Thursday 5 July 2018

nijAruNaprabhApUramajjadbrahmAnDamanDalA నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
భాసామ్ వినేత్రా మహతాగ్రహైశ్చ
భూరి ప్రమాణైర్యుతమ్ ఈశకాన్తే|
ఏకైకమణ్డం తవ లోమవచ్చేత్
కస్తే మహద్ భాగ్యమిహబ్రవీతు|| (ఉమా సహస్రము 39.4)

నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః
నిజసహజమైన
అరుణఅరుణ వర్ణము
ప్రభాపూర - ప్రభలయందు
మజ్జత్ మునిగియున్న
బ్రహ్మాండ-మండల బ్రహాండముల సముదాయము

సమస్త బ్రహ్మాండమండలములను యొక్క సహజమైన అరుణవర్ణ ప్రభలలో ముంచుచున్న సర్వారుణ తల్లికి నమస్కారము.

సదాశివేన వై పుంసాతాని దృష్టాని భారత
బుద్బుదాకారతామ్ జగ్మురండమ్ జాతమ్ తతః శుభమ్|
శతకోటి ప్రమాణమ్ చ బ్రహ్మాండమిదముచ్యతే |
(స్కందపురాణము- మహేశ్వరఖండము-కౌమారీఖండము-37-12శ్లో)
సదాశివుని, శక్తి సంయోగముచే ఏర్పడిన బుడగాకారమునుండి శతకోటి ప్రమాణము గల బ్రహాండముద్భవించినది. బ్రహాండమువివరణ బ్రహ్మాండపురాణము, శ్రీమద్భాగవతము, వాయుపురాణము మొదలగు గ్రంథములందు చూడవచ్చును.

తస్మిన్నండే  త్విమే లోకా అంతర్భూతాస్తు సప్త వై| 
సప్తద్వీపా చ పృథ్వీయమ్ సముద్రైః సహ సప్తభిః|
పర్వతైః సుమహద్భిశ్చ నదీభిశ్చ సహస్రశః|
అంతస్తస్మింస్త్విమే లోకా అంతర్విశ్వమిదమ్ జగత్|
చంద్రాదిత్యౌ సనక్షత్రౌ సగ్రహౌ సహవాయునా |
లోకాలోకమ్ చ యత్కించిచ్చాండే తస్మిన్ సమర్పితమ్
(వాయుపురాణము 4.72-74)
సప్త లోకములు, సప్తద్వీపములు, పృథ్వి, సప్తసముద్రములు, పర్వతములు, వేలకొలది పెద్ద పెద్ద నదులు, సమస్త విశ్వమూ ఈ అండమునందు గలవు. అంతేకాదు,  సూర్యచంద్రులు, నక్షత్రములు, గ్రహములు, ఆకాశగంగలు (galaxies), భూర్భువస్సువర్లోక సరిహద్దునందుగల అదృశ్య లోకాలోకపర్వతసమూహము, సమస్తము ఒక బ్రహ్మాండమునందు గలవు. అటువంటి బ్రహ్మాండములు ఎన్నిగలవనిన, అనేక కోటియని శృతులయందు చెప్పబడినది. ఉదాహరణకు,
యస్య ప్రభా ప్రభవతో జగదండకోటి
కోటిష్వశేష వసుధాది విభూతి భిన్నామ్
తద్ బ్రహ్మ నిష్కలమ్ అనంతమ్ అశేషభూతమ్
గోవిందమ్ ఆదిపురుషమ్ తమ్ అహమ్ భజామి (బ్రహ్మ సంహిత – 5.40)


ఈ సందర్భములో శ్రీమదాంధ్రమహాభాగవతమునుండి పోతనామాత్యుని అతిమధురమైన తెలుగు పద్యములు చెప్పుకోవాలి కదా!!

హరి పరమాణురూపమున నందు వసించు విరాజమానుఁ డై
సరి వెలుఁగొందు నిమ్ముల నసంఖ్యములైన మహాండకోశముల్
నెఱిఁ దనయందు డింద నవనీరజ నేత్రుఁ డనంతుఁ డాద్యుఁడ
క్షరుఁడు పరాపరుఁ డఖిల కారణ కారణుఁ డప్రమేయుండై 
(తృతీయస్కంధము 364)

ఇంతింతై వటుఁడింతయై మఱియుఁ దానింతై నభోవీధిపైనంతై
తోయదమండలాగ్రమునకల్లంతై ప్రభారాశిపైనంతై
చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై
సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై (అష్టమస్కంధము-622)


ఇక దశమస్కంధమునందు, యశోదమ్మ మన్నుతిన్న చిన్నవానిని నోరుతెరిచి చూపుమనగా, కృష్ణుడు తెరిచిచూపిన నోటియందు ఆ లలితాంగి కనుంగొనె, బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్ అని పోతన వర్ణించారు.


ఈ బ్రహ్మాండములు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి అన్నదానికి,
సాలెపురుగు ఎలా వలను సృష్టించి మళ్ళీ ఉపసంహరించుకుంటుందో, ఏవిధముగ భూమినందు ఔషధములు పెరుగుతున్నాయో, సజీవ పురుషుని దేహము నుంచి ఎలా రోమములు పెరుగునో, అలా బ్రహ్మమునుంచి విశ్వము ఏర్పడుతున్నది అని ముండకోపనిషత్తునందు చెప్పినట్లు, భాసిస్తున్న సూర్యునితోను, విశేషమైన గ్రహములతోనూ కూడిన ఒక్కొక్క బ్రహ్మాండము, నీ తనువుయైన పరమాకాశమునుండి ఉద్భవిస్తున్నవి. తల్లీ!! నీమహద్భాగ్యమును ఎటుల వర్ణించగలము? అని గణపతిముని తల్లిని ఉమాసహస్రమునందు ప్రార్ధించారు.


శంకరభగవత్పాదులవారు దర్శించిన సర్వము అరుణమయమైన తల్లిని సౌన్దర్యలహరి 23వ శ్లోకము త్వయాహృత్వావామమ్ నందు, అమ్మా!! పరమశివుడు తెల్లనివాడు. అర్ధనారీశ్వరునికి సగము తెలుపు, సగము ఎరుపు ఉండాలి కదా!! కానీ కుచద్వయముతోనొప్పు నీ వర్ణము సకలము అరుణముగా ఉన్నది. నెత్తిమీద నెలవంక, త్రినేత్రములు చూస్తే అయ్యవారివి. అందువలన, పరమశివుని అర్ధభాగమును తీసుకొని నువ్వు తృప్తిచెందక, మిగిలిన సగభాగమునుకూడా దొంగిలించావేమోనని నాకు అనుమానముగా ఉన్నది అని చమత్కారముగా తల్లియొక్క అరుణవర్ణమును కీర్తించారు.

ఒక వస్తువు మీద కాంతి, సాధారణముగా సూర్యకాంతి ప్రసరించినప్పుడు, మనము ఆ వస్తువును చూడగలగుతాము. సూర్యకాంతియందు సమస్త వర్ణములు ఇమిడియున్నాయి. తెలుపు, నలుపు కాని వస్తువులు, వాని మీద ప్రసరించిన కాంతి నుంచి ఒక వర్ణము తప్ప మిగిలిన వర్ణములన్నిటిని గ్రహించుకుంటాయి. ఆ తిరస్కరించిన వర్ణమే ఆ వస్తువుయొక్క వర్ణముగా తెలియబడుతుంది. ఉదాహరణకు, ఒక బంతి మీద సూర్యకాంతి పడినప్పుడు, అది అన్ని వర్ణములను గ్రహించుకొని ఎరుపు వర్ణమును మాత్రము తిరస్కరించినప్పుడు, ఆ బంతి ఎరుపు వర్ణముతో తెలియబడుతుంది.
ఒక వస్తువు మీద ప్రసరించిన తెల్లని కాంతి నుండి సమస్త వర్ణములను తిరస్కరించినప్పుడు, ఆ వస్తువు వర్ణము తెలుపు, మరియు అన్ని వర్ణములను గ్రహించినప్పుడు, అది నలుపు.

ఇప్పుడు, ఒక తెల్లని వస్తువు మీద ఎరుపు కాంతి ప్రసరించినప్పుడు, తెల్లని వస్తువు సహజ స్వభావము సమస్త వర్ణములను తిరస్కరించుట కదా!! అందువలన అది ఆ ఎరుపుకాంతిని తిరస్కరించి అది కూడా ఎరుపుగా కనపడుతుంది.

బ్రహ్మాండమండలములమీద అమ్మవారి అరుణవర్ణము ప్రసరించినందువలన, అవన్నియునూ అరుణవర్ణముతో భాసిల్లుతున్నాయి.

తల్లియొక్క అరుణవర్ణములు అయ్యవారిదగ్గరకు చేర్చవలసినదిగా ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment