Saturday 1 September 2018

kUrma-pruSHTha-jayiShNu-prapadAnvitA కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శివర్ణమ్ తుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
ప్రపదజితకూర్మమూర్మిల| కరుణం భర్మరుచినిర్మధన దేహమ్|
శృతిమర్మ వర్మశంభోః | కించన నర్మ మమ శర్మనిర్మాతు||
(ఆర్యాద్విశతి-175)
తాబేటిని జయించు మీగాళ్ళను కలిగి, బంగారుకాంతిని నిశ్శేషముగా మథించుచూ, శ్రుతులరహస్యములను కవచముగాగలిగిన కరుణాతరంగియైన శంభుని అనిర్వచనీయవిలాసరూప తత్త్వము నాకు సుఖమును కలిగించుగాక!!

కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా
కూర్మ-పృష్ఠ  - తాబేలు పైభాగము
జయిష్ణుజయించు
ప్రపద - పాదముల పైభాగము (పాదాగ్రమ్ ప్రపదమ్అమరకోశము)
అన్విత -  కలిగినది
బ్రహ్మణస్తేజసా పాదౌ (మార్కండేయపురాణము 82.15) బ్రహ్మతేజస్సుతో ఏర్పడిన తల్లియొక్క పాదములపైభాగము (మీగాళ్ళు), తాబేటి పైభాగమును మించినటువంటి సోయగముతోనున్నవని వాగ్దేవతల ఉవాచ.

కూర్మపృష్ఠమును ఓడించు అందమైన పాదముల పైభాగము గలిగిన తల్లికి నమస్కారము.

రోమస్వేదైశ్చరహితమ్ మసృణమ్ మృదుమాంసలమ్|
పృథులమ్ గూఢశిరః శస్తమ్ పాదపృష్ఠమ్ సమున్నతమ్|| (బృహత్-సాముద్రిక)
రోమములు, స్వేదము లేకుండగా, నున్నగా, మృదువుగా, విశాలముగనుండి, మాంసముతోకూడి నరములు గూఢముగనుండి, ఎత్తుగానున్న పాదపృష్ఠములు శ్రేష్ఠమైన సాముద్రికా లక్షణము.

ఇటువంటి శ్రేష్ఠమైన సాముద్రికా లక్షణములుగల తల్లి ప్రపదములను తాబేటివీపుడిప్పలతో పోల్చిచెప్పారు వాగ్దేవతలు. ఉత్తమసాముద్రికాలక్షణముగల మీగాళ్ళను తాబేటిపైభాగముతో పోల్చుటకు, మనకవులు వీరివద్దనుంచే నేర్చారేమో మరి!!

మరి తాబేటి వీపుడిప్పలు కఠినముగనుండునుగదా!! తల్లినేమో మహాలావణ్యసేవధి!! ఆపదలనుపోగొట్టు కీర్తివంతములైన అతిసున్నితమైన, కుసుమములవంటి నీప్రపదములను పురాతన కవులు కూర్మపృష్ఠముతో ఎలా పోలుస్తున్నారు? పాణిగ్రహణసమయమున దయతోకూడిన మనసుతో త్రిపురాంతకుడు కూడా, సుతిమెత్తని నీపాదాంబుజములను సన్నికల్లుమీద పెట్టాడు!! అని శంకరభగవత్పాదులవారు సౌన్దర్యలహరి 88వశ్లోకము పదమ్ తే కీర్తీనామ్ ప్రపదమపదమ్ దేవి విపదామ్ నందు శంకరుడు మహాదయావంతుడులే!! మెత్తని నీపాదపద్మములను శంకరుడు కఠినమైన రాతిమీద పెట్టాడు అని  వ్యంగముగా స్తుతించినట్లున్నది.

కాంచీమహాపెరియవా సందర్భములో శివానందలహరియందలి 80వశ్లోకమును (!! శంభుడా!!నేను పుట్టడానికిముందే,  నాయొక్క కఠినమనసునందు సంచరించుటకు వీలుగాను,  నీసున్నితపాదములతో కఠినమైన పర్వతములమీద తిరుగుట  అభ్యసించినావు!!) తీసుకొని, ఆదిశంకరుల సౌన్దర్యలహరి యందలి శ్లోకార్ధమును విధముగ జెప్పినారు. అమ్మా!! నాకఠిన మనస్సుమీద తనతో కలిసి సంచరించుటకు నీకు అలవాటుచేయుటకొరకు పురమథనుడు దయతో నీ ప్రపదములను కఠినమైన సన్నికల్లుమీద పెట్టాడు.  

ఇది బాహ్యార్ధము.

రూపవర్ణన నామములలో వాగ్భవకూటము (నిజసల్లాపమాధుర్యవినిర్భత్సితకచ్ఛపీ), శక్తికూటము (కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా) లందలి రెండునామములందు కూర్మము/కచ్ఛపము(తాబేలు)యని వాడినారు వాగ్దేవతలు.

బ్రహ్మాండపురాణమునందలి చిదగ్నికుండసంభూత స్తవరాజమునందు తల్లివిరాట్రూపవర్ణనజేయుచూ, అతలమ్ తు భవేత్పాదౌ, స్వస్తే ముఖముదాహృతమ్ యని దేవతలు వర్ణించారు. (స్వర్గలోకము) ముఖమును, పాదములను (పృథ్వి) సూచించు నామములందు కచ్ఛప, కూర్మ పదము వాడుటయందలి రహస్యము తెలుసుకొనుటకు శతపథబ్రాహ్మణమును ఆశ్రయించుదాము.

ద్యావా పృథివ్యో హి కూర్మః (శతపథబ్రాహ్మణము– 7-5-1.10)
(ద్యౌః) స్వర్గలోకము, పృథ్వీ, రెండునూ కూర్మమని చెప్పబడును.

ఋచమ్ వాచమ్ ప్రపద్యే మనో యజుః ప్రపద్యే సామ ప్రాణమ్ ప్రపద్యే చక్షుః శ్రోత్రమ్ ప్రపద్యే (యజుర్వేద సంహిత 36.1)
వాక్కుల ద్వారా ఋగ్వేదమును, మనస్సు ద్వారా యజుర్వేదమును, ప్రాణముల ద్వారా సామవేదము, చక్షువులు, శ్రోత్రములను నేను పొందుతున్నాను.

యః కూర్మః అసౌ ఆదిత్యః (శతపథబ్రాహ్మణము– 7-5- 1.6)
వాగ్భవకూటము జ్ఞానస్థానము. ఆదిత్యుడు జ్ఞానసంకేతమగుటచే వాక్స్థానమునందలి కచ్ఛపి జ్ఞానప్రధానమైన ఋగ్వేద సూచితముగనున్నది.

యజ దేవపూజా-సజ్గతికరణా-దానేషు (పాణిని ధాతుపాఠము-1002) యజయను ధాతువునుండి వచ్చిన యజ్ఞమునకు  దేవపూజ, సత్సంగము, దానముయని మూడు అర్ధములు చెప్పబడినవి. అందువలన యజుర్వేదము, కర్మానుష్ఠాన యజ్ఞవిధానములను తెలుపు శాస్త్రము.

యజ్ఞో దానమ్ తపశ్చైవ పావనాని మనీషినమ్ (భగవద్గీత 18.5)
యజ్ఞము, దానము, తపస్సు చేయుటము వలన మనుష్యులు పావనులవుతారు. ఇంద్రియముల సహాయముతో సత్కర్మలనాచరించి తరింపగల అవకాశము సృష్టియందు ఒక్క మానవజాతికి మాత్రమే గలదు.

వృషావై కూర్మః (శతపథబ్రాహ్మణము– 7-5- 1.6)
ఇంద్రుడు కూర్మము.

ఇంద్రియముల ద్వారాజేయు పనులను సూచించు శక్తికూటమునందలి (క్రియాశక్తిని సూచించు పదద్వయములందలి) ప్రపదములను సూచించు కూర్మము క్రియాప్రధానమైన యజుర్వేద సూచకముగ జెప్పినట్లున్నది.

ఈవిధముగా వాక్స్థానముయందలి కచ్ఛపి, ప్రపదముల (మహావాక్యములు) స్థానమునందలి కూర్మము ఋగ్యజుర్వేదములకు వరుసగ, సంకేతముగనున్నట్లున్నవి. ఇక్కడ వాగ్దేవతలు త్రయీ అనిచెప్పబడు మూడు వేదములందలి సామవేదమును చెప్పలేదు. సామవేదమంత్రములు ఋగ్వేదమునుంచి తీసుకొనబడినవగుటచే కాబోలు. సామవేదమునందు ఋగ్వేదమునందలి మంత్రములను ఉదాత్త, అనుదాత స్వరోచ్ఛారణకు బదులుగా రాగబద్ధముగా గానముచేయబడును. (The Vedas, Kanchi Maha Periyava).

అతిలావణ్యమైన ప్రపదములతోకూడిన పాదములతో తల్లి, అయ్యవారితో కలిసి నా రాతిహృదయముమీద నాట్యమాడవలసినదిగా ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment