Friday 6 July 2018

nakkIran - neTrikkaN tirappinum, kuTram kuTram dAn నక్కీరుడు - నెట్రిక్కణ్ తిరప్పినుమ్ కుట్రమ్ కుట్రమ్ దాన్



శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః
 

నక్కీరులు పాండ్యరాజ్యమునందలి తమిళసంగమునందు ప్రధాన కవి. ఇప్పుడు మనము చెప్పుకునే సంభవము తిరువిళైయాడల్ పురాణమునందలిది. మునివరులు పరంజోతి రచించినది ఈ తిరువిళైయాడల్ పురాణము. ఈ పురాణము ముఖ్యముగా మధురై పట్టణమునందు జరిగిన శివుని లీలలను వర్ణించునది. తమిళమునందు తిరు అనునది శ్రీ యను గౌరవవాచకము. విళైయాడల్ అంటే లీలలు/ఆటలు. మనము ఆడేవి ఆటలు ఆయన ఆడేవి లీలలు. అందువలన తిరువిళైయాడల్ అంటే భగవంతునిలీలలు అని చెప్పుకోవచ్చును.

మలయధ్వజ పాండియన్, కాంచనమాల రాజదంపతులు వారసులకోసము పుత్రకామేష్టి యాగము చేసినప్పుడు, యాగకుండమునుండి మూడు సంవత్సరముల బాలికగా అమ్మ ఆవిర్భవించినది. ఈమె మూడు వక్షోజ చిహ్నములతో అవతరించినది. దానిని చూసి కలతచెందిన మలయధ్వజ, కాంచనమాలలకు అశరీరవాణి, ఆమె యుక్తవయసుకు వచ్చి తనకుయోగ్యుడైన వరునిజూచిన వెంటనే, స్త్రీసహజరూపమును ధరిస్తుందియని కూరినది. మీనాక్షి (తడత్తగై) యను పేరుతో ఆ బాలిక దినదినప్రవర్ధమానముగా పెరిగిపెద్దదై మధురైనగర రాజ్యభారమును వహించుచుండెను. అపుడు జైత్రయాత్ర భాగముగా కైలాసగిరికి జేరినప్పుడు శివుని జూచిన మరుక్షణము ఆమె స్త్రీల సహజలక్షణములతోనొప్పిల్లెను. తదుపరి, మీనాక్షీసుందరేశ్వరుల కళ్యాణము జరిగెను.

ఈ పాండ్యవంశమునందలి రాజు వన్గియశేఖరుడు. వన్గియశేఖరుడు రాజ్యాభిషిక్తుడైయున్న తరుణములో తమిళసంగముయనునొక సాహిత్యసంఘము గలదు. ఈ సంఘమునందుగల 48మంది కవిపుంగవులు అన్ని దిక్కులనుండివచ్చు విద్వాంసులను మట్టిగరిపించుచు, తమిళసంగ ప్రజ్ఞానము దీటులేనిదిగా దశదిశల ప్రఖ్యాతిని పెంపొందించిరి. 48 కవిపుంగవులు ఎవరన..

కాశీ పట్టణమునందు పది అశ్వమేధయాగములను పూర్తిచేసిన బ్రహ్మ, సరస్వతి గంగాస్నానమునకు పోవుచుండగా, ఒక దివ్యగానమును వింటూ సరస్వతిదేవి వెనకబడెను. ఆమెకోసము ఆగకుండా స్నానముజేసిన బ్రహ్మనుజూసి ఆగ్రహించిన సరస్వతిదేవిని బ్రహ్మదేవుడు నీవు ఈ భూలోకమునందు 48 జన్మలు పొందువుగాకయని శపించెను. శాపవిమోచనమునకై వేడిన సరస్వతితో బ్రహ్మదేవుడు నీవు 48మంది (సంస్కృతాక్షరములు) ఉత్తమ సాహితీవేత్తలు/కవులుగా జన్మలను పొందెదవు మరియు ఈ 48మంది కవులరచనలు తమిళసాహిత్యమునకు మకుటాయమానముగనుండునని శాపమును సవరణజేసెను.

అందువలన సాక్షత్ సరస్వతీస్వరూపులైన వారే ఈ 48మంది కవీశ్వరులు. వీరితో పోటీపడు కవుల ప్రజ్ఞాపాటవములను నిర్ణయించుటకు ఏదేనీ సులభోపాయము కొరకు సోమసుందరేశ్వరుని వేడగా, శంకరుడు ఒక చదరపుఅడుగు బల్లగలిగిన సింహాసనమునొకటి ఇచ్చి, నిజమైన ప్రజ్ఞాశాలి దీనియందు అమరినవెంటనే, వారి శరీర సౌష్ఠమునకు తగినట్లుగా ఇది పెరుగుతుంది యని చెప్పెను.

దానియందు మొదట కూర్చున్నది 48మంది కవులలో ప్రథముడైన నక్కీరుడు. తదుపరి కపిలుడు, భరణుడు మొదలగు పండితులు కూడా ఆ సింహాసనమునలంకరించిరి. 48మంది కవులు పలపల శ్రేష్ఠమైన అత్యుత్తమస్థాయి రచనలుచేసిరి. సాక్షాత్తు శంకరుడే పండితరూపములో వచ్చి తమిళసంగమునందలి ఈ కవుల రచనలను విభజించి, సంగ్రహించినట్లు  తిరువిళైయాడల్ పురాణమునందు చెప్పబడినది.

ఒకపరి చంపకోద్యానవనమునందు తనరాణితో విహరించుచున్న వన్గిశేఖరునికి రాణిశిరోధార్యమైన కుసుమములనుండి వచ్చు సుగంధమును ఆఘ్రాణించినపిదప, మనసునందు ఒక సందేహము కలిగెను. స్త్రీలకురులకు సహజమైన సుగంధముయుండునా లేదా ఆ సుగంధము బాహ్యాలంకారములైన కుసుమములు, లేపనముల వలన మాత్రమేనాయను సందేహము కలిగెను. ఈ సందేహమును నివృత్తి జేసిన వారికి నూరువరాహములు బహుమతి ప్రకటించెను.

ఆ రాజధానియందు దరుమియను ఒక పేదబ్రాహ్మడుగలడు. అతడు స్వామి సన్నిధికిపోయి తన కష్టములను పోగొట్టవలసినదిగా ప్రార్ధించుచుండెను. అప్పుడు శంకరుడు పండితునివేషములో వచ్చి ఒక నాలుగువరుసలు గల పద్యమునొకటి తాళపత్రమునందు రాసిచ్చి, దీనిని తీసుకొనిపోయి రాజుగారిదగ్గర చదివివినిపించిన, నీ కష్టములుదీరునని చెప్పెను. ఆ బ్రాహ్మణుడుయటులనే జేసెను. ఇదిగో తిరువిళైయాడల్ పురాణమునందలి సాక్షాత్ శివకృత పద్య సారాంశము.

వివిధపుష్పములనుండి మకరందమునాస్వాదించు ఓ భ్రమరమా! మయూర సౌందర్యముతో పోటీపడు నానెచ్చెలి కురులసౌగంధమునుమించిన సుగంధముగల పుష్పములు గలవా? పక్షపాతరహితముగ చెప్పుము.


రాజు దానిని మెచ్చుకొని బహుమతి ప్రదానముజేయు సమయమునందు, నక్కీరులు ఈ పద్యమునందు కళంకముగలదు. స్త్రీలకురులకు సుగంధముయున్నట్లు జెప్పబడు ఈ పద్యమునొప్పుకొనరాదు. ! దరుమీ, ఇది ఎటులనో నీవు వివరింపగలవుయని నిలదీయగ, అతను నీరుగారి, ఇది నా కవిత్వముగాదు, నా కష్టములనుతొలగించుటకు ఒక పండితుడు రాసిచ్చినారుయని జెప్పెను. !! అటులనా!! అపుడు వారినే వచ్చి వ్యాఖ్యానమును జెప్పమనుయనెను.

దరుమి పండితునికడబోయి ఏమయ్య!! ఇటుల జేసితివి? తమిళసంగమునందు నీ పద్యమునకు వివరణయడుగుచున్నారు. నీవేవచ్చి చెప్పవలెనుయనెను. తదుపరి, దరుమియు, పండితుడు (పరమశివుడు) రాజసభకు వెళ్ళి వివాదము జరిపెదరు.
ఇదియే ముఖ్యమైన ఘట్టము.

నక్కీరుడు: స్త్రీల కురులకు సహజ సిద్దమైన సుగంధము ఉండనే ఉండదు. అందువలన ఈ పద్యమునందు పదార్ధదోషముగలదు.
శంకరుడు: ఉత్తమలక్షణముగల స్త్రీల, దేవతాస్త్రీల కురులకు సువాసన ఉంటుందియని కూడా ఒప్పుకొనరా?
నక్కీరుడు: ఏ జాతికి జెందిన స్త్రీయైనను బాహ్యాలంకరణ వలననే సువాసన వస్తుంది. నేను దినమూ ప్రార్ధించే అమ్మవారితో సహా, ఎలాంటి స్త్రీరత్నమైనను సహజసిద్ధమైన సువాసన ఉండనే ఉండదు.
శంకరుడు: నక్కీరా!! నేను ఎవరో తెలుస్తున్నదా!! ఈ పద్యమును రాసినది నేను!! యని తన ఫాలనేత్రమును తెరిచి చూపించెను. ఇప్పుడు చెప్పు!! ఇంకను సర్వమంగళ కురులందు సుగంధముగలదని నేనురాసిన ఈ కవిత్వమునందు తప్పుయుందనెదవా? యనెను.
నక్కీరుడు: నెత్తికన్ను తెరిచినాగానీ తప్పు తప్పే!! స్త్రీలకురులకు సుగంధము ఉండదుగాక ఉండదు 
యని అహందతో సమాధానము జెప్పెను.

అప్పుడు, ఆ శివుని ఫాలనేత్రాగ్ని జ్వాలలను భరించలేక అక్కడయున్న స్వర్ణతటాకమునందు దుమికెను. తరువాత తన తప్పిదమును తెలుసుకొని ప్రార్ధించిన నక్కీరుని సోమసుందరేశ్వరుడు అనుగ్రహించెనని ఈ పురాణమునందు చెప్పబడినది.

ఇదే నక్కీరుని కధ.

వన్గిశేఖరుని వంశపరంపర తెలియుటకొరకు మలయధ్వజుని గురించి, నక్కీరుని ప్రజ్ఞాపాటవములను తెలియుటకొరకు సరస్వతీదేవి శాపగ్రస్తురాలైన ఘట్టము, తమిళసంగము గురించియు బహుక్లుప్తముగా చెప్పుకున్నాము. ఇందులోగల సంకేతార్ధములను చూచిన

మలయధ్వజుని కుమార్తె మీనాక్షి. అయోనిజయైన ఆయన కుమార్తె సాక్షాత్తు పార్వతిదేవియైనటువంటి మీనాక్షి. ఆమె సుందరేశ్వరుడనబడు శివుని వివాహమాడినది. అటువంటి శ్రేష్ఠమైన వంశపరంపర, ఉత్తమ ప్రవృత్తి గలిగినవాడు వన్గి(చంద్రవంక) శేఖరుడు. అందువలననే ఆయన ఆధ్వర్యములో తమిళసంగము బహుముఖప్రజ్ఞాశాలురైన కవిపుంగవులతో నలుదిక్కులా పేరుగాంచినది. అసాధారణ సాహితీప్రజ్ఞ కలిగినవాడు నక్కీరుడు. విశేషభక్తి కలిగిన పేద దరుమి పట్ల భగవంతుని కరుణ, అహంకారపూరితుడైన నక్కీరుని పట్ల భగవంతుని క్రోధము/అనుగ్రహము రెండునూ ఈ వృత్తాంతమునందు చూడవచ్చు. మనకు ముఖ్యమైన విషయము ఏమిటంటే, అమ్మవారి కురుల సుగంధము సహజసిద్ధమైనదియని సాక్షాత్తు ఆ శంకరుని మూలముగానే తెలుసుకున్నాము.

Clipping from tiruviLaiyADal Tamil movie.



శ్రీమాత్రే నమః
 

No comments:

Post a Comment