Wednesday 26 September 2018

sinjAna-maNi-manjIra-maNDita-srI-padAmbujA శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

శరణమ్ కరవాణ్యమ్బ చరణమ్ తవ సుందరి|
శపే త్వత్పాదుకాభ్యామ్ మే నాన్యః పన్థా అయనాయ||
 (త్రిపురసుందరీవేదపాదస్తవము)

శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా
శింజాన-మణి – ధ్వనించు మణులతోకూడిన
మఞ్జీరమంజు మనోహరమ్ ఈరయతి ధ్వనతీతి మఞ్జీరః – మనోహరముగా మ్రోగునది
మండిత – అలంకరించబడిన
శ్రీపదాంబుజ – శోభాయమానపాదపద్మములు
ధ్వనులుచేయు మణులతోకూడిన మువ్వలతో మనోహరముగా మ్రోగుచున్న మంజీరములతో శోభిల్లు పాదకమలములు గలిగిన తల్లికి నమస్కారము.

పరమాత్మయొక్క నామరూపాత్మకమైన సృష్టియందలి రూపవిస్తారమును క్రిందటి నామము తెలుపుచుండగా, ఈ నామము ఆ సృష్టియందలి నామ(శబ్ద/ధ్వని)విస్తారమును తెలుపునదిగనున్నది. తల్లి కాలిగోళ్ళయందు వ్యక్తీకరింపబడిన అనంతసృష్టిప్రభలు పరమ్బ్రహ్మయొక్క తేజస్సునందలి నాల్గవభాగమని చెప్పుకున్నాము. తత్సంబంధిత వాక్కు/నాదము/శబ్దము కూడా అదేవిధముగా జెప్పబడుచున్నది.
తత్రైకగుణమాకాశమ్ శబ్ద ఇత్యేవ తత్స్మృతమ్|
తస్య శబ్దస్య వక్ష్యామి విస్తరమ్ వివిధాత్మకమ్|| 
(నారద పురాణము 42.89,90)
వ్యోమముయొక్క ఏకైక గుణమైన శబ్దము పలువిధములుగ విస్తరించబడినది.

బ్రహ్మాయమ్ వాచః పరమమ్ వ్యోమః (ఋగ్వేదము 1.164.3)
ఋతస్య ప్రథమజ వాచః (ఋగ్వేదము 1.164.37)
(ఋతము) పరంబ్రహ్మ తేజస్సునుండి వ్యోమము(ఆకాశము)నందు ప్రథమముగా శబ్దము ఉద్భవించినది.

క్రిందటినామమునందు పరంబ్రహ్మనుండి ప్రథమముగా జలము ఏర్పడినట్లు చెప్పుకున్నాము. ఈ జలములే శబ్దజనకములు (సలిల సమృద్ధే ఘోషవాన్ – నారదపురాణము అ42-శ్లో51-52).

సృష్టిచేయుటయనునది క్రియాశక్తి సూచితము. ఏదైనా క్రియ జరిగినప్పుడు, శబ్దముజనించుట విదితమే. అయితే పరమేశ్వరుని సృష్టికారణముగ ఏర్పడిన శబ్దము, అశ్రవణము.

అనాహతో హతశ్చైవ స నాదో ద్వివిధో మతః|
ఆకాశసంభవో నాదో యః సోనాహతసంజ్ఞితః|| 

(సంగీత మకరందము – 1.4)
అనాహత (అశ్రవణములు), ఆహత(శ్రవణములు)  యని నాదము రెండు విధములు. అనాహత శబ్దమనిన రాపిడిలేకుండగ ఏర్పడిన, శ్రవణేంద్రియములు గ్రహించలేనిది, రహస్యమైన శబ్దమనియు అర్ధములు. వ్యోమమునందు ఏర్పడిననాదము అనాహత సూచితము.

వేదశబ్దేభ్య ఏవ-అదౌ పృథక్ సంస్థాశ్చ నిర్మమే |
  (మనుస్మృతి – 1.21)
వేదత్రయాత్ సముధృత్య ప్రణవమ్ నిర్మమే పురా| 
(గాంధర్వ తంత్రము – 18.57)
వేదశబ్దములు అనాహతము, మూడువేదములందలి ప్రణవము అనాహతము.

చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్ బ్రాహ్మణా యే మనీషినః
గుహా త్రీని నిహితా నేన్గయన్తి తురీయమ్ వాచో మనుష్యా వదంతి|| 
 (ఋగ్వేదము1.164.45)
ప్రజ్ఞానఘనీభూతమైన పరమాత్మనుండి వెలువడిన దివియందలి వాక్కు/శబ్దము నాలుగు దశలుగ పరిణామము చెందుతుంది - పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వీనియందు మొదటి మూడు పరా, పశ్యంతి, మధ్యమ, గుహ్యములు. మహాతపస్వులైన దృష్టలు, ఋషులుమాత్రమే గుహ్యమైన స్వర్లోకపు వాక్కును దర్శించగలరు.  వ్యక్తీకరింపబడిన సృష్టియందలి శబ్దములన్నియూ దివియందలి వాక్కుయొక్క నాల్గవభాగము మాత్రమే.

వ్యక్తీకరింపబడిన నాల్గవ భాగమైన వైఖరి దివిశబ్దములు, అనంతకోటిబ్రహ్మాండ సృష్టియందు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరియని మరల నాలుగు భాగములుగా విభజించబడినవి. వీనియందలి మూడుభాగములు పర,పశ్యంతి,మధ్యమ గుహ్యముగానుండును. మనుష్యులు మాట్లాడుచున్న వైఖరివాక్కు నాల్గవభాగము.

శబ్దబ్రహ్మమయమ్ యత్తన్మహావాక్యాదికమ్ ద్విజ |
తద్విచారోద్భవమ్ జ్ఞానమ్ పరమ్ మోక్షస్య సాధనమ్ ||
 (నారద పురాణము – 33.65)
వేదవేదాంగములందలి తత్త్వమసి, అహమ్ బ్రహ్మోస్మి వంటి మహావాక్యములు (శ్రీపదములు) శబ్దబ్రహ్మమయములు మరియు మానవులకు మోక్షసాధనములు.

తల్లిపాదపద్మములందలి మువ్వలధ్వనులు శబ్దబ్రహ్మాత్మకమైన  మహావాక్య సూచితములు. వీనినే వాగ్దేవతలు శ్రీపదములని సూచించినారు.

పాదములందలి అనంతచైతన్యశక్తియొక్క శబ్దరూపమునే అజాతశత్రువు నడుచునప్పుడు వెలువడు శబ్దరూప ముఖ్యప్రాణశక్తియని బృహదారణ్యకోపనిషత్తునందు వ్యవహరించారు.

స య ఏతమేవముపాస్తే సర్వం హైవాస్మల్లోక ఆయురేతి నైనమ్ పురా కలాత్ప్రాణో జహాతి|
(బృహదారణ్యకోపనిషత్తు – 2.1.10)
గార్గి, అజాతశత్రువుల సంవాదమునందలి ఈ మంత్రము, చలనమువలన ఏర్పడు శబ్దమును ముఖ్యప్రాణమని (vital force/Sabda Brahma) చెప్పుచున్నది. ఇక్కడ, నడుస్తున్నప్పుడు జనించు శబ్దమును చర్చిస్తున్నారు.

సహస్రనామములందలి మూడునామములు మాత్రమే రత్న కలిగియున్నవని ఇదివరలో చెప్పుకున్నాము. (రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా – కటిసీమ: మూలాధారము/నాభి) పరా, పశ్యంతి, (కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ - హృదయము) మధ్యమ, (రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా-గ్రీవము/కంఠము) వైఖరీ వాక్కు సంబంధిత స్థానములు రత్నయను పదమునుగలిగియున్నవి. 

శబ్దరూప పరమచైతన్యము పరావాక్కు.
బిందోస్తస్మాద్ భిద్యమానాద్ రవోవ్యక్తాత్మకో భవేత్|
స రవః శృతిసంపన్నైః శబ్దబ్రహ్మేతి కథ్యతే| 
 (ప్రపంచసారతంత్రము1.44)
చైతన్యం సర్వభూతానామ్ శబ్దబ్రహ్మేతిమేమతిః|
తత్ప్రాప్య కుండలీరూపమ్ ప్రాణినా దేహమధ్యగమ్|| 
 (శారదాతిలకతంత్రము-శబ్దబ్రహ్మోత్పత్తి)
ప్రజ్ఞానచైతన్యఘనీభూతమైన పరమాత్మ, సర్వప్రాణులదేహములందలి మూలాధారమునందు శబ్దబ్రహ్మరూపముగనుండి వాయుప్రోద్బలముచే ఊర్ధ్వదిశగా ప్రయాణించి వైఖరీవాక్కుగ వెలువడుచున్నది.

రత్నకింకిణుల కటిసూత్రముతో అలంకరించబడిన మూలాధారమునుగలిగిన కటిసీమ, శబ్దబ్రహ్మమైన పరావాక్స్థానము.

తల్లి ఆభరణములన్నియు చైతన్యవంతములే అయిననూ, సగుణరూపవర్ణనయందు రెండు నామములందు మాత్రమే మ్రోగుచున్న మువ్వలను చెప్పబడినవి. శబ్దబ్రహ్మ స్థానములైన (పరావాక్స్థానము-మూలాధారము) కటిసీమను, పాదపద్మములను అలంకరించిన ఆభరణములు (రత్నకింకిణిలుగలిగిన వడ్డాణము/కటిసూత్రము, శింజానమణులు గలిగిన మంజీరములు) మాత్రమే చిరుసవ్వడిజేయునవని వాగ్దేవతలు వర్ణించారు.

తల్లి మంజీరరవములు మానవులకు మోక్షసాధనములైన మహావాక్యములనునది అంతరార్ధము.

తల్లియొక్క మనోహరమైన అనాహత మంజీరనాదములో సదాసర్వదా లీనమగు భాగ్యము కలగవలెనని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment