Tuesday 10 July 2018

vadana-smara-mAngalya-gruha-tOraNa-cillikA వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
అక్షుద్ర మిక్షుచాపమ్| పరోక్షమవలగ్నసీమని త్ర్యక్షమ్|
క్షపయతు మే క్షేమేతరమ్| ఉక్షరథ ప్రేమ పక్ష్మలమ్ తేజః| (ఆర్యాద్విశతి)
మహోపాసకులైన దుర్వాసమహాశయులు కామేశిస్తుతియందు సన్నని మధ్యభాగముతో, మంగళకరమైన ఇక్షుచాపముతో, త్రినేత్రములతో కూడి, వృషభవాహనునియందనురాగముతో నిండిన, తల్లియొక్క పక్ష్మలముల తేజస్సు నాయొక్క క్షేమేతరములను నశింపజేయుగాక!! అని ప్రార్ధించారు.

వదన-స్మర-మాంగల్యగృహ-తోరణ-చిల్లికాయై-నమః
వదన - వదనము
స్మర - మన్మథుడు
మాంగల్యగృహ - మంగళగృహ
తోరణ - తోరణమువంటి
చిల్లిక - కనుబొమలు

వక్రే స్నిగ్ధే కృష్ణవర్ణే సన్ధ్యోస్తేజసా భ్రువౌ|
జాతే దేవ్యాః సుతేజస్కే కామస్య ధనుషీవ తే|| 
(శ్రీమద్దేవీభాగవతము 5.8.65)
కామదేవుని ధనుస్సువలే వంపుతిరిగిన, దట్టమైన నల్లని కనుబొమ్మలు సంధ్యాకాలపు తేజస్సుతో ఏర్పడినట్లు దేవీభాగవతమునందు, మార్కండేయపురాణమునందు చెప్పబడినది.


అమ్మవారి వదనము మన్మథుని మంగళగృహము. ఆగృహమునకు తోరణమువలె తోచుచున్న వంపులు తిరిగిన కనుబొమలు గలిగిన తల్లికి నమస్కారము.

మన్మథుని మంగళగృహమనగా మన్మథునికి మంగళములను/విజయములను చేకూర్చు సంపదగలిగిన భాండాగారము అమ్మవారి వదనము. తపోనిష్ఠుడై స్థాణువువైన మహాదేవుని సుమశరుడు తన బాణములతో జయించలేక అనఙ్గుడైనప్పుడు, అమ్మవారు తన దృష్టిపాతముతో శివునిమోహింపజేసి సృష్ట్యోన్ముఖుని గావించినది. ఆ విధముగా అమ్మవారి కటాక్షకృప వలన తొలుత మదనారివద్ద అపజయము పొందిన కందర్పుడు జయించగలిగినాడు కదా!! అందువలన విషమశరుని విజయమునకు కారణమైన అమ్మవారి ముఖారవిందమును స్మరుని మంగళగృహముగా జెప్పబడినది. అమ్మవారి భ్రూలతికలు ఈ గృహమునకు తోరణము వలెగలవని ఈ నామమునందు వర్ణించబడినవి. మూకకవులు ఆర్యాశతకము 65వశ్లోకమునందు అమ్మవారిని కుసుమశరగర్వసంపత్కోశగృహమ్ అని వర్ణిస్తారు.

ఇక ఈనామమునందలి మంత్రరహస్యమునకువస్తే, ఈనామమునందు అమ్మవారి పంచప్రణవముల సంకేతములుగలవు.

వదన - వాక్ స్థానముగావున వాగ్బీజము
స్మర - కామరాజ బీజము
మాంగల్యసౌభాగ్య బీజము
గృహలక్ష్మీ బీజము
తోరణహృల్లేఖ
చిల్లికావ్యాపించినవి

భ్రువౌభుగ్నే కించిద్ భువనభయభంగ వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యామ్ మధుకర రుచిభ్యామ్ ధృతగుణమ్
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్ఠౌచ స్థగయతి నిగూఢాంతరముమే|| (సౌన్దర్యలహరి – 47)
సమస్త భువనములందు వసించువారల భయమును (భంగముజేయుట) పోగొట్టుటయను వ్యసనముగలిగిన ఓ!! ఉమా!! తత్కార్య నిమిత్యార్ధము పైకిఎత్తబడిన నీ కనుబొమలు మన్మథుని వింటివలెనున్నవి. దట్టమైన తుమ్మెదలబారువంటి నీకనువెంట్రుకలు (పక్ష్మలములను)అల్లితాడువలెనున్నవి. అయితే వింటిమధ్యభాగము నిగూఢముగనుండుటచే, అనంగుడు (రతిపతి) వింటిమధ్యభాగమును వామహస్త పిడికిలి బిగించి పట్టుకున్నందువలన అది అదృశ్యముగానున్నదని తలంచుచున్నాను అని శంకరభగవత్పాదులు వంపులుతిరిగియున్న తల్లి కనుబొమల సౌన్దర్యమును వర్ణించారు. ఇక్కడ మన్మథుని రతిపతియని చెప్పుటయందలి రహస్యము ఏమనిన, రతీదేవికి మాత్రమే గోచరించు అనంగుడు మన్మథుడు. అట్టి అనంగుడైన మన్మథుడు చేతితోపట్టుకొన్న విల్లుమధ్యభాగము, మనకు తెలియబడుటలేదు.

జగములన్నిటినీ రక్షించు ఆర్తత్రాణపరాయణియైన తల్లిదృష్టిపాతమునామీద ప్రసరించవలెనని ప్రార్ధిస్తూ,

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment