Thursday 19 July 2018

కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా - Karpooravitikaamoda-samakarsha-ddigantara

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

సరస్వతీ సుధాయతే మనోదధాతి పూగతామ్|

హృదేవపత్రమమ్మికే! త్రయమ్ సమేత్యతేఽర్ప్యతే||

(ఉమాసహస్రము 30.17)

ఓ అంబికా!! నా మాటలను సున్నము (ముక్తాచూర్ణము) గానూ, మనస్సును వక్కగానూ, హృదయమును తమలపాకుగాను చేసికూర్చిన తాంబూలమును నీకు సమర్పిస్తున్నాను.

 

కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా

 

కర్పూర-వీటిక - కర్పూరముతోకూడిన తాంబూలము

ఆమోద-  సువాసన, పరిమళము

ఆమోద స్సోఽతినిర్హారీ; ఆ సమంతాన్మోదతే  అనేనేత్యామోదః  (అమరకోశము) మిక్కిలి దూరముగా వ్యాపించుచూ సంతోషపరచు పరిమళము ఆమోదము

 

సమాకర్ష-చక్కగా గ్రహించుచున్న

దిగంతరా- దిగంతములవరకు ఆవరణలు గల తల్లి

ఏలా-లవంగ-కర్పూర-కస్తూరీ-కేసరాదిభిః

జాతీఫలదళైః పూగైః లాంగల్యూషణ నాగరైః

చూర్ణైః ఖదిరసారైశ్చయుక్తా కర్పూరవీటికా||

 

కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరాయై నమః

దిగ్దిగంతములవరకు వ్యాపించిన సువాసనలు వెదజల్లు కర్పూరముతోకూడిన తాంబులమును వేసుకున్న తల్లికి నమస్కారము.

 

సువాసిని స్త్రీలయొక్క మంగళకర లక్షణములలో తాంబూల చర్వణము (సేవనము) కూడా ముఖ్యముగా చెప్పబడినది. తాంబూలపూరితముఖీ (559)యను మరియొక నామము ఈ స్తోత్రమునందేగలదు.

 

లలితా త్రిశతియందలి, కర్పూరవీటిసౌరభ్యకల్లోలిత కకుప్తటా (14) నామము కూడా తల్లియొక్క ఈ సుమంగళీ చిహ్నమును తెలియజేయు నామము. దుర్వాసముని త్రిపురామహిమ్నస్తోత్రమునందు తాంబూలచర్వణముచే ఎర్రబడిన అధరములుగలిగిన తల్లిని 39వశ్లోకమునందు ప్రార్థించారు.

 

అమ్మ ముఖమునుండి వెలువడు వాక్కులు వేదములు (వాచస్తే శృతయోsఖిలాః - లలితా స్తవరాజము), తల్లి జిహ్వ (నాలుక) సరస్వతి (రసనా తే సరస్వతీ -  లలితా స్తవరాజము).

 

వ్యోమమంతటను వ్యాపించినవి వేదములు.

ఋచో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్దేవా అధి విశ్వే నిషేదుః

యస్తన్న వేద కిమృచా కరిష్యతి య ఇత్తద్విదుస్త ఇమే సమాసతే|| 

(ఋగ్వేదము 1-164-39)

ఋచములు (ఋగ్వేదాక్షరములు) వ్యోమమంతటా విరాజిల్లుతున్నవి.

 

సర్వేవేదా యత్పదమ్ ఆమనన్తి, తపాంసి సర్వాణి చ యద్వదన్తి|

యదిచ్ఛన్తో బ్రహ్మచర్యై చరన్తి, తత్తే పదమ్ సంగ్రహేణ బ్రవీమ్ ఓమ్ ఇత్యేతత్||

ఏతద్ధ్యేవాక్షరమ్ బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరమ్ పరమ్|

ఏతద్ధ్యేవాక్షరమ్ జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్|| 

 (కఠోపనిషత్తు 2.15,16)

సర్వవేదములు ఏ పదమును ప్రతిపాదిస్తున్నాయో, ఏ పదమును పొందుటకు సకల తపస్సులు-కర్మలు అనుష్ఠేయములైయున్నవో, దేనిని పొందుటకు బ్రహ్మచర్యమవలంబించుదురో, అదియే ఓమ్. ఈ అక్షరమే పరాపర ప్రాప్తి సాధనము.

 

సరస్వతీమయమైన తల్లి నోటియందలి కర్పూరవీటిక, వేదములసారము ప్రణవము (ఓంకారము). దిగంతములవరకు వ్యాపించు ప్రణవనాదమే అమ్మ తాంబూలపరిమళము.

 

అందువలననే, తల్లి తాంబూలసారమును సమస్తవేదవిజ్ఞానసారము అని నీలకంఠదీక్షితులు ఆనందసాగరస్తవము (82వశ్లోకము) నందు తాంబూలసారమఖిలాగమబోధసారమ్ అని వర్ణించి, నా నోటిని ఉమ్ముపాత్రగా (spittoon) భావించి, నీ  తాంబూలసారమును నా నోటియందు ఉమ్ముతల్లీ అని ప్రార్ధించారు.

 

యుద్ధమునందు దైత్యులను గెలిచిన విశాఖ (షణ్ముఖ), ఉపేంద్ర (విష్ణు), ఇంద్రాదులు త్రిపురహరనిర్మాల్య విముఖులై, మిక్కిలి ఆతురతతో శిరోకవచములను కూడా తీయకుండా ఆ తల్లి నోటియందలి తాంబూలపిడచను పొందుటకు వచ్చినారుయని ఆదిశంకరులు సౌన్దర్యలహరియందు వర్ణించారు.

 

త్రిపురహరుడుత్రిపురములనగా స్థూల, సూక్ష్మ, కారణశరీరములు. త్రిపురములను జయించినవాడు, శివుడు

 

తల్లి అనుగ్రహముతో తాంబూలపిడచ గ్రహించి, జ్ఞానమును పొంది తద్వారా మనకు ఐదువందల శ్రీవిద్యారహస్యగర్భిత శ్లోకములను అందించిన మహానుభావులు మూకశంకరులు.

 

తల్లి నోటిలోని తాంబూల పరిమళము దిగంతములవరకు వ్యాపించినదియనుటలో అమ్మయొక్క విరాట్ విశ్వరూప భావనను స్ఫురింపజేయుచున్నారు వాగ్దేవతలు.

 

ఆఖరిగా ఒక మాట. సగుణ సాకార దేవతా పూజయందలి షోడశోపచారములలో తాంబూలసమర్పణ ఒకటి. కానీ, నిర్గుణమానసపూజా స్తోత్రములో ఆదిశంకరులు చెప్పిన తాంబూలము ఏమిటో తెలుసా

 

రాగాదిగుణశూన్యస్య శివస్యపరమాత్మనః|

సరాగవిషయాభ్యాస-త్యాగః తాంబూలచర్వణమ్||

(నిర్గుణమానసపూజ)

రాగాదిగుణరహితుడైన పరమాత్మునికి సరాగవిషయ త్యాగము చేయుటయే తాంబూలసమర్పణము. రాగమనిన కోరిక (desire), రంగు. రజోరాగాత్మకమ్ విద్ధి (భగవద్గీత 14.7) రాగమునకు రజోగుణము కారణము. విరాగుడైన పరమాత్మకు మనయందలి రాగజనక కారణమైన విషయత్యాగమే మనము చేయవలసిన తాంబూలసమర్పణముగా భగవత్పాదులు ఈ శ్లోకమునందు చెప్పినారు.

 

నాయందలి ఎర్రగుణమును తెల్లగామార్చమని తల్లిని ప్రార్ధిస్తూ,

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment