Saturday 14 July 2018

tArA-kaNti-tiraskAri-nAsAbharaNa-bhAsurA తారాకాంతితిరస్కారినాసాభారణభాసురా




శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

అధరోష్ఠవేదికాయామ్ నాసాభరణాంశు శాబకైః సాకమ్|
కులమఖిలమవతు ఖేలన్నద్రిసుతా హాసబాలో నః||

వేడివేడి సూర్యసంబంధ వాయుధూళి సమూహము (Solar-gas-dust) చల్లబడి గడ్డగట్టగా గ్రహములు ఏర్పడినవి. నక్షత్రములు మండుచున్నవాయుధూళి సమూహము. గ్రహములన్నీ ప్రకాశించవు. ఉదాహరణకు చంద్రగ్రహము. సూర్యకాంతి చంద్రగ్రహములోనికి ప్రవేశించలేదు. దాని ఉపరితలము (surface) మీది నుండి తిరస్కరింపబడుతుంది (reflects).

కానీ, బుధ (Mercury), శుక్ర (Venus), అంగారక (Mars), గురు (Jupiter), శని (Saturn) గ్రహములందు ప్రవేశించిన సూర్యకిరణములవలన గ్రహతత్త్వమునుబట్టి ప్రకాశవంతములై మనకు భూమినుండి (with naked eye) ప్రత్యక్షముగా చూడగలము. Paper lamps చూసే ఉంటారు కదా, అలాగనమాట. Not exactly like that, but similar. 
Paper Lamps

గురుగ్రహము సూర్యకిరణములను పోలిన రంగుతో (పీతవర్ణము) ప్రకాశిస్తుంది. అంగారక గ్రహము ఎర్రగా ప్రకాశిస్తుంది. శుక్రగ్రహము లేతపసుపుపచ్చ రంగుతో ప్రకాశిస్తుంది. ప్రకాశించు ఈ ఐదుగ్రహములను గ్రహపంచకము/ తారాగ్రహములందురు.

నక్షత్రములు మిణుమిణుకుమని (twinkle) ప్రకాశిస్తాయి. ప్రకాశించు గ్రహములు మిణుకుమిణుకుమనవు, స్థిరముగా ఉంటాయి. సాపేక్షముగా నక్షత్రములు కదలవు. Stars remain fixed in the sky relative to one another. కానీ గ్రహములు కదులుతాయి. వేలసంవత్సరముల క్రితము భారతదేశపు యోగులు ఈ విజ్ఞానమును ఋగ్వేదమునందు చెప్పియున్నారు.

కంటికి తెలిస్తూ ఆకాశమునందు కదిలే గ్రహములను, కదలని నక్షత్రమండలములను గుర్తించడమేకాకుండా, వాటికి తగిన పేర్లు కూడా సూచించారు. గురు లేదా బృహస్పతి అంటే పెద్దయని అర్ధము. గ్రహములన్నింటిలోను బృహస్పతి కొలతలో పెద్దది. నక్షత్రములు/గ్రహములన్నింటిలోకీ శుక్రగ్రహము అతిప్రకాశవంతమైనది. శుక్ర అంటే ప్రకాశవంతమైన అని అర్ధము. అతినిదానముగా గమనముచేయునది శని గ్రహము. సంస్కృతమునందు శనియనిన మందము అని అర్ధము. అందువలననే ఈగ్రహదేవతను మనము శనైశ్చర (శనైః+చర). అంటాము. శనైశ్వరుడు/శనేశ్వరుడు కాదు, గమనించవలెను. ఇలా భూమిమీదనుండి ఆకాశవీధిని తపశ్శక్తితో పరిశోధించి మనకు అందించిన మన పూర్వీక యోగీశ్వర వైజ్ఞానీకులకు శతకోటి వందనములు.

తారలు/నక్షత్రములు అనునపుడు మిణుకుమిణుకుమనుచున్న నక్షత్రములతోపాటు గ్రహపంచకమును కూడా కలుపుకొనవలెను. నక్షత్రములు, గ్రహములన్నింటిలోకీ అతిప్రకాశవంతమైనది శుక్రగ్రహము అని చెప్పుకున్నాముకదా.

తారాకాంతితిరస్కారినాసాభారణభాసురా

తారాకాంతి-తిరస్కారితారలకాంతిని తిరస్కరించు
నాసాభారణ-భాసురానాసాభారణములతో భాసిల్లు తల్లి

తారలకాంతిని మించిపోయిన కాంతులతో ప్రకాశిస్తున్న నాసాభరణములను ధరించినతల్లికి నమస్కారము.

వశిన్యాదివాగ్దేవతలు నాసాభరణముల కాంతులగురించి మాత్రమే ప్రస్తావించారు. ఆదిశంకరులు సౌందర్యలహరి 61అసౌనాసావంశ శ్లోకమునందు నాసికాభరణమును ముక్తామణి (ముత్యము)తో చేయబడినదిగా వర్ణించారు. ముత్యములు వెదురు, ఏనుగు కుంభస్థలము, ఆల్చిప్పలయందు దొరుకుతాయి. నాసికలను వంశము(వెదురు)తో పోల్చుట కవిసంప్రదాయము. చల్లదనము కలిగించు చంద్ర(ఇడా)నాడిద్వారా జరుగు నిశ్వాసవలన (నాసిక) వెదురునందలి ముత్యము క్రిందకు జారి ముక్కెరగా ప్రకాశించుచున్నట్లుగా శంకరభగవత్పాదులు వర్ణించుచున్నారు. యోగపరముగా చూస్తే ఉచ్ఛ్వాస, నిశ్వాసల నియంత్రణ చేయువారలకు ముక్తాఫలము అంటే ముక్తియను ఫలమునిచ్చుతల్లి.

త్రిపురామహిమ్నస్తోత్రమునందు దుర్వాసులు కూడా 36వశ్లోకమునందు శుక్రాకరనికరదక్షమమలమ్ ముక్తాఫలమ్ సుందరమ్ అని వర్ణించారు.

కానీ త్రిపురారహస్యముయను గ్రంథమునందు (మహాత్మ్యఖండము-8- 42శ్లో) తరుణారుణ అయిన తల్లి అరుణకాంతులు, కెంపుల నాసాభరణముల కాంతులతో ద్విగుణికృతమైనవియని నాసభరణమాణిక్యద్విగుణారుణదృక్ఛదా వర్ణింపబడినది.

ఇలా తల్లి ఎరుపురంగుల కెంపుల లేదా పగడముల, వజ్రముల, ముత్యముల నాసాభరణములు ధరించినట్లుగా ఋషులు దర్శించి వర్ణించారు.

కుడినాసిక (నాసత్య-జ్ఞానశక్తి), ఎడమనాసిక (దస్ర-క్రియాశక్తి) అశ్వనీదేవతల తేజస్సుతో ఏర్పడినట్లు చెప్పుకున్నాము.

సితః శుక్రా మదనః కామః క్రియాశక్తికి శుక్ర గ్రహము, జ్ఞానశక్తికి కుజగ్రహము అధిపతులు (బృహత్-జాతక – 2.1). కుజగ్రహ సానుకూలతకు కెంపులు/పగడము, శుక్రగ్రహమునకు వజ్రము ధరించవలెను (మణిమాల-2.79).

ఇవ్విధముగా, కుడి నాసికాభరణము కెంపు/పగడముతోను, ఎడమనాసికాభరణము వజ్రముతోను, సుషుమ్నాసంబంధిత మధ్యభాగమునకు బులాకి ముత్యముతోను చేయబడినట్లు భావించవలెను.

నారుద్రో రుద్రమర్చయేత్ నావిష్ణుర్విష్ణుమర్చయేత్
ఉపాసనాకాలమున ఉపాస్యదేవతారూపముననుకరింపవలెను.
మనము ఎటువంటి ఆభరణములను ధరించవలెను, ఎటువంటి అలంకారములను చేసుకొనవలెనుయను విషయములను వశిన్యాదివాగ్దేవతలు తల్లిఅలంకారములను వర్ణించుచున్న నామములనుండి తెలుసుకొనవచ్చును. కుడినాడి సూర్య/పింగళనాడి, ఎడమనాడి చంద్ర/ఇడానాడి. అందువలన స్త్రీలు కుడి నాసికాభరణము పురుషశక్తి/బుద్ధిశక్తి సంబంధిత కెంపులు/పగడముతోను, ఎడమనాసికాభరణము ప్రకృతిశక్తి/క్రియాశక్తి సంబంధిత వజ్రముతోను, మధ్యభాగమునందు సుషుమ్నాసంబంధిత ముత్యపు బులాకి ధరించుట సంప్రదాయము. వివిధరాష్ట్రములలో వెవ్వేరు నాసికాభరణ ధారణాపద్ధతులు (ప్రాంతీయ/కుటుంబ ఆచార) వాడుకలో ఉన్నవి.

సంచక్కగా; ప్రదాయముఇవ్వబడినది అంటే మన పెద్దలద్వారా చక్కగా/సంపూర్ణముగా మనకు ఇవ్వబడిన పద్ధతులనే సంప్రదాయముయని చెప్పబడును.

స్త్రీలకుమాత్రమే నాసికాభరణములెందులకు?

నాసాభరణముల గురించి ఒక మాట

మూలకందమునుండి బయలుదేరి నాసికారంధ్రములవద్ద అంతమగు ఇడ, పింగళనాడులు స్త్రీలయందు గర్భాశయముద్వారా, పురుషులయందు వృషణములద్వారా ప్రసరిస్తాయి.

స్త్రీలయందు ముఖ్యముగా వాయుప్రకోపనమువలన పలవిధములైన ఋతుచక్ర సంబంధిత సమస్యలు వస్తాయి. వాయువును సంగ్రహించు నాసికలయందు వేధనచేయుటద్వారా ఇడ, పింగళల ద్వారా గర్భాశయమునుజేరు ప్రాణశక్తిని నియంత్రించి తద్వారా వాయుప్రకోపనమును నియంత్రించవచ్చు (సుశ్రుతసంహిత). అందువలన గర్భధారణాశక్తి గలిగిన స్త్రీలకు ముఖ్యముగా నాసికావేధన (puncture of nostrils) ఆయుర్వేదమునందు చెప్పబడినది. పురుషులకు సుషుమ్నాసంబంధిత మధ్యభాగమునందు ధరించుట ఉండేదని ఈ క్రింది శ్లోకమునందు లీలాశుకులు వర్ణించిన దానినిబట్టి తెలుసుకొనవలెను.

కస్తూరీతిలకమ్ లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభమ్
నాసాగ్రే నవమౌక్తికమ్ కరతలే వేణుమ్ కరే కఙ్కణమ్
సర్వాఙ్గే హరిచన్దనమ్ చ కలయన్ కణ్ఠేచ ముక్తావళిమ్
గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాలచూడామణిః (2.109)

తల్లి నాసాగ్రమునందు ముత్యపుబులాకి ధరించినది అనగానే, మనకి కృష్ణకర్ణామృతమునందలి పైన శ్లోకము గుర్తుకువచ్చింది కదూ. ఆయన, ఆవిడ ఒకటే కదా. ఇది స్వయంగా అమ్మవారే మమైవ పౌరుషమ్ రూపమ్ గోపికాజన మోహనమ్ అని లలితోపాఖ్యానమునందు చెప్పినది.

చిన్న ఉపాసనా రహస్యమును తెలుసుకొని తదుపరి నామమును చూద్దాము. తల్లి శ్యామల అయితే పుంరూపము శ్యామలాంగుడు, తల్లి రాజరాజేశ్వరి అయితే పుంరూపము రాజగోపాలుడు.

వీరిరువురి తత్త్వములను కలిసిన గోపాలసుందరి ఉపాసనా పద్ధతిగలదు.

లీలాశుకులు కృష్ణుని, 3వ అధ్యాయము 105వ శ్లోకమునందు
కోదండమైక్షవమఖండమ్ ఇషుంచపౌష్పమ్
చక్రాబ్జపాశసృణికాఞ్చనవంశనాళమ్|
బిభ్రాణమ్ అష్టవిధబాహుభిః అర్కవర్ణమ్
ధ్యాయేద్ధరిమ్ మదనగోపాలవిలాసవేషమ్|| అని వర్ణించారు.
ఎనిమిది చేతులతో పాశము, అంకుశము, చెరకువిల్లు పువ్వులబాణములు, చక్రము, శంఖము (అబ్జము), (వంశనాళము) పిల్లనగ్రోవులను ధరించి సూర్యకాంతులతో ఉన్న మదనగోపాలుని విలాసవేషమును ధ్యానించవలెను.

మదనగోపాలుడంటే, మన్నార్గుడి (దక్షిణద్వారక) యందలి రాజమన్నార్ లేదా రాజగోపాలునుగురించి తప్పక చెప్పుకొనవలసిందే. తమిళములో మన్నర్/మన్నార్ అంటే రాజుగారు.  ఈ స్వామికి శ్రీవిద్యా రాజగోపాలుడని కూడా పేరు. బ్రహ్మోత్సవములందు స్వామికి మోహిని (మదనగోపాలసుందరి) అలంకారము బహువిశేషముగా చేయబడుతుంది.

శ్రీ రాజగోపాల అష్టదశాక్షరి (18), సుందరి (శ్రీవిద్య) పంచదశాక్షరి(15) మంత్రములకలయికతో వచ్చునది గోపాలసుందరి మంత్రము. ముత్తుస్వామిదీక్షితులు మన్నార్గుడి రాజగోపాలునిమీద అనేకకృతులు రచించిననూ, జగన్మోహిని రాగమునందు శ్రీవిద్యారాజగోపాలమ్ భజేహమ్ కీర్తన గోపాలసుందరి తత్త్వమును తెలియజేయు కీర్తన.

శ్రీశంకరభగవత్పాదులవారు రచించిన సౌన్దర్యలహరి గురించి మనము చాలా సార్లు ప్రస్తావించుకున్నాము. ఈ స్తోత్రము తల్లి పరముగా వ్యాఖ్యానించబడినది, అందరికీ తెలిసిన విషయమే. కానీ విష్ణుపరముగాకూడా ఈ స్తోత్రగ్రంధము వ్యాఖ్యానింపబడినది. ప్రతి శ్లోకమును యదాతధముగా విష్ణుపరముగా వ్యాఖ్యానించి గోపాలసుందరి తత్త్వమును ఆవిష్కరింపజేయబడినది.

ఉదాహరణకు, మొదటి శ్లోకము శివఃశక్త్యాయుక్తో..
తల్లి పరముగా వ్యాఖ్యానము మీకు అందరికీ తెలిసేఉంటుంది. ఇక విష్ణుపరముగా,
శివ - మంగళము
స్వశ్రేయసమ్ శివమ్ భద్రమ్ కళ్యాణమ్ మంగళమ్ శుభమ్
దైవతం దేవతానాంచ మంగళమ్ మంగళానాంచ (విష్ణు సహస్రనామము)
మంగళములన్నింటికంటే మంగళమైన మహావిష్ణువు/కృష్ణస్వరూపము.ఈ విధముగా చూచినప్పుడు,
శివః గోపాలుడు;
శక్త్యాయుక్తః శక్తి(సుందరి)తోకూడి
గోపాలసుందరి రూపముగా వివరించబడినది.
గోపాలసుందరి/సుందర నాసాభరణకాంతులు నాయందలి అంతఃతిమిరమును పోగొట్టవలెనని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment