Tuesday 17 July 2018

tATanka-yugaLIbhUta-tapanODupa-manDalA తాటంకయుగళీభూతతపనోడుపమండలా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీమ్
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః|
కరాలమ్ యత్-క్ష్వేలమ్ కబలితవతః కాలకలనా
న శంభోః తన్మూలమ్ తవ జనని తాటఙ్కమహిమా|| 
(సౌన్దర్యలహరి-28)

తాటంకయుగళీభూతతపనోడుపమండలా
తాటంక కర్ణాభరణములు/చెవికమ్మలు/దిద్దులు
పూర్వకాలమున స్త్రీలు తాటి/తాళ పత్రము(ఆకు)లను చెవులకు ఆభరణములుగా ధరించెడివారు. అచ్చ తెనుగుయందు వీనిని చెవ్వాకులనెడివారు. చెవికి పెట్టుకొను ఆకులు చెవ్వాకులు.

యుగళ -  జంట
ఉడుపచంద్రుడు (ఉడునక్షత్రము; -రాజు)
ఉడుపి కృష్ణుని గుడిగురించి వినే ఉంటారుకదా!! ఆ ఊరు పేరు ఉడుపి అని రావడానికి కారణమే ఈ చంద్రుడు. దక్షప్రజాపతి వలన కలిగిన శాపమునుండి విమోచనము కొరకు చంద్రమౌళీశ్వరుని (కృష్ణ మఠము ఎదురుగనున్న గుడి) చంద్రుడు ప్రార్ధించుటచే ఈ స్థలమునకు ఉడుపియని పేరు వచ్చినది.

తపన, ఉడుప మండలసూర్య, చంద్ర మండలములు

సూర్యచంద్ర మండలములను తాటంకయుగళములుగా (రెండు కర్ణాభరణములుగా) గలిగిన తల్లికి నమస్కారము.

వాటిని కర్ణాభరణములుగా గలిగిన తల్లియని వర్ణించుటచే, ఈ నామము అమ్మవారి విరాట్ విశ్వరూపమును తెలియజేస్తుంది.

సూర్యమండలమునకు ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుడు ప్రతీక, చంద్రమండలమునకు చంద్రుడు ప్రతీక . అందువలననే గణపతిముని ఉమాసహస్రమునందలి 23స్త-7వ శ్లోకమునందు తల్లిని కశశికుండలాయని సంబోధించారు. సూర్యుడు, శశి చంద్రుడు. సూర్యచంద్రులను కుండలములుగ గలతల్లిని నేనేమి వర్ణింతును? అంటారు ఈ శ్లోకమునందు.

తల్లి ఆభరణాలంకారములను మనము అనుకరించుటయందు గల సూక్ష్మమును నాసికాభరణముల సంబంధిత నామము వద్ద చెప్పుకున్నాము. సుశ్రుత సంహితయందు చెవులు కుట్టించుటయందు గల ప్రాముఖ్యమును చెప్పబడినది. షోడశ సంస్కారములలో ఒకటైన కర్ణవేధన (piercing of ear lobes చెవులు కుట్టించుట) స్త్రీపురుష భేదములేకుండా అందరికీ చేయబడు అతి ముఖ్యమైన సంస్కారము.  శరీరమునందలి కొన్ని ముఖ్యమైన నాడులు కంద, హృదయము, మస్తిష్కము (brain) ద్వారా చెవికి చేరుతాయి. ఈ నాడుల వివరములు నేను ఎక్కువ చర్చించుటలేదు. Those who are interested can refer to Jabala Darshana Upanishad, Yoga Sikha Upanishad. చెవులు కుట్టించి అక్కడ ఒక లోహపు ఆభరణము ధరించుటద్వారా, మస్తిష్కమునకు చేరు నాడి ఉత్తేజితమై (activate అయి) బుద్ధి శక్తి పెరుగుతుంది. ఇది హృదయస్పందన యొక్క లయమును (rhythm), జీర్ణాశయమును (digestive system)  కూడా కాపాడుతుంది.

మంచిబుద్ధి/ఆరోగ్యము అందరికీ అవసరమేకదా!! అందుకనే స్త్రీపురుషులందరికీ చెవులుకుట్టించుట మన హైందవ సంప్రదాయము.

చెవి సాగదీయుటవలన చెవిద్వారా ప్రసరించు నాడులు ఉత్తేజితమై బుద్ధిశక్తి పెరుగుటకు దోహదపడుతుంది. పూర్వకాలములో చిన్నవయసులో పిల్లలకు చెవులు పిండుట, చెవులుపట్టుకొని గుంజీళ్ళు తియ్యడమువంటి శిక్షలు వేయుటవంటివి ఉండేవి. ఇది శిక్షారూపములో బుద్ధిని పెంపొందిచుటకు చేయు ప్రక్రియ.

మరియు, తాటంకధారణమ్ స్త్రీణామ్ భర్తురాయుష్య వర్ధనమ్ముత్తైదువ స్త్రీలు కర్ణాభరణములను (తాటంకములను) ధరించుట భర్తకు ఆయుష్షును పెంపొందిస్తుంది. ముత్త (వయసులో పెద్ద అయిన) + ఐదువ (అయిదు మంగళ చిహ్నములుగల స్త్రీ). మంగళసూత్రము-మట్టెలు, పసుపు-కుంకుమలు, నాసికాభరణములు, గాజులు, చెవ్వాకులు అనునవి ముత్తైదువ స్త్రీలకు మంగళచిహ్నములు. కాలాంతరమున వీనియందు ఒకటి రెండు మార్పులు ఉన్ననూ, వీనిని ముఖ్యమైన సుమంగళి లక్షణములుగ గ్రహించవలెను.

అమ్మ తాటంకముల మహిమవలననే శంభుని ఆయుష్షు గట్టిబడి, ఆయన హాలాహలము స్వీకరించికూడా, మృత్యుంజయుడైనాడని ఆదిశంకరులు సౌన్దర్యలహరి 28వ శ్లోకము సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీమ్ నందు వర్ణించారు.

తప్తస్వర్ణకృతోరుకుండలయుగమ్ మాణిక్యముక్తోల్లస
ద్ధీరావద్ధమ్-అనన్యతుల్యమ్- అపరమ్ హైమంచ చక్రద్వయమ్||
శుక్రాకారనికరదక్షమమలమ్ ముక్తాఫలమ్ సుందరమ్
విభ్రత్ కర్ణయుగమ్ భజామి లలితమ్ నాసాగ్రభాగమ్ శివే||  
(త్రిపురామహిమ్నస్తోత్రము -36)

అమ్మవారితాటంకములను వర్ణించు మరియొకనామము కనత్(మెరుస్తున్న) కనక(బంగారు) తాటంకా (కర్ణాభరణములుగల తల్లి) ఈ స్తోత్రమునందు గలదు.

వశిన్యాదివాగ్దేవతలుచెప్పిన మెరుపులు ఎటువంటివో దుర్వాసముని త్రిపురామహిమ్నస్తోత్రమునందు వర్ణించారు. తప్తస్వర్ణకృతోరుకుండలయుగమ్ శ్లోకమునందు,

తల్లీ!! కెంపులు, ముత్యములు, వజ్రములతో కూడిన (తప్తస్వర్ణము) కరిగించినబంగారపు మెరుపులతో/కాంతులతో కూడిన కుండలయుగములకు, స్వర్ణ చక్రములకు మరియు శుక్రగ్రహకాంతులను ధిక్కరించు ముత్యపు నాసాభరణమునకు నమస్కరిస్తున్నాను అని ప్రార్ధించారు.

కుండవద్వృత్తత్వాత్ కుండలమ్ (అమరకోశము)
కుండ(ము) వలే వట్రుగానుండునది.
 
ఇందు కుండలములు క్రింద వేలాడు గుండ్రటి భాగము, చక్రము పైన దిద్దుభాగమును సూచిస్తాయి.

దేవీభాగవతము స్క3 – 3 – శ్లో44 నందు కనత్(ప్రకాశిస్తున్న)-శ్రీచక్రతాటంకవిటంక(అందమైన)- వదనామ్బుజా (వదనకమలము గలతల్లి) అని వర్ణింపబడినది.

శ్రీచకతాటంకములనగానే మనకు శ్రీరంగము సమీపమునగల జంబుకేశ్వరము(తిరు-ఆనై-క్కావల్)నందలి జంబుకేశ్వరుని హృదయేశ్వరి అఖిలాండేశ్వరి గుర్తుకొస్తుంది కదూ!! ఈ తల్లి తాటంకముల వెనక కధ మీకు తెలిసే ఉంటుందని ఇక్కడ చెప్పడములేదు.

మరి అమ్మకృపాకటాక్షపాత్రుడైన మూకశంకరులు చేసిన వర్ణనను కూడా చెప్పుకోవాలి కదా!! మూకశంకరులు మాణిక్య, మణికుండలములను (కామాక్షి), తమాల పత్ర (కిరాత పార్వతి), శఙ్ఖ (మహాభైరవి), ఏనుగుల (చండి) కుండలములను ధరించిన తల్లిగా వర్ణించారు.


సకలలోకసామ్రాజ్ఞియైన మృత్యుంజయుని మహిషియైన తల్లి తాటంకములు అవిద్యయను మృత్యువుబారినుండి కాపాడవలెనని ప్రార్ధిస్తూ,



శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment