునాఽనేన బధ్వా మంగళసూత్రకమ్| వామహస్తే సరమ్ బధ్వా కంఠేచ త్రిసరమ్ స్మృతమితి| అని చెప్పబడినది. దీనిప్రకారము, వధువు ఎడమచేతికి కట్టబడిన ఒంటిపేట కంకణము (ప్రతిసారబంధనము/కౌతుకబంధనము) లేదా కంఠమునకు కట్టబడిన ముప్పేటల సూత్రము మంగళసూత్రమనబడుచున్నది.

 

బ్రహ్మవిష్ణ్వీశరూపమ్ తు త్రివృత్తమ్ తత్త్రితంతుకమ్|

త్రిరత్నమ్ రుక్మజమ్ స్త్రీణామ్ మాంగల్యభూషణమ్ విదుః|

మూడు పేటలు త్రిగుణములకు, త్రిమూర్తులకు (బ్రహ్మ, విష్ణు, రుద్రులకు) సంకేతము.

 

పత్యుః ప్రాణాన్ మాంగల్యసూత్రాభ్యన్తరే ధారయన్తి పతివ్రతాస్త్రియః

పతివ్రతా స్త్రీలు తమ పతిప్రాణములను మంగళసూత్రములందు ధరింతురని ప్రసిద్ధి.

 

ధవభర్త ; సధవభర్తతోకూడిన స్త్రీసువాసిని/సుమంగళి

వివిధ ప్రాంతములందలి సధవాభరణములు వారివారి ప్రాంతీయ, కులాచారమునుబట్టి వేరువేరుగా ఉంటాయి. వివాహసమయమున వరునిచే వధువునకు ధరింపజేయబడునవి - కర్ణాటక దేశమందు తాటంకములు, ద్రవిడదేశమందు మంగళసూత్రము, గౌడదేశమునందు (Bengal) శంఖపుగాజులు, సింధూర తిలకము మొదలగునవి, పశ్చిమదేశమందు వారకూటసౌవర్ణకంకణములు మొదలగునవి ఆయా ప్రాంతములందు ముఖ్యసుమంగళి చిహ్నములుగా పరిగణింపబడుచున్నవి (సౌన్దర్యలహరి - డిండిమభాష్యము – 28వ శ్లోకము).

 

28వశ్లోకము సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీమ్ నందు తల్లీ!! జరామృత్యుభయములను తొలగించు అమృతమును సేవించు బ్రహ్మ, ఇంద్రాది దేవతలు కూడా కల్పాంతమున కాలధర్మము చెందుచున్నారు. కానీ భయంకర కాలకూట విషమును సేవించిన నీ భర్తయైన శంభుడు మాత్రము సుమంగళిచిహ్నములైన నీ యొక్క తాటంకముల మహిమచే కాలమును ఎదిరించి మృత్యుంజయుడైనాడు! అని ఆదిశంకరులు, తల్లియొక్క సౌమాంగల్యబలముచేత శంభుని ఆయుష్షుగట్టిగా ఉన్నదని వర్ణించారు. ఇక్కడ ఆదిశంకరులు తాటంకములను సుమంగళి చిహ్నములుగా చెప్పినారు.

 

దీనినే పోతనగారు భాగవతమున మంగళసూత్రమును ముఖ్యసుమంగళి చిహ్నముగా చెప్పుచూ, లోకరక్షణకొరకు, క్షీరసాగరమధన సమయమునందు వెలువడిన కాలకూటవిషమును తనభర్తని గ్రహించమని చెప్పినది, సర్వమంగళయైన తల్లి తనమంగళసూత్ర బలమును ఎంత నమ్ముకున్నదోకదా!!  అని వర్ణించారు.

 

మరియొక ముఖ్యమైన విషయము.

లలాటే చ గలేచైవ  మధ్యేచాపి వలిత్రయమ్| స్త్రీపుంసయోరిదమ్ జ్ఞేయమ్ మహాసౌభాగ్యసూచకమ్|ఇతి సాముద్రికమ్ సాముద్రికశాస్రముననుసరించి ఫాలభాగమునందు, కంఠమునందు, నడుమువద్దనూ మూడురేఖలు కలిగియుండుట స్త్రీపురుషులుభయులకునూ సౌభాగ్యకరము, ఉత్తమ సాముద్రికా లక్షణము.

 

సౌన్దర్యలహరియందలి గలే రేఖాస్త్రిస్రో యను 68వ శ్లోకమునందు ఆదిశంకరులు, తల్లీ!! నీ కంఠమునందలి మూడురేఖలు వివాహసందర్భమున అయ్యవారుకట్టిన మూడుపేటల సూత్రమువలే ప్రకాశిస్తున్నాయి అని వర్ణించారు.

 

మంగళసూత్రము ధరించబడిన కంఠము విశుద్ధిచక్రస్థానము. ఇది వైఖరీవాక్స్థానము. దీనికి సంబంధించిన వివరణ మున్ముందు చూద్దాము.

 

సర్వమంగళయైన తల్లియొక్క అనుగ్రహమంగళము కలుగవలెనని ప్రార్ధిస్తూ

 

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment