Sunday 16 September 2018

pada-dvaya-prabhAjAla-parAkruta-sarOruhA పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
దధానో భాస్వత్తామమృతనిలయో లోహితవపు-
ర్వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్|
గతౌ మన్దో గఙ్గాధరమహిషి! కామాక్షి! భజతాం
తమః కేతుర్మాతస్తవ చరణపద్మో విజయతే|| 
(మూకపంచశతి-పాదారవింద శతకము – 59)
తల్లీ!! గంగాధరునిపట్టమహిషీ!! కామాక్షీ!! నీ చరణపద్మములు ప్రకాశమును వెదజల్లుటచే సూర్య తత్త్వమును, భక్తులకు మోక్షామృతత్వమును ప్రసాదించునవగుటచే చంద్రతత్త్వమును, లోహితవర్ణపువగుటచే అంగారక తత్త్వమును, సౌమ్యత్వముచే బుధగ్రహ తత్త్వమును, భక్తులకు జ్ఞానమును ప్రసాదించునవగుటచే గురుగ్రహ తత్త్వమును, కవితాచాతుర్యమును అనుగ్రహించునవగుటచే (కవి)శుక్రగ్రహ తత్త్వమును, మందగమనయగుటచే శనిగ్రహ తత్త్వమును సూచించుచుండగా, భక్తుల అజ్ఞానాంధకారములకు(తమస్సు) శత్రువు(కేతు)లగుటచే రాహుకేతువులను సూచిస్తున్నాయి. ఈ విధముగా నీ పాదపంకజములు భక్తులకు ఐహికసుఖములను ప్రసాదించు నవగ్రహములరూపమున విరాజిల్లుతున్నాయి.

పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా
పదద్వయ – పాదములజంట
ప్రభాజాల – వెలుగులు
    పరాకృత – ఓడించు 
    సరోరుహా - సరస్యామ్ రోహతీతి సరసీరుహమ్, రుహ బీజ జన్మని ప్రాదుర్భావేచ - సరస్సునందు పుట్టినది; -      కమలములు/తామరలు
ద్వయకలిగిన ఈ నామము పాదములకాంతులను వర్ణించునది. పద్మములకాంతులను మించినకాంతులతో కూడిన పాదములజంట గలిగిన తల్లికి నమస్కారము.

పద్యతే గమ్యతే అనేనేతి పాదః వీనిచే అడుగులు వేసి, గమనముజేయుటచే  పాదములనిచెప్పబడుచున్నవి. అందుచే పాదములందలి ద్వయశబ్దము శక్తికూటమునందలి క్రియాశక్తి సంబంధితము, ఉమామహేశ్వరుల సూచితము.

వాగ్దేవతలు తల్లి పాదములకాంతులు పద్మముల కాంతులను ఓడిస్తున్నాయని మాత్రమేజెప్పారు. ఆదిశంకరులు సౌన్దర్యలహరియందలి 87వశ్లోకము హిమానీహంతవ్యమ్ హిమగిరినివాసైక చతురౌనందు, పద్మములకన్నా ఏఏ విషయములందు తల్లి పాదములు ఉత్తమముగా ఉన్నాయో పట్టీవేసి చూపించారు. పద్మములు మంచుప్రాంతములందు వాడిపోతాయి కానీ మంచుకొండను పుట్టినిల్లు, మెట్టినిల్లుగా గలిగిన తల్లియొక్క పాదములు సహజవికసన గుణమును కలిగియున్నాయి. పద్మములు సూర్యకాంతికి వికసించి, చంద్రుని రాకతో ముకుళించుకుపోతాయి. కానీ భక్తులపట్ల కరుణాపూరితయైన తల్లిపాదాంబుజములు వారిని అనుగ్రహించుటకొరకు సర్వకాల సర్వావస్థలయందు వికసించి ఉంటాయి. మూడవదిగా, పద్మములు, ఐశ్వర్యదేవతయైన లక్ష్మీదేవికి నిలయముకాగా, తల్లిపాదాబ్జములు శరణువేడిన భక్తులకు ఐశ్వర్యమును ప్రసాదిస్తున్నాయి. అమ్మా!! ఈ విధముగా నీ పాదాంబుయములు, సరోరుహములకన్న మిన్నయని శంకరభగవత్పాదులవారు, సరోరుహములను పరిహసించు పాదపద్మములను స్తుతించారు.

గోళ్ళకాంతులు, పాదములవి కాదా? మరి దీనికి విడిగా వేరొకనామము జెప్పుటయందలి అంతర్యము?? పాదములప్రకాశము దేనిని సూచిస్తున్నది?
అంతరార్ధము:
కాలిగోళ్ళ కాంతులను వర్ణించిన వెంటనే, ఆ కాలిగోళ్ళనుకలిగిన పాదముల తేజస్సును వర్ణిస్తున్నారు వాగ్దేవతలు, ఈ నామమునందు. మ్రొక్కినవారి తమోగుణమును కాలిగోళ్ళ కాంతులు పోగొడుతున్నాయని చెప్పి, ఆ గోళ్ళనుకలిగిన పాదములకాంతులు పద్మములకాంతులను జయిస్తున్నాయని పొగుడుతున్నారు. తల్లి పాదములను వాగ్దేవతలు తామరలతో పోల్చి  (పాదాబ్జము, పదామ్బుజము) ఇదే స్తోత్రమునందు స్తుతించారు. కానీ, ఈ నామమునందు పాదములవెలుగులను మాత్రమే చెప్పారుగాని, పాదములను పద్మములని నేరుగా వర్ణింపలేదు.

దీనిరహస్యమును తెలుసుకొనుటకు పోల్చబడిన పదద్వయములను, సరోరుహమును చూద్దాము.

బహిర్గతమైన సృష్టిరహస్యము నాసదీయసూక్తమునందలి క్రింది మంత్రము ద్వారా తెలుసుకున్నాము.
ఆసీత్తమసాగూఢమ్ అగ్రే ప్రకేతమ్ సలిలమ్ సర్వమా ఇదమ్|
(నాసదీయ సూక్తము 10.129.03)
ఇంకనూ,
తామిద్ గర్భమ్ ప్రథమమ్ దధ్ర ఆపో యత్ర దేవా స్సమగచ్ఛంత విశ్వే
  (ఋగ్వేదము 10.82.6)
ఆప ఏవదమగ్ర ఆసుః (బృహదారణ్యకోపనిషత్తు 5.5.1)
అప ఏవ ససర్జాऽऽదౌ తాసు వీర్యమవాసృజత్  
 (మత్స్యపురాణము 2.28,మనుస్మృతి 1.08)
యదమోఘ మపామన్తరుప్తమ్  బీజమజత్వయా
అతశ్చరాచరం విశ్వమ్ ప్రభవస్తస్య  గీయసే  
(కుమారసంభవము – ద్వితీయసర్గ -5)
వీటన్నిటియందు చెప్పబడినది, సృష్టికి పూర్వమునున్న సలిలమ్, అప అంటే నీరు. సృష్టిచేయ సంకల్పించిన పరమేశ్వరుడు జలములను (primordial cosmic waters) ముందు సృష్టించి తనబీజమునందుంచెనని యర్ధము. ఈ చరాచర విశ్వమంతయు సరస్సుయందలి సృష్టిబీజమునుండి వెలువడినదే. ఈ నామమునందలి సరోరుహ అంటే సరస్సునుంచి ఉద్భవించిన బ్రహ్మాండ జగత్తు.

సరోరుహకాంతులను తల్లియొక్క పదద్వయ ప్రభలు ఓడించుచున్నవనిన, బహిర్గతసృష్టి ప్రకాశములకు అధికరెట్లు పదద్వయ తేజస్సుగలదని అర్ధము.

స్థావరజంగమసృష్టికి మూలము సృష్టిస్థితిలయకారకమైన శివశక్త్యాత్మకమైన బ్రహ్మవస్తువు. ఈ పరంబ్రహ్మమునే పురుషుడుయని నిగమాగమములందు జెప్పబడినది.

పురాణ్యనేన సృష్టాని నృతిర్యగృషిదేవతాః | శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌ|
 (శ్రీమద్భాగవతము 7.14.37)
సర్వ సృష్టి, స్థితి, లయ కారణకర్తయైన పరమేశ్వరుడు ఆబ్రహ్మస్తంబశిల్పకల్పనజేసి, వానియందు స్వయముగ అంతర్యామిరూపముగ (పురిశయనాయాత్పురుషః) ప్రకాశించుచుండుటచే  పురుషుడని ప్రసిద్ధి.

ఏతావానస్య మహిమాతో జ్యాయాన్-చ పూరుషః| 
(ఋగ్వేదము – పురుషసూక్తము -10.90.03)
పురుషునియొక్క బృహత్(జ్యాయాన్) మహిమచే (మహిమా స్వకీయ సామర్ధ్య విశేషః – శాయనభాష్యము) సమస్త సృష్టి కలిగినది.
సత్యమ్ జ్ఞానమ్ అనంతమ్ బ్రహ్మ 
(తైత్తిరీయ ఉపనిషత్తు – 2.1.1).
హన్త తే కథయిష్యామి దివ్యాః ఆత్మవిభూతయః|
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్తి అన్తః విస్తరస్య మే|| 
 (భగవద్గీత 10.19)
అనంతమైన బ్రహ్మయొక్క విభూతి విస్తారము అనంతమైనది.
పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతమ్ దివి|  
(ఋగ్వేదము – పురుషసూక్తము -10.90.03)
అయితే, అనంత విస్తారముగలిగిన విశ్వభూత రచనకు (సృష్టికి) ఒక పాదము (అత్యల్పమైన ఒకానొక అంశము) మాత్రమే ఉపయోగించబడినది.  తక్కిన మూడుపాదములు అమృతమయమైన ప్రకాశరూపము (దివి). వైదీక పరిభాషయందు పాదమనిన నాలుగులో ఒకటోవంతు. సంఖ్యాపరముగా, ఈనామమునందలి పద రెండు సంఖ్యకు సూచనగా తీసుకుంటే, పదద్వయ రెండుకు రెండురెట్లు అంటే నాలుగు, పూర్ణత్వమునకు సూచితము. పూర్ణమదః పూర్ణమిదమ్ అని చెప్పబడుచున్న సత్-చిత్-ఆనంద ప్రభలనుండి నాలుగోవంతు తేజస్సుతో రచించబడినదీ అనంతబ్రహ్మాండకోటి స్థావరజంగమ సృష్టి.

దీనినే భగవద్గీత 10.42వశ్లోకమునందు విష్టభ్యాహమిదమ్ కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ అనంతకోటి బ్రహ్మాండములన్నియు తనయొక్క ఒకానొక అంశతో మాత్రమే వ్యాపింపబడియున్నవని కృష్ణపరమాత్మ అర్జునితో చెప్పినాడు.

సృష్టికిపూర్వము ఏకముగానున్న శివశక్త్యాత్మకమైన పరమేశ్వర చైతన్యమునందలి కించిత్తు భాగముమాత్రమే బహిర్గతమై, అభివ్యక్తమైన సృష్టి. అనగా, సమస్త కోట్ల బ్రహ్మాండసృష్టి, పరంబ్రహ్మ యొక్క ఒకానొక లవలేశాంశతో మాత్రమే ఏర్పడినది.

ఈ విధముగా, పదద్వయప్రభలు సరోరుహమును ఓడించుచున్నవియనగా, పరమేశ్వరుని తేజస్సుతో పోల్చినప్పుడు, బహిర్గత సృష్టి (సరోరుహ) ప్రకాశము ఈషణ్మాత్రమని అంతరార్ధమువలెనున్నది.

తల్లిపాదములప్రభల దర్శనభాగ్యము అతిశీఘ్రము కలగవలెనని ప్రార్ధిస్తూ,
శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment