Thursday 19 July 2018

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సిత కచ్ఛపీ - Nijasallapamadhurya-vinirbhatsita-kacchapi

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

కంబుసదృగమమ్బ!! జగతామ్ మణివేషోడు స్రజాకృతాకల్పః|

కణ్ఠోఽనఘస్వరస్తే ధూర్జటిదోర్నయన కర్ణహితః||

(ఉమా సహస్రము 11.11)

అమ్మా! జగములను మణుల హారముతో ఒప్పారుచున్న, శంఖమువంటి నీ కంఠము ధూర్జటి నయనములకును, ఆ కంఠమునుండి వచ్చు అనఘస్వరము కర్ణములకు హితముగనున్నది.

 

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సిత కచ్ఛపీ

 

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః

నిజ నిత్యమైనది నిజముఎప్పుడూ మారనిది

సల్లాప (సంలాప)మాటలు/వాక్కులు

మాధుర్యమాధుర్యముగలిగిన

వినిర్భర్త్సిత -ఓడించు

చ్ఛపీచ్ఛపి వీణావాదనమును

 

తల్లి వాక్కులు వేదములని చెప్పుకున్నాము కదా. వేదములు ఎల్లవేళలా సత్యములైన వాక్కులు. చ్ఛపి వీణానాదమును ఓడించు మధురమైన వాక్కులుగల తల్లికి నమస్కారము.

 

మన హైందవ దేవతా మూర్తుల చేతులలో వీణ (దక్షిణామూర్తి, సరస్వతి, శ్యామల, నారదుడు, లవకుశలు,..), వేణువు (కృష్ణయ్య), డమరు (శివయ్య), మద్దళము (నంది) మొదలగు సంగీతవాయిద్యములు ఉండుట మనకు తెలిసినదే. వీణానాదము మానవుల గాత్రమునకు అతిదగ్గరగా ఉండుటచే, అన్ని సంగీతవాయిద్యములలో వీణకి అగ్రస్థానము గలదు. అందుచే తల్లివాక్కులను వశిన్యాదివాగ్దేవతలు వీణానాదముతో పోల్చారు.

 

అదికూడా ఎలాంటి వీణ? ఇది మనకి పరిచయమైన మానుషీ వీణ కాదు, దివ్య వీణ. సరస్వతీ దేవి వీణ. దీని పేరు కచ్ఛపి. కచ్ఛపముయనగా తాబేలు. ఈ తల్లి వీణయొక్క కుడము లేదా కుండ, తాబేలు ఆకారములోయుండుటచే దీనికి కచ్ఛపియని పేరు. అంతేకాదు, సరస్వతీదేవి వీణ యందలి నాలుగు తంత్రులు (తీగలు) నాలుగువేదములు. 24 మెట్లు గాయత్రీమంత్ర సంకేతములు. ఈ వీణతంత్రులతో పలికించు సప్త స్వరములు సప్తమాతృకలకు సంకేతములు. శ్రుతులను వాక్కులుగా గలిగిన మాతృకావర్ణరూపిణియైన లలితమ్మతల్లి వాక్కులను పోల్చుటకు కచ్ఛపి కంటే వేరె గలదె?

 

సంగీతమకరందయను గ్రంధమునందు నారదులవారు పలురకములైన వీణలను వర్ణిస్తారు. వీణయందు యోగరహస్యముకూడా గలదని తెలుసుకొనగలరు. దర్శన, శాండిల్యోపనిషత్తులందు మన పృష్ఠదండమును (వెన్నెముకను) వీణతో పోల్చిచెప్పబడినది.

 

మరి సౌన్దర్యలహరిలో ఆదిశంకరులేమన్నారో చెప్పుకోకుండా వదిలేస్తే ఈ నామవివరణ అసంపూర్ణమౌతుంది. తల్లికి అత్యంతప్రీతిపాత్రమైన విషయము శివ నామము/లీలలు. అట్టి శివలీలలను వర్ణిస్తూ సరస్వతీదేవి తల్లిముందు వీణవాయిస్తుండగా ఓహో! చాలా బాగున్నదియని తలయూచుచూ,  ప్రశంసించుటకు తల్లి ఉద్యుక్తురాలగుచుండగానే (ఇంకా పలకకుండగనే), తన వీణావాదనముకన్నా తల్లివాక్కులు అత్యంత మాధుర్యముగా ఉంటాయని సిగ్గుతో పలుకులతల్లి వాణి, తనవీణను చీరకొంగులో దాచుకున్నదియని ఆదిశంకరులు విపంచ్యా గాయంతీ” యను 66వశ్లోకమునందు వర్ణించారు.

 

మధురాతిమధురమైన వాక్కులుగల తల్లికి నమస్కారము.

No comments:

Post a Comment