Tuesday 3 July 2018

caturbAhusamanvitA చతుర్బాహుసమన్వితా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
జగదమ్బలమ్బమానా పార్శ్వద్వితయే తవాగలాద్భాతి|
సాన్ద్రగ్రథితమనోజ్ఞ ప్రసూనమాలేవ భుజయుగలీ|| (ఉమా సహస్రము 11.9)
చతుర్బాహు-సమన్వితా
చతుర్బాహు సమన్వితాయై నమః
నాలుగుబాహువులతోవిలసిల్లు తల్లికి నమస్కారము.
దేవతలను అనుగ్రహించవలెనని సంకల్పించి, సాకారరూపము ధరించి వస్తున్న చిచ్ఛక్తిరూప వివిరణ ప్రారంభనామము. చిదగ్నికుండమునుంచి వెలువడిన సింధూరారుణ కాంతిపుంజమునుండి చతుర్బాహువులతోకూడిన రూపము దర్శనమిచ్చినదియని ఈ నామమునకు బాహ్యార్ధము. ఈ బాహువులు తామరతూడులవలే మెత్తదనముగలిగి, తీగలవలెనున్నవని సౌన్దర్యలహరిలో వర్ణించారు, శంకరభగవత్పాదులవారు.

అంధకారియైన శివుని గోటితో పంచముఖబ్రహ్మ ఐదుశిరస్సులలోని ఒక శిరస్సును ఖండింపబడుటచే, తల్లీ!! శివునినుండి నన్నుకాపాడుయని తల్లియొక్క తామరతూడువలె మృదువైన లతలవంటి చతుర్బాహువులను, మిగిలిన తన సమసంఖ్యయైన చతుర్ముఖములతో బ్రహ్మ ప్రార్ధించినట్లు సౌన్దర్యలహరి 70వశ్లోకము మృణాళీమృద్వీనామ్ నందు శంకరభగవత్పాదులవారు వర్ణించారు.

కావ్యకంఠగణపతిముని, ఉమాసహస్రము 11.9శ్లోకమునందు, తల్లీ కంఠమునుండి వ్రేలాడు నీభుజములు, దట్టముగాకూర్చబడిన పూలమాలలవలే ఉన్నయని వర్ణించారు.

చతురస్రమ్ సమారమ్భ్య నవచక్రాణ్యనుక్రమాత్|
ఉన్నతోన్నతమః మధ్యాచ్చక్రమ్ స్యాన్నిధనేధనమ్|| (నిత్యోత్సవ తంత్రము)
అంతరార్ధమును చూసిన, బాహువు అనిన భుజము. చతుర్భుజములు కలిగిన రేఖాచిత్రము చతురస్రము. చతుర్బాహు సమన్వితా అంటే చతురస్రమైన త్రైలోక్యమోహనచక్రముతో కూడిన నవావరణలు గల శ్రీచక్రము ఆవిర్భవించినదియని అర్ధము

ఒక పని చేయుటకు మూడుశక్తులు అవసరము. మొదట చేయవలనను సంకల్పశక్తి లేదా ఇచ్ఛాశక్తి. సంకల్పము ఉంటే చాలదు కదా, ఆ పని ఎటులచేయువలెనను జ్ఞానము కూడా అవసరము. ఇదియే జ్ఞానశక్తి. ఇవి రెండు ఉన్నాచాలదు. ఆ పని చేయుటకు శక్తికావలెను. అది క్రియాశక్తి.

తే ధ్యానయోగానుగతా అపశ్య౯ దేవాత్మశక్తిమ్ స్వగుణైర్నిగూఢామితి
సత్యజ్ఞానానంద లక్షణము గల పరమాత్మ, అంతర్లీనశక్తి,  ప్రకాశవిమర్శ రూపములు. నిర్గుణ నిరాకార బ్రహ్మవస్తువైన పరమాత్మ సగుణ సాకారరూపమును ధరించుటకు నిగూఢముగానున్న ఇచ్ఛాశక్తితో సంకల్పించి, స్వాంతర్గత ప్రతిబింబ-జ్ఞానశక్తితోకూడిన క్రియాశక్తితో, ప్రతిచ్ఛాయాబింబమును ఆవిర్భవింపజేసినది. పరమత్మయందుగల ప్రకాశవిమర్శవిశేషములు ప్రతిబింబమునందును ప్రతిఫలించును. ఈ విధముగా ఏర్పడిన సంవిద్, ప్రకాశ, విమర్శ, మిశ్ర బిందుచతుష్టయమే మహాత్రిపురసుందరీ సంకేతరూపము. (కామకలావిలాసము)

చిదగ్నికుండమునుండి ఏర్పడిన అనంత ఉదయసూర్యుల తేజస్సు గలిగిన కాంతిపుంజము నుండి సగుణసాకార రూపము దర్శనమివ్వబోతోంది. కుండమునుండి పైకి ఆవిర్భవించు తల్లి అత్యద్భుత కేశాదిపాదాంత రూపవర్ణనను వచ్చేనామములలో చూద్దాము. సృష్టి, స్థితి, లయకారకమైన పరమాత్మ సంకల్పమాత్రముచే చేయు అవ్యక్త, మహత్-తత్త్వ, అహంకార, పంచభూతాది సృష్టిక్రమమును ఈ స్తోత్రనామములందు నిగూఢముగా సంకేతింపజేసినారు వాగ్దేవతలు. అందువలననేమో వీరు, దీనికి సూచకముగా రూపవర్ణన ప్రారంభించకముందే బాహువులను వర్ణించినట్లున్నారు.  


ఉత్పత్యసంభవమ్ బ్రహ్మసూత్ర వివరణయందు ఆదిశంకరులు వాసుదేవోనామ పరమాత్మోచ్యతే| సంకర్షణో నామ జీవః| ప్రద్యుమ్నో నామ మనః| అనిరుద్ధోనామ అహంకారః (శంకరాచార్య బ్రహ్మసూత్రభాష్యము అ2-2-సూ42)  సృష్టిక్రమమునందలి చతుర్యూహములలోని మూడువ్యూహములను సూచించు జీవాత్మ, మనస్సు మరియు అహంకారము పరమాత్మనుండి సృజింపబడినవేయని చెప్పుచూ పరమాత్మకాని ఉత్పత్తి అసంభవమని నిర్ణయించారు.
 
చతుర్బాహువులు అంటే చతుర్వ్యూహములు, అంతఃకరణ చతుష్టయము, చాతుర్వర్ణములు,..మొదలుగునవి అనికూడా భావించవచ్చును.

తల్లి చతుర్బాహువులతో, చతుర్విధపురుషార్ధములయందలి తురీయపురుషార్ధమును ప్రసాదించవలెనని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment