Thursday 28 June 2018

SriVidya, SriChakram శ్రీవిద్య, శ్రీచక్రము

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్సదా శ్యామా 
వార్తాలి సంసేవ్యాం భవానీం లలితాంబికామ్||

దక్షప్రజాపతికి పుత్రికగా, సతీదేవిగా అవతరించి అనుగ్రహించినది పరాశక్తి. హవిర్దానములు తన భర్త అయిన శివునికి సమర్పించకుండా యాగము చేయవలెనని సంకల్పించి తండ్రి చేయుచున్న యాగమును చూచుటకై వచ్చిన సతీదేవి, ఇక మీదట దాక్షాయణిగా ఉండనేరను అని యోగాగ్నిదగ్ధదేహయై అంతర్ధానమొందెను. ఆమె తదుపరి భూలోకమునందున్న జీవులననుగ్రహించుటకై హిమవత్పర్వతరాజ పుత్రిక, పార్వతిగా ఆవిర్భవించింది. సతీదేవి అంతర్ధానము పిదప స్థాణ్వాశ్రమమునందు తపమొనరించుచున్న శివుని పతిగా పొందవలెనని పార్వతి ఆయనకు సేవచేయసాగెను. తారకాసురుని బాధలు తాళలేక, శివపార్వతుల పుత్రుడే తారకాసురుని వధింపగలడు అని తలంచిన దేవతలు, లోక కళ్యాణార్ధం వారి కళ్యాణము జరగవలెనని సంకల్పించి, శివుని తపోభంగము చేయుటకు మన్మధుని ప్రేరేపించిరి. అపుడు శివుని ఫాలనేత్రాగ్నివలన దగ్ధమైన మన్మథుని బూడిదనుండి జనియించినవాడు భండాసురుడు. ఈ రాక్షసుడు తన ఇద్దరు తమ్ములు విషంగ మరియు విశుక్రలతో కలిసి దేవతలందరినీ నీరసపరచి పీడించుచుండెనుదేవతలందరూ భండాసురుని బారినుండి కాపాడమని ఆ పరమశివుని వేడగా, ఆయన మహాయాగమును తలపెట్టెను

పరమశివుడు గురుస్థానములో చిదగ్ని కుండమును రగిల్చి మహాయాగము చేసి నిస్సత్తువగా ఉన్న దేవతలను ఆహుతి ఇవ్వగా, ఆ చిదగ్ని కుండము నుంచి ఆవిర్భవించిన తల్లియే లలితా పరాభట్టారిక. ఆ చిదగ్నికుండము నుంచి ముందు వేయి సూర్యుల తేజస్సుతో ఒక కాంతి పుంజము వెలువడి దానినుంచి తర్వాత ఆ తల్లి ఒక సాకార రూపము ధరించి గోచరించినది. ఆమె ఆవిర్భవించిన పిదప దేవతలందరిని నవతేజస్సుతో మరల సృజించెనుఆ తల్లికి దేవతలందరు కలిసి ఆయుధములు రధము (శ్రీచక్రము) సమకూర్చి, మహాకామేశ్వరునితో కల్యాణము జరిపి, శ్రీమన్నగరమునకు మహారాణిగా పట్టాభిషేకముచేసిరి
 
ఈ శక్తినుండి వచ్చిన అక్షర స్వరూపములే వశిన్యాది వాగ్దేవతలువీరు ఎనిమిది మందిమొత్తము అక్షరములలో ఉన్న ఎనిమిది వర్గములకు, మనలో ఉన్న ఎనిమిది వాక్ స్థానములకు, సర్వ మంత్రములకు అధిదేవతలు వీరు. ఈ వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని చేసిన స్తుతియే లలితా సహస్రనామ స్తోత్రము.

ఈ కథ దివ్యభూమికలో జరిగిననూ, మన జీవితములకు కూడా దీనిని అన్వయించవచ్చుమనలో ఉన్న ఆసురీ శక్తులే అసురులు. ఈ ఆసురీ శక్తులు మనలోనున్న దైవీక గుణములను నిర్వీర్యము చేయుచున్నప్పుడు, ఆ పరాశక్తిని ప్రార్ధిస్తే మనకు తల్లి అనుగ్రహముతో అవిద్య తొలగి జ్ఞానము లభించును.

నిరంతరము అంతర్ముఖులై గురువు ఇచ్చిన సాధనా పద్ధతితో మథనము చేయగా చేయగా, గురుకృప వలన రగిలిన జ్ఞానాగ్ని(మూలాధారము నుండి సహస్రారము వరకు కుండలిని రూపములో రగిలేదే సంవిత్-అగ్ని) యందు మోహాంధకారమును (ఇంద్రియాహంకార, అజ్ఞాన) త్యాగము చేస్తే, ఆ అమ్మవారి సాక్షాత్కారము, అనుగ్రహము కలుగుతుంది.

అలా చిదగ్నికుండంలో ఆవిర్భవించిన లలితమ్మ భండాసుర వధ జరిపి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తుంది. ఇది అమ్మవారి లీలావైభవంగా లలితా సహస్ర నామ స్తోత్రంలో వర్ణింపబడుతుంది.
 
***
వేదమయీం నాదమయీం |  బిన్దుమయీం పరపదోద్యదిన్దుమయీం|
మంత్రమయీం తన్త్రమయీం | ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం||
 
చిదగ్నికుండమునుంచి ఆవిర్భవించిన లలితాంబిక ఉపాసన
ఉప సమీపే ఆస్యతే ఇతి ఉపాసన - సమీపముగా ఉండుట

నిరంతర అనుష్ఠానము వలన దేవతా చింతన, భావన చేస్తూ మనస్సును ఆ దేవతకు దగ్గరగా తీసుకు వెళ్ళడమే ఉపాసన. దేవతా ఉపాసనలో ముఖ్యమైనవి మంత్రము, తంత్రము, యంత్రము, విగ్రహము. తంత్రము గురించి ఇదివరకే చెప్పుకున్నాము. ఇక మంత్రము, యంత్రము, విగ్రహములు ఉత్తరోత్తరం బలీయం

మంత్రముమంత్రము అంటే రహస్యము. మంత్రమ్ (మంత్రము) సదసి (సభలయందు అంటే బయటకు) న ప్రకాశయేత్ (చెప్పరాదు).

మంత్రవాచ్యార్ధా దేవతాః దేవతయొక్క శబ్దరూపము మంత్రము. ఒక మంత్రముతో దేవతా ఉపాసన చేసినప్పుడు ఉత్పన్నమయ్యే శక్తియే దేవత. మంత్రము శక్తివంతమైన బీజాక్షరముల రాశి. బీజాక్షరముల శబ్దశక్తి వలన ఏర్పడిన చైతన్యము దేవత. దేవతా శరీరములు మంత్రమయములు. ప్రతి మంత్రమునకు ఒక దేవతా రూపము ఉన్నది. విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యము, మంత్రోపాసన చేసేవారికి ఆ మంత్రాధిదేవతగా సాక్షాత్కారిస్తుంది.   ఇలా మంత్రద్రష్టలు మన ఋషులు. ఉదాహరణకు, చాలామందికి తెలిసిన గాయత్రీ మంత్రమునకు ద్రష్ట విశ్వామిత్రులు.

లలితా పరాభట్టారికా మంత్రము పంచదశి లేదా షోడశి మంత్రము. అమంత్రమ్ అక్షరమ్ నాస్తి నాస్తి మూలమ్ అనౌషధమ్ - మంత్రము కాని అక్షరము లేదు, ఔషధము కాని వేరు లేదు. కానీ ఏ వేరు ఏ అస్వస్థతకు వాడాలో వైద్యుడి ద్వారా తెలుసుకొని వాడినట్లే, గురుముఖత మంత్రోపదేశము పొంది మాత్రమే ఉపాసన చేయాలి.

మన ఋషులు రహస్యముగా స్తోత్రములలో బీజాక్షరములను నిబిడితము చేసి పలపల స్తోత్ర రచనలు చేసారు. ఉపదేశము లేనివారు కూడా ఈ స్తోత్రములను పఠించిన ఆ మంత్రోపాసనా ఫలము పొందవచ్చును. ఆదిశంకర భగవత్పాదులవారే సౌందర్యలహరిలో శివః శక్తిః కామః అనే శ్లోకములో పంచదశీ మంత్రమును గుప్తముగా ఉంచి రచించినారు. సౌందర్యలహరిలో మరెన్నో మంత్ర/ఉపాసనా రహస్యములు ఉన్నాయి. తల్లి ఉపాసకులలో ముఖ్యులైన దుర్వాసముని కూడా చాలామంత్రగర్భిత స్తోత్రములను రచించారు. లలితా సహస్రనామ స్తోత్రమునందు కూడా ఎన్నెన్నో బీజాక్షర రహస్యములు ఉన్నాయి.

మంత్ర రహస్యములగురించి చర్చించేటప్పుడు, ముత్తుస్వామిదీక్షితులగురించి చెప్పకుండా ఉండలేకపోతున్నానుఆయన సుబ్రహ్మణ్య అనుగ్రహ పాత్రుడుఆయన రచించిన కీర్తనలు అన్నీ మంత్రగర్భితములే. ఆయన రచించిన కమలాంబ నవావరణ కృతులయందలి ఆహిరి రాగ కృతి శ్రీకమలాంబా జయతినందు కామాది ద్వాదశభిరుపాసిత కాదిహాదిసాది మంత్రరూపిణ్యాయని తల్లియొక్క మంత్రరూపమును ధ్యానిస్తారు.

అమ్మవారి మంత్రము 15 అక్షరముల మంత్రముఋషులు దర్శించిన రూపమును బట్టి మంత్రము, మంత్రముల అక్షరముల వరుస క్రమము. తల్లియొక్క మంత్ర ద్రష్టలుగా ముఖ్యముగా 12మంది చెప్పబడుచున్నారు.
 
మనుశ్చంద్రః కుబేరశ్చ లోపాముద్రా చ మన్మథః|
అగస్తిరగ్నిః సూర్యశ్చ ఇంద్రః స్కందః శివస్తథా||
క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామీ ఉపాసకాః|
 
వీటిలో ప్రముఖమైనవి విష్ణువు ఉపాసించిన హాదివిద్య (హ ఆదిహ తో మొదలైన అక్షరవరుస), చంద్రుడు ఉపాసించిన సాదివిద్య  మరియు మన్మథుడు ఉపాసించిన  కాది (క ఆది క తో మొదలైన అక్షర వరుస) విద్యఇప్పుడు ప్రబలముగా ఉపాసింపబడుతున్నది కాది విద్యయే.
 
దేవత శబ్దరూపము మంత్రము కాగా, మంత్రము యొక్క రేఖారూపము యంత్రము. అమ్మవారి మంత్రము శ్రీవిద్య, యంత్రము శ్రీచక్రము.
 
శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment