Sunday 9 September 2018

nakha-dIdhiti-sanchanna-namajjana-tamOguNA నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః

ఆశౌశవాత్-మమతయా కలితః త్వయా-అసౌ
ఆనృణ్యమ్- అమ్బ తవ లబ్ధుమనాః మృగాంకః|
స్వాత్మానమేవ నియతమ్ బహుధా విభజ్య
త్వత్పాదయోః వినిదధే నఖరాపదేశాత్|| 
(నీలకంఠదీక్షితుల ఆనందసాగర స్తవము – 64)
అంబా!! నెలవంక శిరస్సుమీద ధరించుటద్వారా చిరువయసునుండి నీమమతకు పాత్రుడగుటచే, నీపట్లతనకుగల భక్తినిచూపించుటకొరకుగాను, చంద్రుడు స్వయముగ తనను పదిఖండములుగ విభజించుకొని, నీ కాలిగోళ్ళరూపమును ధరించినట్లున్నది.

నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా
నఖము -  గోరు
దీధితిప్రకాశము
సంఛన్నఆవరించిన
నమత్-జన - నమస్కరించిన జనులకు
తమోగుణ తమోగుణము
నమస్కరించిన జనుల తమోగుణమును సంపూర్ణముగా ఆవరించగల ప్రకాశముతోకూడిన కాలిగోళ్ళనుగలిగిన తల్లికి నమస్కారము. రాత్రినుండి ఆవరించిన అంధకారము, తరుణారుణకాంతుల ప్రకాశముతో తొలగినట్లుగా, తలవంచి తల్లి పాదములకు నమస్కరించిన భక్తుల హృదయాంధకారము, తల్లికాలిగోళ్ళ వెన్నెలవెలుగులతో సమూలముగా నశించునని వాగ్దేవతలు భక్తుల తమోగుణనిర్మూలనకు తరుణోపాయము చెప్పుచున్నారు.

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన || (భగవద్గీత 14.13)
త్రిగుణములలో ఒకటైన తమోగుణముయనిన అప్రకాశము(అజ్ఞానము, అవివేకము, భయము), అప్రవృత్తి (జడత్వము, సోమరితనము), ప్రమాదము (అజాగ్రత్త), మోహము మొదలగునవి. వీనియందు కృష్ణపరమాత్మ అప్రకాశమును ముందుచెప్పుటచే అది ఎంతముఖ్యమైనదో తెలుసుకొనగలరు. సదసత్-జ్ఞానము లేకపోవడమే అజ్ఞానము. నిజానికి, ఈ ఒక్కదానివలన మిగిలినవి కలుగుచున్నవి.

! చండీ!! (స్వర్గలోకపు) నాకస్త్రీలు నీ పాదములకు ప్రణమిల్లుటకు రెండుచేతులను దగ్గరజేర్చినపుడు వారి కరకమలములు, నీ పాదములందలి కాలిగోళ్ళ తెల్లని చంద్రకాంతులకు ముకుళించుకుపోవు కమలములవలెనున్నవి. అంతేకాదు, స్వర్గలోకమునందలి కల్పవృక్షములు తమచేతులను చిగురుటాకులతో స్వర్గవాసుల కోరికలు మాత్రమే తీరుస్తాయి. కానీ, పాదములను శరణువేడినచో దేవతాస్త్రీలతో పాటు దరిద్రులకు, సామాన్యమానవులకు కూడా కోరినసంపదలను నిరంతరము ఇచ్చు తల్లిపాదములు కల్పవృక్షములకన్న మిన్నయని, తల్లిపాదములు కల్పవృక్షములను పరిహసిస్తున్నట్లు 89వశ్లోకము నఖైర్నాకస్త్రీణామ్ కరకమల సంకోచశశిభిః యని శంకరభగవత్పాదులవారు సౌన్దర్యలహరియందు చంద్రకాంతులను వెదజల్లు తల్లికాలిగోళ్ళను వర్ణించారు.

అంతరార్ధము:
తమ ఆసీత్తమసాగూఢమ్ అగ్రే ప్రకేతమ్ సలిలమ్ సర్వమా ఇదమ్|
(నాసదీయ సూక్తము 10.129.03)
నాసీదహో న రాత్రిరాసీన్న సదాసీన్నాసదాసీత్ తమ ఏవ పురస్తాదభవద్ విశ్వరూపమ్|
సా విశ్వరూపస్య రజనీ హి ఏవమస్యార్థోనుభాష్యః||
(మహాభారతము శాంతిపర్వము - 342-8శ్లో)
తమో వా ఇదమగ్ర ఆసీదేకమ్ (మైత్రాయణ్యుపనిషత్తు 5.2)
సృష్టికి పూర్వముగల అహము(పగలు), రాత్రి, సత్తు, అసత్తుకాని విశిష్టమైన ప్రజ్ఞావంత విశ్వరూప విశ్వచైతన్యమే తమస్సు. ఈ తమస్సును విశ్వాత్మయొక్క (రజని)రాత్రిగా  జెప్పబడుచున్నది. (సోఽకామయత బహుస్యామ్ ప్రజాయేయేతి - తైత్తిరీయ ఉపనిషత్తు) ఒక్కటిగానున్న ప్రజ్ఞానఘనమైన బ్రహ్మవస్తువు  బహురూపములు పొందు సృష్టికార్యము, విశ్వాత్మయొక్క పగలు. అట్టి సృష్టికారణముచే, సూర్యకిరణముల వెలుగుతో మరుగగుచున్న చీకటివలె, తమస్సు అంతమగుచున్నది. దీనినే దీర్ఘతమస్సను ఋషి, ఋగ్వేదమునందు (1.158) నిగూఢముగ వ్యక్తపరచినారు.

సృష్టికి తఱువాయి అదృశ్యమగుచున్న ఆదితమస్సునే ఈ నామమునందు తమోగుణమని వ్యవహరించుచున్నారు. మరి తల్లి కాలిగోళ్ళకు, తమోగుణమునకు సంబంధమును తెలుసుకొనవలెననిన శ్రీమద్దేవీభాగవతమునందు బ్రహ్మదేవుడు చెప్పిన క్రిందిశ్లోకములను పరిశీలించవలెను.

నఖదర్పణ మధ్యే వై దేవ్యాశ్చరణపంకజే|
బ్రహ్మాండమఖిలమ్ సర్వే తత్ర స్థావరజంగమమ్
(శ్రీమద్దేవీభాగవతము 3స్క-4-20-30శ్లో)
తల్లియొక్క చరణపంకజములందలి దర్పణములవంటి గోళ్ళయందు అఖిల బ్రహ్మాండమునందలి సమస్త స్థావరజంగమసృష్టిని (బ్రహ్మ, విష్ణు, రుద్ర, వాయు, అగ్ని, యమ, సూర్యచంద్రులు, వరుణ, త్వస్థ, ఇంద్ర, కుబేరాది దేవతలు, అప్సరసలు, గంధర్వులు, నదులు, సముద్రములు, పర్వతములు, విశ్వావసు మొదలైన వారు, నారదతుంబురులు, హాహా, హూహూ మొదలైన గంధర్వులు, అశ్వినులు, అష్టవసువులు, సాధ్యా, సిద్ధులు, పితృదేవతలు, అనంత మొదలైన నాగములు, కిన్నెరలు, రాక్షసులు, బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము) చూసితిమని బ్రహ్మదేవుడు చెప్పినట్లు వ్యాసదేవులు దేవీభాగవతమునందు వర్ణించారు.

తల్లియొక్క కాలిగోళ్ళయందు తెలియబడుచున్న బ్రహ్మాండపు కాంతివెలుగులతో తమస్సు తొలగించబడినట్లు చెప్పునది ఈ నామము.

(ఏకమేవాద్వితీయమ్-బ్రహ్మ) అజరము, అమృతము, అభయము, అశోకము, అనంతముయైన సృష్టి, స్థితి, లయకారక బ్రహ్మవస్తువుతో ప్రారంభించిన తల్లిసగుణరూపవర్ణన సకలసృష్టినిగలిగిన పాదములతో పూర్తియగుచున్నది. తల్లియొక్క కేశాదిపాదాంత సగుణరూపవర్ణనయందు సత్-చిత్-ఆనందభూతమైన విశ్వచైతన్యాత్మక పరమాత్మనుండి సమస్త బ్రహ్మాండాంతర్గత స్థావరజంగమ సృష్టిక్రమము రహస్యముగనుంచి స్తోత్రరచన జేసినారు వాగ్దేవతలు.

భైరవయామల తంత్రమునందు మహాదేవుడు స్వయముగా ఈ క్రింది స్తోత్రమునందు, పిండాండ, బ్రహ్మాండముల సృష్టి, స్థితి, సంహారక్రమములను తెలియజేయునదే శ్రీచక్రమనియు, తల్లి శ్రీచక్రరూపిణియనియు చెప్పినాడు.

కలావిద్యాపరాశక్తిః శ్రీచక్రాకారరూపిణీ|
తన్మధ్యే బైందవమ్ స్థానమ్ తత్రాస్తే పరమేశ్వరీ||
సదాశివేనసంయుక్తా సర్వతత్త్వాతిగామినీ|
చక్రమ్ త్రిపురసుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ||
పంచభూతాత్మకమ్ చైవ తన్మాత్రాత్మకమేవచ|
ఇంద్రియాత్మకమేవచ మనస్తతత్త్వాత్మకమ్ తథా||
మాయాదితత్త్వరూపమ్ చ తత్త్వాతీతమ్ తు బైందవమ్|
బైందవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణీ||
ఇందుమూలము, సగుణరూపవర్ణననామములందు వాగ్దేవతలు గుప్తముగా శ్రీచక్రావిష్కరణగావించినట్లున్నది.

తల్లియొక్క కాలిగోళ్ళ వెన్నెలవెలుగులు నాయందలి అంతఃతిమిరమును సమూలముగా నాశనముజేయవలెనని ప్రార్థిస్తూ
శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment