Monday 9 July 2018

mukha-caMdra-kaLaMkAbha-mruganAbhi-viSEShakA ముఖచంద్రకళంకాభ-మృగనాభి-విశేషకా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

కుంకుమతిలకిత ఫాలా| కురువిందచ్ఛాయ పాటల దుకూలా|
కరుణాపయోధివేలా| కాచన చిత్తే చకాస్తు మే లీలా|| 
(ఆర్యా ద్విశతి – 177)

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా
ముఖచంద్ర - చంద్రునిపోలినముఖమునందు
కళంకాభ మచ్చవలే
మృగనాభికస్తూరి
విశేషకా తిలకమునుగల తల్లి

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకాయై నమః
చంద్రుని వంటి ముఖమునందు మచ్చవలే కస్తూరీతిలకమును ధరించినతల్లికి నమస్కారము.


తల్లివదనము రాకేందు రత్నాకల్ప విరాజితాఙ్గలతికా పూర్ణేందు వక్త్రోజ్జ్వలా (త్రిపురామహిమ్నస్తవము) అమ్మవారి ముఖము పూర్ణచంద్రునివలె వర్తులముగను, ప్రకాశవంతముగను గలదు. చంద్రుడు అనగానే మనకు గుర్తుకువచ్చునది మచ్చ. అనవద్యయైన ఇందుశేఖరుని ఇంతియొక్క ఇందువదనమునందు మచ్చ ఎటులుండగలదుయనిన, ఆమె నుదుటి (మృగనాభి) కస్తూరితిలకమునే ఈ మచ్చగా వర్ణించుచున్నారు వాగ్దేవతలు. మృగనాభియనిన సుగంధద్రవ్యమైన కస్తూరి. కస్తూరిలేడి నాభినుండి వచ్చు ఈ సుగంధద్రవ్యము అతి మనోహరమైన సువాసనగలది.

చంద్రునియందుగల మచ్చను మృగము(లేడి)తోను, కుందేలుతోను పోల్చివర్ణించుట వాగ్దేవతావరప్రసాదులైన కవులసంప్రదాయము. వశిన్యాదివాగ్దేవతలు చేసిన అమ్మవారివర్ణన నుండియే నేర్చిరేమో ఆ కవులు మరి!!

కస్తూరి మూడువర్ణములందు లభ్యమగుచున్నది.
కామరూపోద్భవా కృష్ణా నైపాలీ నీలవర్ణయుక్ |
కాశ్మీరీ కపిలచ్ఛాయా కస్తూరీ త్రివిధా స్మృతా|| (భావప్రకాశ నిఘంటువు)
తల్లి సింధూరతిలకాంచితా (630వ నామము)/కస్తూరీతిలకాంచితా (త్రిశతీ నామము) కావున కశ్మీరకస్తూరి తిలకధారణతో శోభిల్లుచున్నదని భావించవచ్చు.

శంకరభగవత్పాదులు చతుషష్ట్యుపచార స్తోత్రమునందు
మాతః ఫాలతలే తవాతివిమలే కాశ్మీర కస్తూరికా
కర్పూరాగురుభిః కరోమి తిలకమ్ దేహేఽఙ్గరాగమ్ తతః| (దేవీ మానసపూజా స్తోత్రము)
తల్లియొక్క అతివిమలమైన ఫాలతలమునందు కాశ్మీరీ కస్తూరి, కర్పూర, అగరులతో తిలకమును సమర్పించినట్లు భావించినారు.

కస్తూరితిలకమనిన వెంటనే మీకందరికీ సుపరిచితమైన
కస్తూరితిలకమ్ లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్
నాసాగ్రే నవమౌక్తికమ్ కరతలే వేణుమ్ కరే కఙ్కణమ్
సర్వాఙ్గే హరిచందనమ్ చ కలయ౯ కంఠేచముక్తావళిం
గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః || (శ్రీకృష్ణకర్ణామృతము2-109)
గుర్తుకువస్తున్నది కదూ!!

మరి లీలాశుకులు అలా దర్శించడానికి కారణము,
కదాచిదాద్యా లలితా పుంరూపా కృష్ణవిగ్రహా|
సర్వనారీ సమారంభాదకరోద్వివశమ్ జగత్|| (తంత్రరాజతంత్రము-34-84శ్లో)
లలితామహాత్రిపురసుందరియే శ్రీకృష్ణునిగ అవతరించి జగత్తును వివశము జేసినది.

లలితోపాఖ్యానము 32వఅధ్యాయము, 87వశ్లోకమునందు స్ఫురత్తిలకరత్నాభ-ఫాలనేత్రవిరాజితా తల్లియొక్క ఫాలనేత్రము ప్రకాశవంతమైన తిలకమువలె నుదుటన శోభిస్తున్నదని వర్ణింపబడినది.

సాధనపరముగా శరీరమునందలి మూడుస్థానములు, హృదయము (సర్వోపాసన), భ్రూమధ్యము (యోగ) మరియు సహస్రారము (తాంత్రిక) శ్రేష్ఠమైనవి. భ్రూమధ్యము ఈశ్వరస్థానము. అందువలన ఇచట తిలక/భస్మ ధారణ నిర్దేశితమైనది.

యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః
స యత్ప్రమాణమ్ కురుతే లోకస్తదనువర్తతే|| (భగవద్గీత 3.21)
సామాన్యులు శ్రేష్ఠులను అనుసరించి నడుచుకొనుచుందురు.

తల్లి భ్రూమధ్యమున తిలకమును ధరించి ఆ స్థాన పవిత్రతను, దాని ముఖ్యత్వమును మనకు తెలియజెప్పుచున్నది. అంతటి పవిత్ర స్థలమున జిగురుతో అంటించుకొను బొట్టుపెట్టుకొనుట ఎంత సబబో ఆలోచించుకొనవలెను.

కశ్మీరారుణకస్తూరీ తిలకమును ధరించిన కరుణాసముద్రయైన సింధూరారుణతల్లి నాలోని రాగరంజిత భావములను సమూలముగ నాశనముజేయవలెనని ప్రార్థిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment