Sunday 15 July 2018

kadamba-manjarI-klupta-karNapUra-manOhara కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

కర్ణలమ్బిత కదమ్బమఙ్జరీ కేసరారుణ కపోలమణ్డలమ్|
నిర్మలమ్ నిగమవాగగోచరమ్ నీలిమానమ్ అవలోకయామహే|| 
(కృష్ణకర్ణామృతము-2.31)
చెవులందు వేలాడుచున్న కడిమిపూలగుత్తులమాలలచే ఎఱ్ఱవాఱిన చెక్కిళ్ళతో, నిర్మలుడై, వేదాంతములచేకూడా ప్రతిపాదింపబడలేకపోయిన నల్లని కృష్ణుని చూచుచున్నాము.
కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా
కదంబకడిమి
మంజరిపూలగుత్తి
క్లుప్తకూర్చబడిన/కప్పబడిన
కర్ణపూర - చెవులపైభాగము
మనోహరామనస్సును హరించు తల్లి

చెవులపైభాగము కడిమిపూలగుత్తితో కూర్చబడి అతి మనోహరముగా ఉన్నతల్లికి నమస్కారము.
ఇది బాహ్యార్ధము.

దివ్యవృక్షము/కల్పవృక్షము అయిన కడిమిచెట్టు (పూలు) ఆదిదంపతులైన శివా-శివులకు, మేనమామమేనల్లుళ్ళయిన కృష్ణ, కార్తికేయులకు అత్యంత ప్రీతికరమైనదిగా రామాయణ, భాగవతాది పురాణములందు చెప్పబడినది. ఎర్రనిరంగు కడిమిపువ్వులు అత్యంత సువాసనకలిగి ఒకవిధమైన మత్తును కలిగించునవిగాయుండును.

సంస్కృతమునందు చెవులతో వినబడినదానికి శృతియనిపేరు. శృతిః స్త్రీ వేద ఆమ్నాయ స్త్రయీ (అమరకోశము). వేదములకు శృతియని మరియొక పేరు. వేదములకు ఛందస్సు పరిమళము. జపముచేయునప్పుడు, మంత్రఛందస్సు పేరుచెప్పి చేతిని ముక్కుదగ్గర పెట్టి ఆ పరిమళమును ఆఘ్రాణిస్తున్నట్లు చేయుట మీరెరుగుదురు.

ఛందస్సను పరిమళములతో కూడిన శృతులను అమ్మ చెవులద్వారా వినుచున్నదియని చెప్పుటకు సువాసనలతోకూడిన కడిమిపువ్వుల గుత్తులను చెవులపైభాగములకు అలంకరించుకున్నట్లు వాగ్దేవతలు సూచిస్తున్నారా అన్నట్లున్న నామము ఇది.
మరియు,
శ్రీపాదుల సంఖ్యా సూత్రము:
అకటాదినవ పాదిపంచ యాద్యష్ట సంకేతరూపాసంఖ్యా
నుండి వరకు, నుండి వరకు, నుండి వరకు (అకటాది) ఉన్నఅక్షరాలు ఒకటినుండి తొమ్మిది(నవ) అంకెలకు సమన్వయము. నుండి వరకు (పాది-ప ఆది) ఒకటి నుండి ఐదు (పంచ) అంకెలకు, నుండి (య ఆది – యాది) వరకు ఒకటి నుండి ఎనిమిది (అష్ట) అంకెలవరకు సమన్వయమని ఈ సూత్రముయొక్క అర్ధము.

ఈ సూత్రము ప్రకారము కదంబ 183 సంఖ్యకు సంకేతము.

కదంబమునకు సంస్కృతమునందు కర్ణపూరక  (కుడిచెవియందలి కదంబమంజరి) ఒక 183 దినముల సమూహము సూర్యుని ఉత్తరదిశ గమనమైన ఉత్తరాయణమునూ, (ఎడమచెవియందలి కదంబమంజరి) మరియొక 183 దినముల సమూహము దక్షిణదిశ గమనమైన దక్షిణాయనమునూ సూచిస్తున్నట్లు ఉన్నాయి.

సూర్యకిరణములు ఉత్తరాయణ కాలములో (Jan – June) ఉత్తరదిశ (ఊర్ధ్వదిశ) గాను, దక్షిణాయనకాలములో (Jun – Dec) దక్షిణదిశగాను ప్రయాణించుట చూడవచ్చు.  ఉత్తరాయణ కాలములో వేడిమి, దక్షిణాయణ కాలములో శీతలము మనము తెలిసిన విషయమే. ఇందువలన ఉత్తరాయణము  సూర్యసంబంధమైన(పింగళ) కుడిచెవి పైభాగమునకు, దక్షిణాయనము చంద్రసంబంధమైన(ఇడ) ఎడమచెవి పైభాగమునకు సమన్వయించడమైనది.

శరీరే సూర్యసోమాగ్ని సంక్రాంతిజ్ఞో భవానఘ|
తత్ర సంక్రాంతికాలా హి బాహ్యాస్తృణసమాః స్మృతాః||  
(నిర్వాణప్రకరణము పూర్వార్ధము 81.118)
ఉత్తరాయణ, దక్షిణాయనములను వశిష్ఠులవారు యోగపరముగా ప్రాణాయామ ప్రక్రియతో అన్వయించి శ్రీరాములవారికి నిర్వాణప్రకరణమునందు శిష్ఠులవారు ఉపదేశముచేసారు.

తల్లి కర్ణములు వాయుతేజస్సుతో ఏర్పడినవి. వాయువువలన శ్రోత్రజ్ఞానము (శబ్ద జ్ఞానము), దిక్-జ్ఞానము కలుగుతున్నవి. కదంబ మంజరిని చెవుల పైభాగమునందు అలంకరించుకొన్న తల్లి కర్ణములు సంవత్సరములోని సూర్యగమన దిక్కులను (ఉత్తరాయణ, దక్షిణాయన కాలములను) తెలియజేయుచుట్లున్నది ఈ నామము.

తల్లి కర్ణపూరములను కదంబపుష్పములు కప్పియుండుటయందలి మరియొక రహస్యమును మున్ముందు తెలుసుకుందాము.

భవసాగరములో దిక్కుతెలియక కొట్టుమిట్టాడుతున్ననన్ను బయటకులాగి మోక్షమార్గపు దిక్కును తల్లి చూపించవలసినదిగా ప్రార్ధిస్తూ

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment