Friday 6 July 2018

campakASOkapunnAgasaugandhikalasatkacA చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

జాతీచంపక కున్దకేసర మహాగంధోద్గిరత్కేతకీ
నీపాశోక శిరీష ముఖ్యకుసుమైః ప్రోక్తమ్ సితా ధూపితా|
ఆనీలాంజనతుల్య మత్తమధుశ్రేణీవ వేణీ తవ
శ్రీమాతః శ్రయతామ్ మదీయహృదయామ్బోజమ్ సరోజాలయే|| 
(శక్తిమహిమ్న స్తోత్రము)

ప్రాదుర్బభూవ పరమమ్ తేజః పుంజమనృపమమ్|
కోటిసూర్యప్రతీకాశమ్ చంద్రకోటిసుశీతలమ్||
తన్మధ్యమే సముదభూచ్చక్రాకారమనుత్తమమ్|
తన్మధ్యమే మహాదేవీముదయార్కసమప్రభామ్|| 
(లలితోపాఖ్యానము 7-72శ్లో)
చిదగ్నికుండమునుంచి మొదట విశేష జ్యోతిపుంజము (సూక్ష్మతర), తరువాత చతుర్భుజములు (భూచక్రసమన్వితమైన సూక్ష్మ శ్రీచక్రము) వ్యక్తమైనవి. తదుపరి కుండమునుండి ఉదయసూర్యుని ప్రభలతో మహాదేవి స్థూలరూపము వెలువడుతున్నది.

ఈ నామమునుండి సర్వాభరణభూషితా నామమువరకు చిదగ్నికుండమునుండి కొంచము కొంచముగా బహిర్గతమయి విదితమగుచున్న అమ్మవారి రూపవర్ణన అంటే కేశాదిపాదాంత వర్ణన చేసారు వశిన్యాదివాగ్దేవతలు.

రూపవర్ణనలో ఇంకా ముందుకు వెళ్ళేముందు ఒకమాట. అమ్మవారిని ప్రత్యక్షముగా దర్శించిన వశిన్యాదివాగ్దేవతలు చేసే స్తోత్రమిది. ఒకరికి తెలియని విషయానుభూతిని చెప్పాలంటే వారికి తెలిసిన విషయముతో పోల్చి చెప్పినప్పుడే అర్ధమౌతుంది. మానవమాత్రులమైన మనకు అర్ధమగుటకొరకు ఆవిడ పాదములు పద్మములవలే మెత్తగా, చెక్కిళ్ళు అద్దములవలే ఉన్నాయి అనేటువంటి పోలికలను చెప్పుట స్థూలరూపవర్ణనజేయు నామములందు చూడవచ్చును. వారు పోలికకువాడిన యేవస్తువు ఈ భూలోకమునకుజెందినది మాత్రమేయని భావించవలదు. అమ్మ అలంకరించుకునునవి దివ్యకుసుమములతోను, దివ్యాభరణములతోనుయని తెలుసుకొనవలెను. అమ్మశరీరము మంత్రమయము. స్థూలరూపదర్శనజేసిన యోగులు/మునులు మనకు అర్ధమయేరీతిగా వర్ణించినంత మాత్రమున ఆవిడది మనవలే మాంసమయమైన శరీరమని భావించకూడదు. ఉమాసహస్రము అష్టాదశస్తబకమునందు గణపతిముని అమ్మా!! నీ ఆభరణముల ఉపాదానకారణమైన స్వర్ణము, వానియందుగల రత్నముల స్వరూపమేమిటమ్మా? నీ కార్పాసము ఎటుల నేయబడినది? నీ సంకల్పమనే కల్పవృక్షమునుండి సృష్టించబడినవా? యని ప్రశ్నిస్తారు. వర్ణనాతీత సౌన్దర్యరాశియైన అమ్మను వర్ణించుటకు సహస్రవర్ణములైననూ చాలవే!! 

చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా

చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచాయై నమః

చంపకాశోకపున్నాగసౌగంధిక - చంపక, అశోక, పున్నాగ పుష్పముల సుగంధముతోకూడిన
లసత్ప్రకాశిస్తున్న
కచా -కురులు గలది

ప్రకాశవంతమై, చంపక, అశోక, పున్నాగ పుష్పముల సుగంధముతో కూడిన కురులుగల తల్లికి నమస్కారము.

అమ్మవారి ప్రకాశవంతమైన కురులు చంపక, అశోక, పున్నాగ పుష్పముల సుగంధములతోనొప్పుచున్నవని చెప్పవచ్చును లేదా సహజసిద్ధమైన పుష్పసౌరభముతోనున్న కురులుగల తల్లియని చెప్పవచ్చును.

శిరోరుహానభస్తే తు తారకాః కుసుమాని తే (ibid 8-12శ్లో)
లలితోపాఖ్యానమునందలి తల్లి విరాట్రూప వర్ణనజేయునపుడు దేవతలు తల్లి కురులు నభము (ఆకాశము)గాను నక్షత్రములు తలలోని కుసుమములుగను వర్ణించారు.

యామ్యేన చా భవాన్ కేశా (మార్కండేయపురాణము అ82-13శ్లో)
కేశాస్తస్యాస్తథా స్నిగ్ధా యామ్యేన తేజసాభవన్ 
(శ్రీమద్దేవీభాగవతము స్క5-8-63శ్లో)
తల్లి కేశములు యమునితేజస్సుతో ఏర్పడినట్లు దేవీమహత్మ్యమునందు, దేవీభాగవతమునందు చెప్పబడినది.

యత్ తేకచభరః కాలో యద్బాహుర్లోకరక్షకః|
యుక్తమ్ ద్వయమ్ శివే మధ్యస్త్వసన్నాకో న నాకరాట్|| 
(ఉమాసహస్రము 8.18)
సర్వాంతకృత్తమగు కృతాంతుడు తల్లి దట్టమైన కేశపాశములుగను, లోకరక్షకుడగు విష్ణువు బాహురూపముగను, మధ్యము స్వర్గాధిపతి(నాకరాజు)గను వర్ణించారు గణపతిముని. వారి తేజస్సుతో ఏర్పడినవని గ్రహించవలెను.
                                                          
వశిన్యాదివాగ్దేవతలు ఈ నామమునందు చెప్పిన అమ్మవారికచముల సౌరభమును ఆదిశంకరులు సౌందర్యలహరియందు ధునోతు ధ్వాంతమ్ యను 43వ శ్లోకమునందు సహజమైనదియని ఈ విధముగా వర్ణించారు. !! శివే!! నల్లకలువలవనమువలేనున్న దట్టమైన, మృదువైన, ప్రకాశమైన నీకురులు మా అజ్ఞానమును తొలగించుగాక. నీ కురులలోఉండే సహజమైన సౌరభ్యమును తాముకూడా పొందవలెనని ఇంద్రుని నందనవనమునందలి కల్పవృక్షకుసుమములు తలుస్తాయమ్మా అని అంటారు ఈ శ్లోకమునందు. సాధారణముగా స్త్రీలు కురులకు సౌరభముకోసము పుష్పాలంకరణ చేసుకుంటారు. కానీ పువ్వులకే సౌరభమునందీయగలిగిన సహజసిద్ధమైన సుగంధముగలిగిన కురులు ఆ తల్లివి.

ఇక్కడ శంకరభగవత్పాదులు కేశపాశములను ధ్యానించిన అజ్ఞానము తొలగునుయని చెప్పుటచూచిన కేశపాశములను ధ్యానించిన అజ్ఞానము(మృత్యువు) తొలగునని అభిప్రాయము. కానీ, మృత్యువనిన ఏమి?

ఉభే సత్య క్షత్రియైతస్య విద్ధి యాద్య ప్రవృత్తే
మోహో మృత్యుస్సమ్మతోఽయం కవీనాం|
ప్రమాదమ్ వై మృత్యుమహమ్ బ్రవీమి
తథా ప్రమాద మమృతత్వం బ్రవీమి ||
(సనత్సుజాతీయము అ2-4శ్లో)
ప్రమాదమే (అవిద్య, అజ్ఞానము) మృత్యువుయనియు, అప్రమాదమును అమృతత్వమనియు సనత్సుజాతీయులు చెప్పుచున్నారు. మృత్యుర్వై తమః (శంకరభగవత్పాదుల శిష్యులు సురేశ్వరాచార్యుని బృహదారణ్యక ఉపనిషద్భాష్య వార్తిక 1.2.136),  జ్ఞానమ్ సమ్యగవేక్షణమ్ (శాండిల్యోపనిషత్తు 3.24) తమస్సే మృత్యువు, జ్ఞానమే మోక్షమని శ్రుతులందు చెప్పబడినది.

అందుచే అవిద్య/అజ్ఞానములను తొలగించి అమృతత్వమును ప్రసాదించమని మనకోసముగా తల్లికురులను ధ్యానిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకమునందు.

సారమ్ కణమ్ కణమధర్మరుచామ్ సహస్రాత్ (ఆనందసాగరస్తవము – 95) శ్లోకమునందు నీలకంఠ దీక్షితులు, అమ్మవారి వదనము అనంతచంద్రబింబముల ప్రకాశవంతమైన సారభాగముతోనూ, వానియందుగల నల్లనికళంకభాగములతో కురులు ఏర్పడినవియని వర్ణించారు. సహజముగా వదనము చంద్రబింబముతోను, అందుగల కళంకమును, బొట్టుతోను పోల్చుట చూచినాము. ఇది చాలా వ్యత్యాసమైన వర్ణనయగుటవలన ఇక్కడ చెప్పడమైనది.

వర్షాపయోదపటలస్య సాన్ద్రతా
సూర్యాత్మజోర్మిచయ నిమ్నతుఙ్గతా
కాలాహి భూమిపతి దీర్ఘతాచతే
కేశేషు భర్గభవనేశ్వరి! త్రయమ్!! 
(ఉమాసహస్రము 10.5)
వర్షాకాలమేఘములందలి సాంద్రత (దట్టము­), (సూర్యాత్మజ) యమునానదినందుగల ఎత్తుపల్లములు, కాలసర్పమునకుగల దీర్ఘత అమ్మవారి కేశములందుగలవుయని వర్ణించారు గణపతిముని. మూకశంకరులు మూకపంచశతియందు అమ్మవారి కురులను వంకరతిరిగినవిగాను, జఙ్ఘములను స్పృశించునవిగానూ వర్ణించారు.

అమ్మవారి కేశములగురించి ఇంతచెప్పుకొని, ఆవిడ సుగంధకేశములతో భక్తులను అనుగ్రహిస్తున్న సన్నిధివిశేషమును కూడా చెప్పుకోవాలి కదా! తిరుచ్చినందలి మాతృభూతేశ్వర సమేత సుగంధకుంతలాంబిక ఆలయమునందు అమ్మవారు సహజసౌరభకుంతలములతో విరాజిల్లుతున్న తల్లి. తమిళభాషయందు వీరు తాయుమానవర్ (మాతృభూతేశ్వరుడు) మరియు మత్తువార్ కుళలి (kuzhali)యనియు ప్రసిద్ధము.  

అమ్మవారి కురులసౌరభము అంటే తమిళనాడునుండి నక్కీరుడు అనే భక్తుడు జ్ఞప్తికి వస్తాడు అందరికీ. ఈ కధ తరువాయి భాగమునందు తెలుసుకుందాము.

తల్లిస్నిగ్ధమైన కురులు నా అజ్ఞానాంధకారములను పోగొట్టి అమృతత్వమును ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తూ

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment