Sunday 8 July 2018

ashTamIcaMdravibhrAjadaLikasthalaSObhitA అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

అష్టమీశశాజ్కఖణ్డ దర్ప భఞ్జనాలికా
విష్టపత్రయాధినాథ మానస్య డోలికా|
పాపపుఞ్జనాశకారి పాదకఞ్జ ధూళికా
శ్రేయసే మమాస్తు శైలలోకపాల బాలికా|| (ఉమా సహస్రము 36.8)
అష్టమీశశాంకఖండ దర్పమును ఓడించు ఫాలభాగముగలిగినదియు, ముల్లోకములకు అధిపతియైన శివునిమనసును డోలలూగించినదియు, పాపరాశిని నాశనముజేయగలిగిన పాదధూళికలు గలిగినదియునైన శైలబాలిక మాకు శ్రేయస్సును గలిగించుగాక!!

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా

అష్టమీచంద్ర అష్టమినాటి చంద్రునివలె
విభ్రాజత్ - ప్రకాశించుచున్న
అళికస్థల -ఫాలభాగముతో
శోభితా - శోభిల్లుతున్నది
అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితాయై నమః
అష్టమినాటి చంద్రునివలె ప్రకాశించుచున్న అర్ధవృత్తాకార ఫాలభాగముతో శోభిల్లుతున్న తల్లికి నమస్కారము.

సమవృత్తమబలమ్ సూక్ష్మమ్ స్నిగ్ధమ్ సౌమ్యమ్ సమసురభివదనమ్|
సిమ్హేభనిభమ్ రాజ్యమ్ సంపూర్ణమ్ భోగినామ్ చేతి|| 
(బృహత్ సాముద్రిక – 336)
శుభమర్ధేన్దుసంస్థానమతుఞ్గమ్ స్యాదలోమశమ్|
నృపతీనామ్  భవేచ్చిహ్నమ్ లలాటమ్ శుభదర్శనమ్|| 
(బృహత్ సాముద్రిక – 439)
సాముద్రికా శాస్త్రముననుసరించి ఉత్తమ స్త్రీ పూర్ణచంద్రవదనమును, అర్ధచంద్ర లలాటమును కలిగియుండును.

దీనినే స్వయముగా సుబ్రహ్మణ్యస్వామి అగస్త్యమునివరులకు ఉపదేశించిన స్త్రీపురుష సాముద్రిక లక్షణ శాస్త్రముయను గ్రంథమునందు, అర్ధచంద్రాకార ఫాలభాగముగల స్త్రీ ఐశ్వర్యమును గలిగియుండును, పూర్ణచంద్రబింబమువంటి వదనాన పూజ్యనీయురాలగును యని చెప్పబడినది.

సకలశోభాయమానమైన అమ్మవారి వదనమునందు ఈ సల్లక్షణములుండువని వేరే చెప్పవలెనా!!

చిదగ్నికుండమునుండి ప్రాదుర్భవించిన లలితాపరాభట్టారిక కోటిసూర్యప్రతీకాశమ్  చంద్రకోటిసుశీతలమ్ (లలితోపాఖ్యానము అ7-72శ్లో) అని హయగ్రీవస్వామి వర్ణించారు. అట్టి కోటిచంద్రుల శీతలత్వమును కలిగిన చంద్రవదనయొక్క లలాటము అర్ధచంద్రునివలెయున్నదని వాగ్దేవతల ఉవాచ!!

శంకరస్య చ యత్తేజస్తేన తన్ముఖపంకజమ్
  (శ్రీమద్దేవీభాగవతము -స్క5-62శ్లో)
యదభూచ్చాంభవమ్ తేజస్తేనాజాయత తన్ముఖమ్ 
(మార్కండేయపురాణము-82-13శ్లో)
బ్రహ్మాండపురాణమునందలి విరాట్రూప వర్ణనయందు (-13-9శ్లో), స్వర్లోకము తల్లివదనముగ చెప్పబడగా, అది మహాదేవునితేజస్సుతో ఏర్పడినట్లు దేవీభాగవతమునందు, మార్కండేయపురాణమునందు చెప్పబడినది.


క్వణత్ కాంచీదామ కరికలభ కుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ... ||(సౌన్దర్యలహరి 7)
పూర్ణేందువదనము, అర్ధచంద్ర లలాటముగలిగిన లలితావదనారవిందమును (లలితా పంచరత్నము) ఆదిశంకరులు కూడా సౌన్దర్యలహరియందు వర్ణించారు.

లలాటమ్ లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్
ద్వితీయమ్ తన్మన్యే మకుట ఘటితమ్ చంద్ర శకలమ్...|| (ibid 46)
తల్లీ!! వృత్తమునందలి పైఅర్ధభాగమువలెనున్నది నీ లలాటము.
జటాజూటసమాయుక్తామర్ధేన్దుశేఖరామ్
లోచనత్రయ సంయుక్తామ్ పూర్ణేన్దుసదృశాననామ్
(కాలికాపురాణము 59.12)
క్రిందిఅర్ధభాగమువలెనున్నది నీ కిరీటముమీది చంద్రశకలము (అర్ధేన్దుశేఖరామ్). లలాటరూప పైఅర్ధవృత్తాకార చంద్రుని, మకుటముమీది క్రిందిఅర్ధవృత్తాకార చంద్రుని వ్యతిరేకపరచి, సోమరసము (సుధాలేపము) తో అతికించిన, చల్లనివెన్నెలలు కురిపించు పూర్ణచంద్రునివలెయున్నది తల్లీ!! అని శంకరభగవత్పాదులవారు తల్లియొక్క అర్ధచంద్ర లలాటభాగవర్ణన చేసారు ఈ శ్లోకమునందు.

ప్రత్యగ్రారుణ సంకాశ వదనాంబోజ మండలామ్ 
 (వామకేశ్వర తంత్రము -115)
వామకేశ్వరతంత్రమునందు తల్లియొక్క అరుణకాంతులతో కూడిన (వదన-అంబుజ) వదనకమలమును సాక్షాత్తు పరమశివుడు వర్ణించాడు.

చంద్రం గతా పద్మగుణాన్న భుజ్క్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యామ్
ఉమాముఖమ్ తు ప్రతిపద్యలోలా ద్వి సంశ్రయామ్ ప్రీతిమవాపలక్ష్మీః|| 
(కుమారసంభవముసర్గ 1 – 43 శ్లో)
కానీ మహాకవి కాళిదాసు, తల్లీ!! అమృతమయమైన చంద్రునియందు సుగంధము లేదు. పద్మమునందు సుగంధము గలదుగానీ అమృతతుల్యమైన శోభలేదు. అందువలన వీనిరెండింటికీ మధ్య ఊగిసలాడు అష్టవన్నెలుగలిగిన చంచలమైన లక్ష్మీదేవి, అమృతమయమైన శోభనూ, సుగంధమునూ గలిగిన నీ వదనమునజొచ్చి, అచ్చటనే నిలిచిపోయినదనుచూ చంద్రుని, పద్మమునూ ఓడించు వదనశోభగల తల్లిని వర్ణించారు.

అట్టి లక్ష్మీలహరితోకూడిన లలాటముగలిగిన తల్లిని కావ్యకంఠగణపతిముని ఉపసంహార స్తబకమునందు (40.17శ్లో) ప్రజ్ఞాలహరిగల దృష్టిగలదిగానూ, తేజోలహరిగల అధరములుగలదిగానూ, ఆనందలహరిగల వదనముగలిగినదిగానూ వర్ణించారు. 

తల్లియొక్క అర్ధచంద్ర లలాట శీతలకాంతులు నా సంసారతాపత్రయమును హరించి జ్ఞానానందతేజోమయమైన తల్లిదర్శన భాగ్యమును కలిగించాలని ప్రార్థిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment