Friday 13 July 2018

upAdhitrayam ఉపాధిత్రయము


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః

స్థూలశరీరే కాన్తిమతీ ప్రాణశరీరే శక్తిమతీ|
స్వాన్తశరీరే భోగవతీ బుద్ధిశరీరే యోగవతీ|| (ఉమాసహస్రము – 20.9)

ఉపాధిత్రయము

సమిష్టిస్థాయి పరమాత్మయే వ్యష్టి స్థాయిలోని ఆత్మ. ప్రతిజీవికీ స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు అని మూడు ఉపాధులుగలవు. మాయోపేతమైన ఉపాధిగత భేదములచేతనే ఆత్మ ఈ చరాచరసృష్టియందలి వివిధ రూపములుగ కనబడుతున్నది.

పంచీకృతమహాభూతసంభవమ్ కర్మసంచితమ్|
శరీరమ్ సుఖదుఃఖానామ్ భోగాయతనముచ్యతే|| (ఆత్మబోధ – 11)
పంచీకృతమైన (ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి) పంచమహాభూతములచే ఏర్పడినది స్థూలశరీరము. ఆత్మ (సంచితకర్మఫలమువలన) పూర్వకర్మానుసారము స్థూలశరీరముద్వారా (సుఖము, దుఃఖము) ద్వంద్వములను అనుభవిస్తున్నది. అందువలన ఇది భోగాయతనము అంటే జీవుడు భోగించుటకు ఈ ఉపాధి ఒక వాహనము/వస్తువు వంటిది. అస్తి, జాయతి, వర్ధతి, విపరిణమతి, అపక్షీయతి, వినశ్యతి యనబడు ఆరువిధములైన వికారములను (షడ్వికారములను) కలిగినది స్థూలశరీరము.

పంచప్రాణమనోబుద్ధిదశేంద్రియసమన్వితమ్|
అపంచీకృతభూతోత్థమ్ సూక్ష్మాంగమ్ భోగసాధనమ్||(ఆత్మబోధ – 12)

(ప్రాణపానసమానవ్యానఉదాన) పంచప్రాణములు, (వాక్-పాణి-పాద-పాయు-ఉపస్థలు) పంచకర్మేంద్రియములు, (రూప)నేత్ర-(రస)జిహ్వ-(గంధ)ఆఘ్రాణ-(స్పర్శ)త్వక్-(శబ్ద) శ్రోత్రములు నేత్రజిహ్వాఘ్రాణత్వక్చోత్రములు శబ్దస్పర్సరూపరసగంధములను గ్రహించు పంచజ్ఞానేంద్రియములు, అంతఃకరణమను అంతరేంద్రియములతో ఏర్పడినది సూక్ష్మశరీరము. అంతఃకరణమునకు నాలుగువిధములైన వృత్తులు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అంతఃకరణము ఆలోచించునప్పుడు మనస్సుగాను, వివేచన చేయునపుడు బుద్ధిగాను, వివేచనతో విషయ నిర్ధారణ చేయునపుడు జ్ఞాపకశక్తితోకూడిన చిత్తముగాను, నేను/నా అనునప్పుడు అహంకారముగాను ప్రతిఫలిస్తుంది. అపంచీకృత పంచమహాభూతములవలన ఏర్పడిన సూక్ష్మశరీరము తేజోమయశరీరము. ఇది భోగసాధనము. దీనినే లింగశరీరము అనికూడా అందురు. లింగ్యతే జ్ఞాయతే అనేనేతి లింగం - దీనిచేత తెలియబడుటచే లింగముయనబడును.

అఖండవిశ్వవ్యాపిత చైతన్యశక్తి ఆహారముద్వారా మనము స్వీకరిస్తున్నాము. ఆహారమునందలి స్థూలభాగము కార్యశక్తిగాను, సూక్ష్మభాగము ఆలోచనాశక్తిగాను పరివర్తనచెందుతాయి. ఆహారమునకు మనస్సునకు తద్వారా మోక్షమునకు గల సంబంధమును ఈ క్రిందిశ్లోకమునందు చెప్పబడినది.

ఆహారశుద్ధౌ సత్త్వశుద్ధిః  సత్త్వశుద్ధౌ ధృవాస్మృతిః
స్మృతిలమ్భే సర్వగ్రంధీనామ్ విప్రమోక్షః (ఛాందోగ్యోపనిషత్తు 7.26.2)
ఆహారశుద్ధివలన మనసుశుద్ధమౌతుంది. మనసు శుద్ధమైనప్పుడు చిత్తము ధృవపడుతుంది. చిత్తముధృడమైనప్పుడు, సర్వగ్రంథులనుండి మోక్షము కలుగుతుంది.

ఆహారశుద్ధి అంటే పాత్రశుద్ధి, పదార్ధశుద్ధి మాత్రమే కాదు. ఆహారము తయారు చేయువారి మనస్సు సాత్త్వికాలోచనలతో కూడియుండవలెను. కోపముగా ఉన్నవారు వండినప్పుడు ఆహారము మాడిపోవుట, సరిగా ఉడకకపోవుట వంటివి చాలాసార్లు గమనించే ఉంటారు. రాజసిక/తామసిక ఆలోచనలతో నీరుతెర్లించినా, దాని ఫలితము ఆ నీటి మీద ఉంటుంది. దీనిని మనము ప్రత్యక్షముగా చూడలేము. అటువంటి నీటి ప్రభావము దానిని స్వీకరించిన వారి మనస్సుపై తప్పక ఉంటుంది. ఇక ఆహార విషయము వేరే చెప్పవలెనా!!

అందువలన సాధకులైనవారు ఆహారవిషయములో చాలా జాగ్రత్తగా ఉండవలెను. సాధనామార్గమునందు ఆహారశుద్ధి అతిముఖ్యవిషయము. जैसे अन्न् वैसे मन् ఇది నా మాట కాదు. శ్రుతులయందు చెప్పబడినది.

పూర్వకాలమునందు ఇలాటి శుద్ధిని పాటించుటకే మడి యని చెప్పబడినది. కానీ మడి, అంటు, ముట్టు వీటన్నిటినీ పాటించుటకు మన్నించవలెను పాటించుటకు కాదు, పాటించకుండా ఉండుటకు చాలా తేలికగా కారణములు చెప్పి ఆ!! అప్పటిలో ఉమ్మడి కుటుంబాలు, స్త్రీలు ఇంట్లోనే ఉండేవారుకాబట్టి పాటించగలిగేవాళ్ళు. ఛాదస్తముగానీ!! అవన్నీ ఈ కాలములో కూడా ఏమిటండి? ఎలా కుదురుతాయండీ!! అనేవాళ్ళు ఎంతోమంది. ఆ కాలములోలాగ చేయలేకపోవచ్చు. ఎదైనా వీలైనంతవరకు పాటించాలి అని శాస్త్రమునందు చెప్పబడినది. మొత్తముగా వదిలేయకుండగ, చాతనైనంతవరకు ఆచారములను పాటించడము చాలాముఖ్యము. పూర్వకాలములో ఇబ్బందిరోజుల సమయములో స్త్రీలు విడిగా ఒకగదిలో కూర్చునేవారు. ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్లో అలా కుదరదు. కాని ఉన్నచోటులోనే ఒక మూలవిడిగా కూర్చోవచ్చు. కలుపుకోనక్కర్లేదు. అలాగే మడి, అంటు కూడాను.  I do not know how many feminists would be angry with me for this.

ఇలాచేయుట స్త్రీలను అగౌరవించినట్లు అని మాత్రము అభిప్రాయపడవలదు. మన హిందూమతమునందు స్త్రీని గౌరవించినట్లు వేరేఎక్కడా గౌరవించబడినట్లు చెప్పబడలేదు. మీరు శాస్త్రపరముగా కాకుండా ఆలోచించినా, స్త్రీలకు ఆ సమయములో విశ్రాంతి చాల అవసరము. అలా అనుకుని వారు ఈ ఆచారమును పాటించినా పరవాలేదు.  

ఏదైనా మూర్ఖముగా 50ఏళ్ళక్రితము పాటించిన విధముగానే చేస్తాను అని చేయనక్కర్లేదు. కానీ వారి వారి సౌకర్యప్రకారము వీలైనంతవరకు తప్పకపాటించుటకు ప్రతిఒక్కరూ ప్రయత్నించవలెను.

మహాపెరియవా ఒకసారి చెప్పారు. తిరుగుతూ ఉండే ఒక చక్రము దాన్ని ఎవరన్నాతిప్పేవరకు తిరుగుతూనే ఉంటుంది. తిప్పడము ఆపేస్తే, దానికి ఉన్నవేగము కొద్దికొద్దిగా తగ్గిపోయి కొంతసేపుతరువాత ఆగిపోతుంది. అదేవిధముగా మనఫూర్వీకులు చేసిన ఆచారానుష్ఠానముల/సన్మార్గాచరణ ఫలమును, వారి వారసులమైన మనము ఆధ్యాత్మిక/భగవత్-చింతన, తెలివితేటల రూపములోను, ఐశ్వర్య/సౌభాగ్యములరూపములోను అనుభవిస్తున్నాము. ఆచార అనుష్ఠానములు మనము పాటిస్తేనే, మన తరువాత వారసులు వాటి ఫలమును పొందగలరు. మన పెద్దవాళ్ళ పుణ్యము ఎంతవరకు తీస్కెళ్ళగలదో/ఎన్ని తరాలవరకు వెళ్ళగలదో అంతవరకు, చక్రము వేగము ఉన్నంతవరకు మెల్లి మెల్లిగా తిరుగుతుంది. ఎప్పుడైతే ఆచార అనుష్ఠానలోపము మనవలన జరుగుతుందో, ఆ చక్రభ్రమణకు మనము దోహదముచేయనపుడు, అది మనవారసులను, వారి వారసులను తప్పక బాధిస్తుంది. దీనివల్ల ఏమి కోల్పోతున్నామో వెంటనే తెలియకపోవచ్చు. పూర్వీకులు తిప్పుతూ మనకు అందించిన ఆచారానుష్ఠాన చక్రమును మనము తిప్పడము మానేస్తే...

ఇది చాలా సులభముగా అర్ధముకావాలంటే, మనము సంపాదించకుండా కూర్చొని పూర్వీక ఆస్థులను అనుభవించడము వంటిది. ఉన్నదంతా మనము ఖర్చుచేస్తే, మన పిల్లలకు ఏమీ ఆస్థులు మిగలవు కదా!! మహా అయితే పూర్వీక సొత్తు ఒకటి రెండు తరాలకు రావచ్చు. వీళ్ళు సంపాదించకుండా ఖర్చుపెడుతూ ఉంటే, ఆస్థులు క్రమేణా తగ్గిపోయి ఆ తర్వాత వారసులు భిక్షమెత్తుకొనవలసినదే!!

ఇక్కడ చెప్పిన ఆస్థి, వస్తు సంబంధమైనది. మహాపెరియవా చెప్పినది ఆధ్యాత్మిక సంబంధమైనది.

ఆచారానుష్ఠానముల అంతిమలక్ష్యము మోక్షమే అయినాగానీ, అవి శ్రద్ధగా పాటిస్తూపోతూఉంటే చాలు, వాని ఫలితము అవాంఛనీయముగానే వచ్చిచేరుతుంది. మనము/పిల్లలు బాగుండాలని కోరికతో ఇవి చేయాలని కాదు. అలా అనుకొని ప్రారంభించి చేసినా తప్పులేదు. ఈ శుద్ధి మెల్లిమెల్లిగ మనలను ఆ దిక్కుగా తీసుకువెళ్తుంది.

***

ఒక వ్యవసాయి వద్ద మూడువిధములైన వరిధాన్యము/పంట గలవు. ఒకటి పండించి గాదెలో నిలవజేసిన ధాన్యము.  రెండవది గాదెలోఉన్న ఒక భాగము పొట్టుతీసి ఈరోజు వాడుకొనుటకు సిద్ధముగానున్నది. మూడవది  ప్రస్తుతము పొలములో పండించబడుతున్నది. పొలములో పండించబడుతున్నది కొన్నిరోజులతరువాత గాదెలో చేరుతుంది.

ఇదేవిధముగా ప్రతిజీవికీ మూడు విధములైన కర్మలు గలవు. పూర్వజన్మలనుండి పోగుచేసుకున్న సంచితకర్మ. ఆ సంచితకర్మనందలి ఒక భాగము పండి ఈ జన్మలో అనుభవించుటకు తయారైన ప్రారబ్ధకర్మ.

ప్రారబ్ధమ్ భోగతో నశ్యేత్
జన్మాది నుండి అంతమువరకు అనుభవించునది ప్రారబ్ధకర్మ. ఈ ప్రారబ్ధకర్మానుసారమే ప్రస్తుత జన్మయందు సుఖదుఃఖములు వంటి ద్వంద్వానుభవములు కలుగుచుండును. శ్రీమద్భాగవతమునందలి జడభరతుని కర్మానుభవ వృత్తాంతము మీకు తెలిసేయుండవచ్చు. మూడవకర్మ, ఈ జన్మలోచేస్తున్న కర్మ, ఆగమకర్మ. ఇది ఈ జన్మానంతరము సంచితకర్మతో కలుస్తుంది.

అపశ్యమనుభోక్తవ్యమ్ కృతమ్ కర్మ శుభాశుభమ్
మంచిగాని చెడుగాని చెసినది అనుభవింపక తీరదు.

పంచీకృతమహాభూతముల వలన ఏర్పడిన ఇరవైఐదు తత్వాలతో కూడిన స్థూలశరీరము జీవునికి భోగాయతనము.  పంచప్రాణములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతఃకరణములతో ఏర్పపడినది భోగసాధనమైన సూక్ష్మశరీరము.

కారణశరీరము పూర్వజన్మ వాసనల ఫలితము. మనము దేనిగురించి అధికముగా ఆలోచించి చిత్తమునందు నిలుపుతామో, దేనియందు చిత్తము లయమగునో ఈ జన్మతదనంతరము ఆ ఉపాధిని పొందుతాము. నిత్యము, సత్యము, శాశ్వతము అయిన పరమాత్మను నిరంతరము తలపులందు నిలుపుటవలన, ఆ పరమపదము పొందుతాము.

ఇది స్వయముగా భగవంతుడు
అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్.. (భగవద్గీత 8.5)
యమ్ యమ్ వాపి స్మరన్భావమ్.. (భగవద్గీత 8.6) శ్లోకములందు చెప్పినాడు.
ఈ శ్లోకమునందుఅతిముఖ్యమైనది. అంతకాలమునందు కూడా నన్ను స్మరించినచో యని అర్ధము. అంతకాలమునందు మాత్రము భగవత్స్మరణ చేయమని కాదు.  కారణము, అభ్యాసములేనిదే, అంత్యకాలమునందు మాత్రము భగవన్నామస్మరణ ఎటులవచ్చును?

చరాచరసృష్టి కాలపరిమితమైనది. అట్టి అశాశ్వతమైన చరాచరసృష్టిని శాశ్వతము/సత్యము అని తలచుటయే వేదాంతపరిభాషలో రజ్జుసర్పభ్రాంతియందురు. ఇదియే అవిద్య/అజ్ఞానము/మాయ.

అవిద్య వలన పరమాత్మయందు కాకుండా, అనిత్య, అశాశ్వత ఉపాధులయందు చిత్తమును నిలుపుతూ ఉంటాము. ఈ అవిద్యయే మరల జన్మమునకు కారణహేతువు/బీజము. ఇట్లు మానవులు ప్రారబ్ధకర్మను స్థూలసూక్ష్మకారణశరీరములను ఉపాధులతో అనుభవించుతూ ఆగమకర్మను సంచితకర్మతో కలుపుకుంటూ జననమరణ చక్రములో తిరుగుతూఉంటారు.

అనిర్వాచ్యానాద్యవిద్యారూపమ్
శరీరద్వయస్య కారణమాత్రమ్
సత్స్వరూప అజ్ఞానమ్
నిర్వికల్పరూపమ్ యదస్తి తత్కారణ శరీరమ్ (తత్త్వబోధ – 3.3)

అనాదియైన ప్రకృతి, అనిర్వచనీయమైన అవిద్యయే కారణశరీరము. ఆత్మస్వరూపమును తెలియకుండా అడ్డుకునేది   అవిద్యాస్వరూపమైన కారణశరీరము. స్థూలసూక్ష్మశరీరద్వయములకు కారణమైనది కారణశరీరము.

బీజము కారణము, వృక్షము కార్యము. బీజము, వృక్షము వేరుకానటులే, కారణశరీరము మరియు స్థూలసూక్ష్మశరీరములు వేరుకాదు. బీజమునందు వృక్షము (ఆకులు, పువ్వులు, కొమ్మలు మొదలైనవి) అవ్యక్తరూపమున ఉన్నవి. వృక్షమునందు అవి వ్యక్తమగుచున్నవి. అదేవిధముగా, స్థూలసూక్ష్మశరీరములు కారణశరీరమునందు అవ్యక్తముగానున్నవి.

వరి బీజము నుండి వరి, గోధుమ బీజమునుండి గోధుమ పండినట్లు, బీజముయొక్క ప్రకృతినిబట్టి మొక్క. అదేవిధముగా, అవిద్య/అజ్ఞానరూప బీజమైన కారణశరీరమునుబట్టి స్థూలసూక్ష్మశరీరములు ఏర్పడును.

అవిద్య/అజ్ఞానము త్రిగుణోపేతమైనది. సత్యమైన ఆత్మతత్త్వమును కప్పివేసే తమోగుణోపేత ఆవరణ, మాయాహేతువైన రజోగుణోపేత విక్షేపశక్తి మరియు దైవీకలక్షణములను ప్రతిఫలించు సత్వగుణము. ఆవరణ శక్తి (ఆత్మను) ఉన్నదానిని తెలియనివ్వదు. విక్షేపశక్తి ఉన్న ఒకే పరమాత్మను వివిధరూపములుగా చూపించుటద్వారా బంధహేతువు. ఈ ఆవరణ తొలగినప్పుడు మాత్రమే సత్యము, నిత్యము అయిన ఆత్మస్వరూపము తెలియబడును. (Talks with Ramana Maharshi - #513)

ఈ ఆవరణ తొలగి కారణశరీరరహితులై సత్యమును గ్రహించినవారు, అవతారపురుషులైన రామకృష్ణ పరమహంస, కాంచీ మహాపెరియవా, రమణమహర్షి వంటి మహాజ్ఞానులు.  సాధకులైనవారు జ్ఞానసముపార్జనతో ఈ ఆవరణశక్తిని తొలగించుటకు ప్రయత్నించవలెను. జ్ఞానము, అద్వైతము అనగానే గుర్తుకు వచ్చేది ఆదిశంకరులు. ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మిగారు పాడిన భజగోవిందము స్తోత్రమునకు ముందు ఆ ఆల్బమ్-లో మహానుభావులు రాజాజీగారు సాధకులకు ఆదిశంకరులవారి గురించి చెప్పిన వచనము ఒకటి వస్తుంది. విననివారు దయచేసి వినండి. ఆయన ద్వైతబాణీలో వ్రాసిన కురై ఒన్రుమ్ ఇల్లై మరైమూర్తి కణ్ణా యను పాటకూడా అన్నమాచార్య కీర్తనల ఆల్బమ్-లో ఉన్నది. Beautiful song and melodious tune. మీరందరూ వినే ఉంటారు. ఎందరోమహానుభావులు అందరికీ వందనములు.

ఇక ఉపాధిత్రయమునకు అతీతమైన నాల్గవది ఆత్మస్వరూపము.

అనాద్యవిద్యాఽనిర్వాచ్యా కారణోపాధిరుచ్యతే|
ఉపాధిత్రితయా దన్యమాత్మానమవధారయేత్|| (ఆత్మబోధ - 14)
స్థూలసూక్ష్మకారణశరీరములకు అతీతమైనది ఆత్మ. ఈ మూడు ఉపాధులయందు ఉంటూ, వాటికి అతీతముగాకూడా ఉండునది ఆత్మ.

దేహేన్ద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణమ్|
తద్ వృత్తి సాక్షిణమ్ విద్యాదాత్మానమ్ రాజవత్ సదా||(ఆత్మబోధ - 18)
శరీరము (స్థూల), ఇంద్రియములు, మనస్సు, బుద్ధి (సూక్ష్మ), ప్రకృతి (కారణ) – వీటన్నిటికీ అతీతమైనది ఆత్మ. ఈ మూడు ఉపాధుల వృత్తులను ఒక రాజువలే, సాక్షివలే, చూచుచున్నది.

పరమాత్మ - సర్వాంతర్యామి
ఆత్మసాక్షి/పరమాత్మ ప్రతిబింబము
కారణశరీరముఅవిద్య ఆవరణ
సూక్ష్మశరీరముఅపంచీకృత పంచమహాభూతములచే ఏర్పడిన పంచప్రాణములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, అంతఃకరణము (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము)
స్థూల శరీరముపంచీకృత పంచమహాభూతములచే ఏర్పడిన భౌతిక శరీరము

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment