Saturday 7 July 2018

kuruvindamaNiSrENIkanatkOTIramaNDitA కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

లేఖాలభ్య విచిత్ర రత్నఖచితమ్-హైమమ్ కిరీటోత్తమమ్
ముక్తా కాఞ్చన కింకిణీగణ మహాహీర ప్రబంధోజ్జ్వలమ్|
చంచచ్చంద్రకలాకలాప లలితం దేవద్రుపుష్పార్చితమ్
మాల్యై రంబ! విలంబితం సుశిఖరమ్-బిభ్ర చ్చిర స్తే భజే||
(త్రిపురామహిమ్నస్తోత్రము -38శ్లో)
మహావజ్రములు, ముత్యములు, దట్టముగా కూర్చబడిన విచిత్ర రత్నములు పొదగబడి, చిరుధ్వనులుచేయు చిరుమువ్వలతో కూడిన శ్రేష్ఠమైన బంగారుకిరీటముతో ప్రకాశించుచూ, అతిప్రకాశవంతమైన చంద్రకలలతో శోభిల్లుచున్నదియు, దేవతాపుష్పములచే అర్చించబడినదియు, విచిత్ర పుష్ప మాలికలతో అలంకరింపబడిన నీ శిరస్సును సేవింతును తల్లీ!!

కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా

కురువిందమణి - కురువింద జాతి కెంపుల మణులు
శ్రేణివరుస
కనత్ప్రకాశించుచున్న
కోటీరకిరీటముచే
మండితా - అలంకరింపబడినది

కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయై నమః
కురువిందకెంపులవరుసతో ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడిన తల్లికి నమస్కారము.

గరుడపురాణము 70అధ్యాయమునందు, వివిధ ప్రాంతములందు దొరకు కెంపులకు, వాని రంగు, మెరుపులనుబట్టి వివిధములైన పేర్లని చెప్పబడినది. కురువింద, పద్మరాగ, స్ఫటికములు మొదలగు పలవిధములైన కెంపులుగలవు. వీటన్నిటిలోనూ శ్రేష్ఠమైన ఎరుపురంగుగలిగిన కెంపులు, కురువిందమణులు. వీని మధ్యభాగమునుండి ఒక విశేషమైన ప్రకాశము వెలువడుతుంది.ఈ కెంపులు స్వయమ్ప్రకాశకములు.  అట్టి శ్రేష్ఠమైన ఎర్రని కురువింద మణులతోచేయబడిన కిరీటమును ధరించినది తల్లి.

పద్మరాగో దినేశస్య చంద్రకాంతో విధోరపి
రాహోర్మారకతః పీఠః శనోర్నీలసముద్భవః|
గోమేదకస్తు సౌమ్యస్య స్ఫాటికస్తు బృహస్పతేః
శుక్రస్య వైఢూర్య భవః ప్రవాలోమంగలస్య హి|| (మణిమాలII-77,78)

కిరీటమ్ అగ్నిః (15-21శ్లో) అగ్నిదేవుడు తల్లికి కిరీటమును సమర్పించినట్లు బ్రహ్మాండపురాణము ఉత్తరభాగమునందు చెప్పబడినది. అగ్నిగోళమైన సూర్య సంబంధిత కెంపులు కిరీటమునందు పొదిగియున్నవని వాగ్దేవతలు చెప్పుటయందలి రహస్యమిదియే!!


ఆదిశంకరుల సౌన్దర్యలహరి, లలితాసహస్రనామమునకు భాష్యమువంటిదియని చెప్పబడుచున్న మహోన్నత గ్రంధము. ఈ గ్రంధమునందు ఆదిశంకరులు అమ్మవారి కేశాదిపాదాంత వర్ణనను కిరీటముతోనే ప్రారంభిస్తారు. గతైర్మాణిక్యత్వమ్ యను 43వ శ్లోకమునందు అమ్మవారి కిరీటము గగనమణులైన సహస్రాదిత్యులతో పొదగబడినదియని వర్ణించారు. 

లలితాసహస్రనామస్తోత్రమునందు వశిన్యాదివాగ్దేవతలు కెంపులతో అలంకరింపబడిన కిరీటముధరించిన తల్లియనుచుండగా, మరి వీరు ఎటుల ఆదిత్యులనే మణులతో అలంకరింపబడిన కిరీటమని చెప్పుచున్నారే యనిజూచిన, జ్యోతిష్యశాస్త్రమునందు కెంపులు సూర్యునికి ప్రతీక యగుటచే, వశిన్యాదివాగ్దేవతలు జెప్పిన కురువిందకెంపులను ప్రతీకలతోగాకుండా గగనమండలమునందలి ఆదిత్యులతోనే వర్ణించారు భగవత్పాదులు. 

హైమకిరీటాయ సహస్రాదిత్య తేజసేనమః యను కిరీట మంత్రమును ఈ శ్లోకమునందు నిక్షిప్తపరచినటులుగా తద్భాష్యగ్రంధమునందు చెప్పబడినది. మంత్రమునుగురించి నేను ఎప్పుడూ చెప్పేదే. గురుముఖత ఉపదేశముపొంది మాత్రమే ఏ మంత్రమైనను ఉపాసించవలెను.  ఆదిశంకరులు అటువంటి మంత్రనిక్షిప్తము జేసినారని చెప్పుటకుమాత్రమే ఇచ్చట ఉదహరించడమైనది.

సంస్కృతఅక్షరములకు సంఖ్యలను జోడించి ఇందుమూలముగా సంస్కృతవార్తలకు/శ్లోకములకు సంబంధిత సంఖ్యలను తెలియజేయు అక్షర-సంఖ్యాశాస్త్రము గలదు. ఇందు కటపయాది, ఆర్యభట్ట, వరరుచి యను పలువిధమైన పద్ధతులు గలవు. సంగీతశాస్త్రమునందు మేళకర్త రాగనామమునకు కటపయాది సూచిక పద్ధతి ఆధారముగా రాగసంఖ్యను జోడించుట వాడుకలోనున్నది. వైదీక గణితమునందుకూడా ఈ పద్ధతి విరివిగా వాడబడినది. విదేశీ విజ్ఞానము ఇంకా కన్నుతెరవని స్థితిలోనుండగనే, మనదేశ విజ్ఞానులు, ఖగోళ శాస్త్రమును, జ్యోతిష్యశాస్త్రమును, గణితశాస్త్రమును ఈ అక్షర-సంఖ్యాశాస్త్ర సహాయముతో శ్లోకరూపమునందు ప్రతిపాదించినారు. గ్రహముల మధ్య దూరములు, వాని కొలతలు వంటి వివరములు (ఆధునిక గణనలకు అతిదగ్గర విలువలను) ఎప్పుడో మన దేశమునందు సూర్యసిద్ధాంతమను గ్రంధమునందు వర్ణింపబడినవి. పై, సైన్, కొసైన్, పైథాగరస్ సిద్ధాంతము మొదలైనవాటిని ఏనాడో, శ్లోకరూపమున అందించారు మన విజ్ఞానులైన ఆర్యభట్ట, వరహామిహిరులు, కేరళకుచెందిన మాధవాచార్యులు.  నేను ఉదాహరణకు కొన్ని పేర్లుమాత్రమే చెప్పాను. వీరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ అక్షర-సంఖ్యాశాస్త్ర ఆధారముగా వచ్చిన మన శాస్త్రవిజ్ఞానము గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. 

శ్రీశృంగేరీ విరూపాక్షపీఠ 42వ పీఠాధిపతియైన జగద్గురు శ్రీకల్యాణానంద భారతీ మాంతాచార్య విరచిత లలితరహస్యనామ వ్యాఖ్యయైన కల్యాణశ్రీకలాయను గ్రంధమునందు, పైన చెప్పుకున్న అక్షర-సంఖ్యా శాస్త్రసహాయముతో లలితాసహస్రనామముల విశేషవివరణ చేసారు. వారు ఈ నామమునందు గాయత్రిమంత్రవిశేషము నిబిడితమైయున్నదని వ్యాఖ్యానించినారు. మంత్రమయమైన అమ్మ ఆభరణమైన కిరీటమునుదెల్పు నామమందు తలమానికమైన గాయత్రిమంత్ర విశేషమును కూర్చినారు వాగ్దేవతలు. మరి వాగ్దేవతలు కదా!!

నాయందలి అవిద్యాతిమిరములను తల్లియొక్క కిరీట మిహిరకాంతులు సమూలముగా నాశనముచేయవలెనని ప్రార్థిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment