Sunday 27 December 2020

దశముద్రలు-దశావతారములు-రామావతారము Dasamudras-Dasavataras-Ramaavataaramu

 శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

కుణ్ఠీకరోతు విపదమ్మమ కుఞ్చితభ్రూ

చాపాఞ్చితః శ్రితవిదేహభవానురాగః

రక్షోపకారమనిశమ్ జనయఞ్జగత్యాం

కామాక్షి! రామ ఇవతే కరుణాకటాక్షః! (కటాక్షశతకము - 18)

ధనువువలె వంపుతిరిగినది-ఆశ్రితుల దేహాభిమానమును పోగొట్టునది-జగములను రక్షించునదియైన నీ కటాక్షము, కోదండపాణి-విదేహపుత్రికాభిమాని-జగములను ఎల్లవేళలా రక్షించు శ్రీరామునివలే, మావిపత్తులను నశింపజేయుగాక.

ఖేచరీ ముద్ర (రామావతారము)

ధర్మాధర్మస్య సంఘట్టాదుత్థితా విత్తిరూపిణీ

వికల్పోత్థ క్రియాలోప రూపదోష విఘాతినీ ||67||

వికల్పరూప రోగాణామ్ హారిణీ ఖేచరీ పరా

సర్వరోగహరాఖ్యే తు చక్రే సంవిన్మయీ స్థితా ||68||

ఖమ్ అనిన అంతరిక్షము; సంవిదాకాశమునందు చరింపజేయునది ఖేచరీ ముద్ర.  సర్వరోగహరచక్రమును ఉత్తేజపరచు ఖేచరీముద్ర, తాలుచక్ర సంబంధింతమైనది. ధర్మాధర్మముల సంఘట్టనమువలన, సర్వరోగములను హరించుటద్వారా, ధీ (బుద్ధి) శక్తిని ఉత్తేజితపరచునది.  శ్రీచక్రమునందు వశిన్యాదివాగ్దేవతల స్థానమైన అష్టకోణచక్ర సంబంధిత ముద్ర.

సూర్యచంద్రమసోర్మధ్యే నిరాలంబాంతరే పునః

సంస్థితా వ్యోమచక్రే యా సా ముద్రా నామ ఖేచరీ|| (హఠయోగప్రదీపిక 45)

సూర్య, చంద్రమండలముల మధ్యగల నిరాలంబ వ్యోమచక్రమునందు సంస్థితమైనది ఖేచరీముద్ర.

ఇడా పింగలా చ నాసాద్వారయోర్వహతః

సుషుమ్నా తాలుమార్గేణ బ్రహ్మరంధ్రపర్యంతం వహతి

సరస్వతీ ముఖద్వారేణ వహతి పూషా౨లంబుషా చ చక్షుద్వార-

యోర్వహతః గాన్ధారీ హస్తిజిహ్వికా చ కర్ణద్వారయోర్వహతః

కూహూః గుహద్వారే వహతి శంఖినీ లిఙ్గద్వారే వహతి సా

దణ్డమార్గణి బ్రహ్మరంధ్రపర్యంతం వహతి ఏవం దశద్వారేషు

వహన్తి అన్యాసర్వనాడ్యో రోమకూపేషు వహన్తి

(సిద్ధసిద్ధాంత పద్ధతి – 1.37)

నవద్వారపురేదేహీ ఈ శరీరము రెండుకళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కులు, ముఖద్వారము, పాయు, ఉపస్థయను తొమ్మిదిద్వారములతోకూడినదని చెప్పబడుచున్నది. కానీ శరీరములోపల ఉపజిహ్వ/తాలువు/ఘణ్టిక(Uvulaa)వద్ద మరియొక ద్వారము, బ్రహ్మరంధ్రద్వారమొకటియున్నది.  దీనివలన శరీరమునందు దశద్వారములని సిద్ధసిద్ధాంతపద్ధతియందు చెప్పబడినది. 

 

షష్ఠం తాలుచక్రం తత్రామృతధారాప్రవాహః ఘంటికాలిఙ్గం మూలరంధ్రం రాజదంతం శంఖినీవివరం దశమద్వారం తత్ర శూన్యం ధ్యాయేత్ చిత్తలయే భవతి 

(సిద్ధసిద్ధాంతపద్ధతి-2.6)

మూలాధారాది ఆజ్ఞాచక్రపర్యంతచక్రములను దాటుకొనివచ్చిన సూర్యకోటిసమప్రభల కుండలినీశక్తిని, తాలుచక్రస్థానమందలి బ్రహ్మరంధ్రద్వారమును దాటింపజేయునది ఖేచరీముద్ర (ఖేచరీవిద్య-3, శివపురాణము-ఉమాసంహిత-27.35-37). 

హఠయోగశాస్త్రప్రకారము దవడలను(హను)విస్తరించుటద్వారా ధీస్వరూపమైన నాలుకతో లంబికారంధ్రమును శోధించి కుండలినీశక్తిని బ్రహ్మరంధ్రద్వారమునందు ప్రవేశపెట్టు ప్రయోగము, ఖేచరీముద్ర. సంసారసముద్రమునుదాటించు తారకమంత్రమైన రామనామ సంబంధమైనది.

ఊర్ధ్వజిహ్వః స్థిరోభూత్వా సోమపానమ్ కరోతి యః

మాసార్ధేన న సందేహో మృత్యుంజయతి యోగవిత్|| 

(హఠయోగప్రదీపిక – 3.45)

ఈముద్రను సాధనజేయు యోగులందు కుండలినీశక్తి బ్రహ్మరంధ్రమునందు ప్రవేశించినందువలన జరుగు సోమరసముతో శరీరము ప్లుతమగుచున్నది. ఇందువలన వీరు మృత్యువును జయిస్తారు. ధర్మాధర్మవిముక్తులై, కాలాతీతులై, క్షుత్పిపాసావిహీనులై సంసారమును తరించినవారగుదురు.

 మనః స్థిరమ్ యస్య వినావలంబనమ్

వాయు స్థిరో యస్య వినావరోధనమ్

దృష్టిః స్థిరా యస్య వినావలోకనమ్

సా ఏవ ముద్రా విచరన్తి ఖేచరి

(జ్ఞానసంకలనతంత్రము 2.14)

దేనివలన ఏవిధమైన సహాయములేకుండగనే స్థిరమైన మనస్సు, ఏవిధమైన అవరోధములేకుండగ స్థిరమైన వాయుచలనము, ఏవిధమైన దృశ్యములేకుండగనే స్థిరమైన దృష్టి కలుగునో, ఆ ముద్ర ఖేచరి ముద్ర. 

యోగినీహృదయము 67, 68శ్లోకములందు చెప్పబడిన ధర్మ, అధర్మముల సంఘట్టన స్థితినిపొందిన సాధకులందు, సంసారరోగము సంపూర్ణముగా హరింపబడునని, ఈ శక్తి ఉత్తేజితపరచు (సర్వరోగహర)చక్రముద్వారా తెలియవచ్చుచున్నది. సర్వరోగములనుండి దాటింప/తరింపజేయునది ఈ ముద్ర (శివసంహిత-3.84).

వాగ్దేవతల ఆవాసమైన అష్టకోణ సర్వరోగహరచక్రమును ఉత్తేజపరచునదీ ముద్ర.

సరస్వతీ సహ ధీభిః (ఋగ్వేదము 10.65.13); వాగ్ వై సరస్వతీ (గోపథబ్రాహ్మణము, ఐత్రేయబ్రాహ్మణము, శతపథబ్రాహ్మణము).

ధీశక్త్యవతారమైన శ్రీరామావతార సంకేతమీ ముద్ర. కౌసల్యాదేవి సంగ్రహించిన నాలుగోవంతు యజ్ఞపాయసమునందు, బ్రహ్మవిద్యయందలి ఎనిమిది అంశములలో, స్వయంభువ, ధీ-అంశములను కలిగియుండుటచే, రామచంద్రుడు ధీమంతుడు (1.16.27-29, అమృతకటక, శ్రీమద్వాల్మీకిరామాయణము, గోవిందరాజ వ్యాఖ్యానము). అయోధ్యాకాండము 112.15శ్లోకమునందు వాల్మీకిముని, శ్రీరాముని వాక్చాతుర్యమును మదించిన (సరస్వతీదేవి వాహనమైన) హంసస్వరముతో పోల్చిచెప్పినారు.

సరః శబ్దః సోమవాచః (ఋగ్వేదము – 7.103.7)

రకారము సూర్యశక్తికి, మ కారము సోమశక్తికి సూచకము. ఈకారణముచేత రెండక్షరములతో ఏర్పడిన తారకమంత్రమైన రామనామమునకు సంబంధితమైనది ఖేచరి ముద్ర. రమ్ (స్థిరము) ధాతువునుండి వచ్చినది రామ శబ్దము. 

ధీశక్తిరూపిణియైన తల్లిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment