Wednesday 4 July 2018

rAgasvarUpa-pASaDhyA, krOdhAkAraNkuSOjjvalA,manOrUpEkshu-kOdaMDA, panca-tanmAtra-sAyakA రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా, మనోరూపేక్షు కోదండా, పంచతన్మాత్రసాయకా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

బాలారుణతేజసమ్ త్రినయనామ్ రక్తామ్బరోల్లాసినీమ్
నానాలంకృతిరాజమానవపుషమ్ బాలోఙ్కురాఙ్శేఖరామ్|
హస్తైరిక్షుధనుః సృణీసుమశరాన్ పాశమ్ ముదాబిభ్రతీమ్
శ్రీచక్రస్థితసుందరీమ్ త్రిజగతామాధారభూతామ్ భజే|| (రుద్రాయామల తంత్రము)

సృష్టి, స్థితి, లయకారకమైన పరంబ్రహ్మ దేవకార్యసిద్ధ్యర్థము చిదగ్నికుండమునుంచి సాకారముగా ఆవిర్భవించుచున్న ఘట్టమును ప్రస్తావించుకుంటున్నాము. మొదట తరుణారుణజ్యోతిపుంజము వ్యక్తమై అందునుండి చతుర్బాహువులు గోచరమైనవి. వచ్చే నాలుగు నామములందు అమ్మవారి చేతులలో ఉన్న ఆయుధములను ప్రస్తావించుకోబోతున్నాము.

దదౌ బ్రహ్మేక్షుచాపమ్ తు వజ్రసారమ్ అనశ్వరమ్
తయోః పుష్పాయుధమ్ ప్రాదాదమ్లానమ్ హరిరవ్యయమ్
నాగపాశమ్ దదౌ తాభ్యామ్ వరుణో యాదసాంపతిః
అఙ్కుశమ్ చ దదౌ తాభ్యామ్ విశ్వకర్మా విశామ్పతిః (బ్రహ్మాండపురాణము ఉత్తర 15-19,20)
భండాసురవధ చేయుటకు చిదగ్నికుండసంభూతయైన లలితమ్మతల్లికి మహాకామేశ్వరునితో వివాహమహోత్సవ సందర్భముగా దేవతలందరూ బహుమతులు ఇచ్చివారి భక్తిప్రపత్తులను తెలియజేసుకున్నారు. (జలాధిపతి) యాదసాంపతియైన వరుణుడు నాగపాశమును, విశ్వకర్మ అఙ్కుశమును, బ్రహ్మదేవుడు అనశ్వరమైన (immortal) ఇక్షుచాపమును మరియు హరి ప్రకాశవంతమైన పుష్పబాణములను తల్లికి సమర్పించారు. ఈ నాలుగుఆయుధములను తల్లి నాలుగుచేతులలో ధరించినది.

రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా,
మనోరూపేక్షు కోదండా, పంచతన్మాత్రసాయకా,
ఈ నాలుగు నామములందు అమ్మవారిచేతుల్లోని ఆయుధములైన పాశము, అంకుశము, చెఱకువిల్లు, పువ్వులబాణములు ప్రస్తావించబడినవి. కామజనితమైన రాగస్వరూపము పాశము. పాశబద్ధులై, ఇంద్రియజనితములైన పంచతన్మాత్రలను పుష్పబాణములను, మనస్సను చెఱకువిల్లుతో సంధించుట వలన ఏర్పడు క్రోధమను మదపుటేనుగును నియంత్రించు బుద్ధి అంకుశ స్వరూపముగాను చెప్పబడినది. ఆయుధనామములు వివరించుకునేముందు, సకలమనోవృత్తివ్యాపారములకు మూలమైన కోరికను గురించి చూద్దాము.

కామఏష క్రోధఏష రజోగుణసముద్భవః|
మహాశనోమహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్|| (భగవద్గీత 3.37)
రజోగుణమునుండి ఉత్పన్నమగు కామము తదుపరి క్రోధముగా పరిణతిచెందుతుంది. అందువలన కామము అత్యంత పాపభూయీష్ఠమైన  శత్రువు.

కామము అంటే కోరిక. కోరిక తీరకపోతే వచ్చేది క్రోధము.  కోరిక తనకే తీరాలి, వేరెవరికీ తీరకూడదు అనే భావన లోభము. కోరిక తీరకపోతే తాను ఉండలేను అనుకొనుట మోహము. కోరిక నాకే తీరింది అని గర్వించుట మదము, తనకు కాక వేరొకరికి తీరితే బాధపడుట మాత్సర్యము. ఆత్మస్వరూపమును తెలుసుకోనీకుండా అడ్డుపడే ఇవియే అరిషడ్వర్గములు/షట్-రిపులు. అరి/రిపు అంటే శత్రువు. వీటన్నిటికీ మూలము కామము.

సరేనండి, కోరిక కలిగితే తప్పు ఏమున్నది? అది తీర్చుకుంటే సరి!! దీనిని శత్రువు అని ఎందుకు అనుకోవాలి అంటే, దానికి శ్రీమద్భాగవతమునందు

యత్పృథివ్యామ్ వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః
న దుహ్యంతి మనఃప్రీతిం పుంసః కామహతస్య తే (9.19.13) అని చెప్పబడినది. ప్రపంచంలోని సకల ఐశ్వరములిచ్చిననూ, మనసు ప్రీతిచెందదు. ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే|
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే||
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి || (భగవద్గీత 2.62,63)
ఇంద్రియవిషయముల తీవ్రకాంక్ష/కోరిక వలన క్రోధము కలిగి, తద్వారా బుద్ధినశిస్తుంది. అందువలన, కోరికలను నియంత్రించుట సాధకునికి మిక్కిలి అవశ్యము.

అయితే కోరికలు ఎచ్చట పుడుతున్నాయి అనేదానికి భగవాన్ శ్రీకృష్ణుడు
ఇంద్రియాణి మనోబుద్ధిః అస్య అధిష్ఠానమ్ ఉచ్యతే|
ఏతైః విమోహయతి  ఏషః జ్ఞానమ్ ఆవృత్య దేహినమ్|| (Ibid 3.40)
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఈ మూడునూ కోరికలకధిష్ఠాన స్థానములుగా చెప్పినాడు.
ఇవియే ఈ నాలుగునామములందు చెప్పబడిన తల్లి చేతిలోని ఆయుధముల సూక్ష్మరూపము. వీనిలో ఇంద్రియములకన్న మనస్సు, మనస్సుకన్న బుద్ధి, బుద్ధి కన్న ఆత్మ ఉన్నతమైనవియగుటచే (ibid 3.42), కఠోపనిషత్తునందు ఇంద్రియములనబడు గుర్రములను మనస్సను పగ్గములతో కట్టబడిన శరీరమను రథమునందు బుద్ధియను సారథితో ప్రయాణించు జీవాత్మయను సాధకుడు, సారథిద్వారా పగ్గములతో గుర్రములను స్వాధీనపరుచుకొనవలెనుయని చెప్పబడినది (1.3.3,4). 

ఇక తల్లిచేతిలోని ఆయుధముల వివరణ చూద్దాము.

ఇచ్ఛాశక్తిమయమ్ పాశమఙ్కుశమ్ జ్ఞానరూపిణిమ్|
క్రియాశక్తిమయే బాణధనుషీ దధదుజ్జ్వలమ్|| (యోగినీహృదయ I – 53)
పాశము ఇచ్ఛాశక్తిమయము, అఙ్కుశము జ్ఞానశక్తిమయము, బాణధనుస్సులు క్రియాశక్తిమయములు. కామజనితమైన పాశము ఇచ్ఛాశక్తికి సంకేతము. జ్ఞానమను అంకుశము ద్వారా క్రోధమును నియంత్రింపబడుటచే అఙ్కుశము జ్ఞానశక్తికి సంకేతము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను విషయవాసనల బాణములను, మనస్సను ధనుస్సుతో సంధించుటద్వారా కార్యాచరణ జరుపబడుటచే, ధనుర్బాణములు క్రియాశక్తికి సంకేతము.

రాగస్వరూపపాశాఢ్యాయై నమః
రాగస్వరూప-పాశ-ఆఢ్య (ఒప్పుచున్న)
రాగస్వరూపమైన పాశమును ధరించిన తల్లికి నమస్కారము.
విషయేచ్ఛ అధికమైన రాగమనబడును. అందువలన రాగమునకు మూలము ఇచ్ఛ/కోరిక. సంసారసక్తహృదయేష్వసి పాశమాయా (ఉమాసహస్రము-7.19) బంధకారణమగుటచే, సంసారమునందలి ఆసక్తియే మాయాస్వరూపమైన పాశముగా చెప్పబడుచున్నది. ఇదియే జననమరణహేతువైన రాగము, తల్లిచేతియందలి కాలపాశమని చెప్పుటయందలి అంతర్యము.

క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః
క్రోధాకార అంకుశమును ధరించి ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము.
క్రోధము, ద్వేషమను చిత్తవృత్తి. ఆకారమనిన స్వరూప జ్ఞానము. అందువలన అంకుశమనిన ద్వేషము, జ్ఞానము ఉభయములు. రాగమువలన ఏర్పడు క్రోధమును నియంత్రించుటకు సదసత్-విచక్షణాజ్ఞానము అత్యవశ్యము. అట్టి సద్బుద్ధియను అంకుశము జ్ఞానశక్తికి ప్రతీక.

ప్రతి జ్ఞానేంద్రియము ఒకేఒక అపంచీకృత మహాభూతముతో చేయబడినది. ఉదాహరణకు, చెవి శబ్దమును మాత్రమే గ్రహించగలదు, చర్మము స్పర్శను మాత్రమే గ్రహించగలదు, నేత్రము రూపమును మాత్రమే గ్రహించగలదు, జిహ్వ రసమును మాత్రమే గ్రహించగలదు మరియు నాసిక గంధమును మాత్రమే గ్రహించగలదు. కానీ మనస్సు, ఈ ఐదింటినీ గ్రహించగలదు. అందువలన మనస్సును వింటితోను, పంచతన్మాత్రలను బాణములతోను పోల్చినారు వశిన్యాదివాగ్దేవతలు.

మనోరూపేక్షుకోదండాయై నమః
మనోరూప-ఇక్షు-కోదండ
మనోరూపముగలిగిన చెఱకువిల్లును ధరించిన తల్లికి నమస్కారము. తల్లిచేతిలోని చెఱకుగడ సాధారణమైనది కాదు, అతిమనోహరమైన, అతిమధురమైన ఎర్రని నామాలచెఱకు (పుండ్రేక్షు) యని చాలామంది దర్శిత ఉపాసకుల స్తోత్రములలో చూసాము. ముఖ్యముగా మహాకవికాళిదాసుని మాణిక్యవీణాం.. శ్యామలాదండకము అందరికీ సుపరిచితమే.

మనస్సను వాసనారూపమునకు చెఱకువిల్లు స్థూలరూపము. చెఱకుయందు సారము తక్కువ, పిప్పి మరియు తీపి ఎక్కువ. అలాగనే సాధకులుకానివారికి సారవిషయములందు (భగవద్విషయములందు) ఉత్సుకత తక్కువ, ప్రపంచ విషయములందాసక్తి మరియు మక్కువ ఎక్కువ. ఈ మనస్సును తల్లిచేతిలో పెట్టినప్పుడు, సాధారణముగా శుష్కింపజేయు జ్ఞానేంద్రియములు, సాధకుని మనస్సును ఆధ్యాత్మికముగా వికసింపజేస్తాయి.

పంచతన్మాత్ర సాయకాయై నమః
పంచతన్మాత్ర-సాయక (బాణములు)
పంచతన్మాత్రలరూప బాణములుగల తల్లికి నమస్కారము.

బాణాః స్యుస్త్రివిధాః ప్రోక్తాః స్థూలసూక్ష్మపరత్వతః
స్థూలాః పుష్పమయాః సూక్ష్మాః మంత్రాత్మానః సమీరితాః
పరాశ్చ వాసనాయామ్ తు ప్రాక్తాః స్థూలాన్ శృణు ప్రియే
కమలం కైరవం రక్తమ్ కల్హారేన్దీవరే తథా
సహకారజ మిత్యుక్తమ్  పుష్పపంచకమీశ్వరీ 
(తంత్రరాజతంత్రము5- శ్లో 48,49,50)
బాణములకు స్థూల, సూక్ష్మ(మంత్ర) మరియు పర(వాసన) యను మూడురూపములు.  పుష్పములు స్థూలరూపము, మంత్రము సూక్ష్మరూపము మరియు వాసనలు పరరూపముగాను చెప్పబడుచున్నవి. స్థూలముగా వర్ణింపబడిన పుష్పములు కమల(ఎఱ్ఱ కమలము), రక్తకైవీర (ఎఱ్ఱ కలువ), కల్హార/తెల్లకలువ, ఇందీవర/నీలకమలము మరియు సహకార/చూత. పంచబాణములకు వాసనారూపము పంచతన్మాత్రలు.

క్షోభణ ద్రావణౌ దేవి తథా కర్షణసంజ్ఞకః
వశ్యోన్మాదౌ క్రమేణైవ నామాని పరమేశ్వరి (జ్ఞానార్ణవతంత్రము2-శ్లో45,46)
అమ్మవారి పంచబాణములు క్షోభణ, ద్రావణ, ఆకర్షణ, వశ్య, ఉన్మాదములు.
చెఱకువిల్లు, పువ్వులబాణములుయనినంతనే, మనకు ఇంకొకరు గుర్తుకు వస్తున్నారుకదూ!! అవును, ఆయనేనండి, మన్మథుడు.  అరవింద (ఉన్మత్తత), అశోక (రోదన), చూత (సమ్మోహన), నవమల్లిక (శోషణ), నీలోత్పల(స్థంభన) మన్మథుని పువ్వులబాణములు. మన్మథుని బాణములు మనస్సును విషయవాంఛలవైపు మరలిస్తాయి. అమ్మవారి పుష్పబాణములు సాధకుల మనసులను విషయవాంఛలనుండి విముఖులనుచేసి రాగద్వేషాదులను నియంత్రించుటకు దోహదములవుతాయి.

మనస్సు, పంచతన్మాత్రలను సదాతల్లియొక్క ధ్యానమునందు నిలపవలెననుచూ, ఆదిశంకరులు సౌన్దర్యలహరియందలి దదానే దీనేభ్యః 90వశ్లోకమునందు అమ్మా!! మనస్సు, పంచతన్మాత్రలను ఆరుపాదములుగల షట్పదివలే (భ్రమరమువలే), సదాసర్వకాలము నీ పాదకమలములందు వసించవలెనని ప్రార్థించారు. 

అమ్మవారి ఆయుధములైన ధనుస్సు, బాణము, పాశము మరియు అంకుశములను వర్ణించే నాలుగు నామములను వివరించుకున్నాము. అమ్మవారి ఆయుధములు, ఆభరణములు జడములు కాదు, చైతన్యముతోకూడినవి. అమ్మవారి రూపము మంత్రమయమని చెప్పుకున్నాము కదా. ఆభరణములు, ఆయుధములు, అంగములు అన్నీ మంత్రమయ చైతన్యశోభితములు. ఈ నాలుగునామములందును ఆయుధములసంబంధిత మంత్రములు గుప్తముగానుంచబడినవి. ఈ నామముల పారాయణ/జపము వలన తత్ఫలమును పొందవచ్చును.

మహాముని దుర్వాసులు త్రిపురామహిమ్న స్తోత్రమునందు, నీలకంఠ దీక్షితులు ఆనందసాగర స్తవమునందు, అమ్మ ఆయుధములను ధ్యానించుటవలన కలుగు ప్రయోజనములను ఈ క్రింది శ్లోకములందు ప్రస్తావించారు.

చాపధ్యానవశాద్భవోద్భవమహామోహస్య వ్యుజ్జృమ్భణమ్
ప్రఖ్యాతమ్ ప్రసవేషుచింతన వశాత్తత్తచ్ఛఖ్యమ్ సుధీః|
పాశధ్యాన వశాత్సమస్తజగతామ్ మృత్యోర్వశత్వ మహా-
దుర్గస్తమ్భ మహాఙ్కుశస్య మననాన్మాయా మమేయామ్ తరేత్|| 
(త్రిపురామహిమ్న స్తోత్రము - 45)
అమ్మా| నీ చెఱకువిల్లుధ్యానము చేత జననమరణచక్రకారణమైన మహామోహము బారినుండి రక్షించెదవు. నీ పుష్పబాణముల ధ్యానముచేత చింతించిన దానిని సిద్ధింపజేసెదవు. నీ పాశధ్యానముచే కాలుడైన మృత్యువునుకూడా వశీకృతము చేసుకొనగల శక్తిని ప్రసాదించెదవు. నీ అంకుశధ్యానము వలన అవిద్యను తొలగించి మహామాయ నుండి విముక్తులను చేసెదవు.

పాశమ్ సృణిమ్ చ కరయోస్తవ భావయన్తః
సంస్తమ్భయన్తి వశ్యన్తి సర్వలోకాన్||
చాపమ్ శరమ్ చ సకృదంబ తవ స్మరన్తో
భూపాలతామ్ దధతి భోగపథావతీర్ణాః|| (ఆనందసాగర స్తవము-75)                                                                               
అమ్మా!! పాశధ్యానము వలన దుర్గముల స్తంభనశక్తిని, అంకుశధ్యానము వలన వశీకరణశక్తిని ప్రసాదించి, చాపశరములధ్యానము వలన భూపాలురజేసెదవు.

తల్లిచేతిలోని అంకుశముతో బుద్ధిని తేజరిల్లజేసి, అతిమధురచాపము, అపరిమితామోదబాణములతో మధురమైన తల్లినామసంకీర్తనానందము గలిగించి, జననమరణ కారణమైన పాశ విముక్తురాలిని చేయవలసినదిగా ప్రార్ధిస్తూ

శ్రీమాత్రే నమః

2 comments:

Reddy Kirankumar MB said...

Chaalaa adbhutangaa vivarinchaarandi...dhanyavaadaalu

Durga Sivakumar said...

🙏

Post a Comment