Friday 24 August 2018

mANikyamakuTAkAra-jAnudvaya-virAjitA మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

సుకుమారే సుఖాకారే సునేత్రే సూక్ష్మమధ్యమే|
సుప్రసన్నా భవ శివే సుమృడీకా సరస్వతీ|| 
(త్రిపురసుందరీవేదపాదస్తవము-75)
మాణిక్య-మకుటాకార-జానుద్వయ-విరాజితా
మాణిక్య-మకుటాకారమాణిక్యములుపొదిగిన మకుటాకారము గలిగిన
జాను-ద్వయమోకాళ్ళ జంట
విరాజితావెలుగుచున్న తల్లి
మాణిక్యములుపొదిగిన మకుటాకారము గలిగిన మోకాళ్ళ జంటతో వెలుగుచున్న తల్లికి నమస్కారము.
మకుటమ్ టోపికా నామకమ్ (కల్యాణశ్రీకలా). మకుటము అంటే టోపీవంటి ఆకారముగలది. మకుటము సాధారణముగా తలకి ధరించునది కదా!! మరి మోకాళ్ళకు మకుటముఅని చెప్పుటయందలి ఆంతర్యము??

తల్లి శరీరము మంత్రమయమని చెప్పుకున్నాముకదా!! పంచదశీమంత్రమునందలి మూడుకూటములు వ్యక్తీకృతమగు అవయములు, వాగ్భవకూటము ముఖము, కామరాజకూటము మధ్యభాగము మరియు శక్తికూటము కటికి అధోభాగము. సహస్రనామములందు రూపవర్ణనలో వాగ్భవకూటమునందు ఒక నామము, మధ్యకూటమునందు ఒక నామము మరియు శక్తికూటమునందు మూడు నామములందు మాత్రమే ద్వయ వాడినారు వాగ్దేవతలు. ద్వయయనునది శివశక్తుల సమైక్యతకు సంకేతము.

వాగ్భవకూటసంబంధిత వాక్కు, నోటిద్వారా వ్యక్తమౌతుంది. దంతములను వర్ణించు శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా యను నామమునందలి ద్వయ, వాగర్ధములకు సూచితముగనున్నది. వాగర్ధములేకదా జగన్మాతాపితరులైన పార్వతీపరమేశ్వరులు!!. 

కామరాజకూట సంబంధిత నామములందు, నాభ్యాలవాలరోమాళీలతాఫలకుచద్వయీ నందు ద్వయ చెప్పబడినది. ఈ నామము తల్లియొక్క కుచద్వయములైన సూర్యచంద్రులను సూచించునది. సంకల్పవికల్పములద్వారా జరుపు విషయ వ్యవహారములకు సంకేతము, కామరాజకుటము. సమస్త విషయ వ్యాపారములకు బుద్ధి, మనస్సు ఆధారమగుటచే, ఈ కూటమునకు బుద్ధి, మనస్సు ముఖ్యమైనవి. కుచద్యయమందలి సూర్యుడు బుద్ధికి/జ్ఞానమునకు, చంద్రుడు మనస్సునకు సంకేతము. సూర్యచంద్రులు శివశక్తులకు సంకేతములు. ఇచ్చట వాడిన ద్వయయను పదము బుద్ధి, మనసు రూపములందలి అమ్మ-అయ్యలను సూచిస్తుంది.

ఊరువులనుండి (తొడలనుండి) పాదములవరకుగల భాగము, శక్తికూటము వ్యక్తీకరింపబడునది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తియని శక్తి మూడువిధములని చెప్పుకున్నాము. తొడలనుండి పాదములవరకుగల నామములలో కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా (ఇచ్ఛాశక్తి), మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా (జ్ఞానశక్తి), పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా (క్రియాశక్తి), మూడు నామములందు ద్వయ వాడినారు వాగ్దేవతలు.
ఇచ్ఛాశక్తి:
కామేశుడుయనినంతనే ఇచ్ఛ/కోరికకు సూచితము. అందువలననే శక్తికూటమునందలి ఇచ్ఛాశక్తి సూచిత  ఈ నామమునందు కామేశశబ్దమును వాడినారు వాగ్దేవతలు. ఇచ్ఛాశక్తి  సంబంధిత శివశక్తులజంటకు (వాణీహిరణ్యగర్భులు) సూచితముగ ద్వయ వాడబడినది.
జ్ఞానశక్తి:
మకుటముయనిన శిరస్సునందు ధరించబడునది. శిరస్సు, జ్ఞానము/బుద్ధికి స్థానము. అందువలన ఈ నామమునందలి ద్వయ, జ్ఞానశక్తి జంటకు (లక్ష్మీనారాయణులు) సూచితము. మానవ శరీరములందు, (Brain) మెదడుకి, (Knee) మోకాటికి సంబంధమున్నదని ఆధునిక వైద్యరంగములో పరిశోధనలుజేసి ఇప్పుడిప్పుడు తీర్మానింపబడిన విషయము. కానీ మన ఋషులు దీనిని ఎప్పుడో దర్శించి ధృవపరిచారు.

ఇప్పుడు తల్లి కవచ స్తోత్రములందు మోకాళ్ళను రక్షించు అమ్మనామములను గమనించి చూడండి.

క్రియాశక్తి:
క్రియాశక్తిసూచిత నామము పదద్వయ... దీనియందలి వివరము, ఆ నామము వచ్చినప్పుడు చూద్దాము.

ఊరువులనుండి పాదములవరకుగల నామములందలి మంత్రరహస్యములు ఉపాసకులకు విదితము.

మరి తల్లిమోకాళ్ళను శంకరభగవత్పాదులు ఎలా దర్శించారో తెలుసుకొనడానికి సౌన్దర్యలహరిని ఆశ్రయిద్దాము.

కరీంద్రాణామ్ శుండాన్ కనక కదలీకాండ పటలీ యను 82వశ్లోకమునందు ఓ!! గిరిరాజపుత్రీ!!నీ పతికి పంచ-అంగ నమస్కారము జేయుటకు మరల మరల వంగినప్పుడు భూమి మీద ఆనించుటచే నీ మోకాటిచిప్పలు కఠినములైనాయని అతిలావణ్యవతియైన తల్లియొక్క మోకాటిచిప్పలు గట్టిగాఉండుటయందలి కారణమును ఈ శ్లోకమునందు వివరించారు

తల్లియొక్క మాణిక్యమకుటములవంటి జానువులు నాకు జ్ఞానమును ప్రసాదించవలెనని ప్రార్ధిస్థూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment