Monday 16 July 2018

sUrya-candra manDalas సూర్య-చంద్ర-మండలములు




శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః


నభోఽన్తరే హిరణ్మయమ్ విభుమ్ ప్రచక్షతే హరమ్
దినేశబింబ బిమ్బితమ్ భణన్తి పఙ్కజాసనమ్ (పంకజాసనమ్)|
ఇహాస్మదన్తరాలయమ్ వదన్తి విష్ణుమచ్యుతమ్
సవిత్రి! జన్మనామియమ్త్రిమూర్తివాది ధోరణి|| (ఉమాసహస్రము)

తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సమ్భూతః| ఆకాశాద్ వాయుః| వాయోరగ్నిః | అగ్నోరాపః| అద్భ్యః పృథ్వీ | పృథివ్యా ఓషధయః| ఓషధీభ్యోsన్నమ్| అన్నాత్పురుషః
 (తైత్తిరీయ ఉపనిషత్తు 2.1.1)
పరమాత్మ సంకల్పముచే మొదట ఆకాశము, ఆకాశమునుండి వాయు, అగ్ని, జలము (ఆపస్సు) మొదలైనవి సంభవించినవి. జలము నుండి భూమి ఏర్పడినది.

భూరితి వా అయమ్ లోకః | భువ ఇత్యంతరిక్షమ్|
సువరిత్యసౌ లోకః| మహ ఇత్యాదిత్యః|
ఆదిత్యేన వావ సర్వే లోకామహీయంతే|  
(తైత్తిరీయ ఉపనిషత్తు 1.5.1,2)
(భవన్తి అస్యమ్ భూతాని) భూమి భూలోకము. దానిచుట్టూ ఉన్న ఆకాశము (అంతరిక్షము) భువర్లోకము. దానికంటే పైనున్నది సువర్లోకము. సువర్లోకమునకు ద్యుర్లోకమనికూడా పేరు. దానికంటే పైన ఉన్నది మహర్లోకము. ఇదియే  ఆదిత్యుడు/పరమాత్మ. ఈ పరమాత్ముని వలననే సర్వలోకములు సృజింపబడుచున్నవి.

పురాణములందు మొత్తము పదినాలుగు లోకములు చెప్పబడినవి. వీనియందు చెప్పబడిన స్వర్లోకనిర్వచనములందు వ్యత్యాసములుగలవు. ఇందువలన పురాణముల సహాయముతో సూర్యమండల, చంద్రమండలములగురించి అన్వయము చేయునప్పుడు కించిత్ జాగ్రత్త వహించి, దానికితగినట్లుగా చేయవలెను.

భూరితి వా అగ్నిః| భువరితి వాయుః|సువరిత్యాదిత్యః|
ఈ ద్యుర్లోకమునే సూర్యమండలము/ఆదిత్యమండలము/సవితృమండలము యని చెప్పబడుచున్నది

భూలోకము, సూర్యమండలముల మధ్యగల భువర్లోకమే చంద్రమండలము.
విశంతి పరమామ్ దివ్యామ్ భాస్కరీమ్ తైజసీమ్ కలామ్|
కర్మణః సాధనే చైకా తత్ర చాగ్నౌ ప్రతిష్ఠితా|
వాయుమార్గస్థితా వ్యోమ్ని ద్వితీయాన్తః ప్రకాశికా|
తతః పరమ్ తృతీయా తు తత్స్మృతమ్ సూర్యమండలే|| 
(భవిష్యత్ పురాణము 143.12,13)
సూర్యమండలమునందు ఒక కల(అంశము), అంతరిక్షమునందలి వాయుమార్గమందును ఒక అంశము మరియు భూలోకమునందు కర్మసాధనకొరకు అగ్నిగా ఒక కలగా సూర్యనారాయణుని తేజస్సుయొక్క మూడు కలలు చెప్పబడినవి.

తస్మాదగ్నిః సమిధో యస్య సూర్యః
సోమాత్పరజన్య ఔషధయః పృథివ్యామ్|
పుమాన్ రేతః సిఙ్చతి యోషితాయామ్
బ్రహ్మీః ప్రజాః పురుషాత్సంప్రసూతాః|| 
(ముండకోపనిషత్తు 2-1-5)
మనము ప్రత్యక్షముగా దినము దర్శించుకుంటున్న సూర్యభగవానుడు, సకలసృష్టికి మూలమైన చిచ్ఛక్తియొక్క సవితృమండలాంతర్గత కలకు ప్రతీక. అంతరిక్షమునందలి వాయుమార్గ చంద్రమండలకలకు ప్రతీకయే మన రజనీనాయకుడైన చంద్రుడు. ఈ సోమరసాత్మక చంద్రకలవలననే అంతరిక్షమునందు మేఘములు, భూమియందు ఓషధులు కలుగుచున్నవి.  ఓషధులవలన జీవులయందు అగ్నిరూప రేతస్సుకలిగుచున్నది.

శ్రీవిద్యాఉపాసకులు ఈపాటికి సూర్యచంద్రాగ్నులను శ్రీచక్రపరముగా, మనశరీరమునందలి చక్రములపరముగానూ అన్వయించుకునే ఉంటారు కదూ!!


శ్రీమాత్రేనమః
 


No comments:

Post a Comment