Tuesday, 25 June 2024

వహ్నిమండలవాసినీ - స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః Vahni mandala vasini - Svatmananda lavibhuta brahmadyananda santatih

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

 

శ్రీగురుభ్యోనమః

మనువిద్య నుండి పంచకృత్యపరాయణా వరకుగల నామములద్వారా వహ్నిసూర్యచంద్రమండల కూటములతోకూడిన పంచదశీమంత్రమును ఆవిష్కరించగా, భానుమండలమధ్యస్థానుండి వామకేశివరకుగల నామములద్వారా తంత్రసంబంధిత దశమహావిద్యలను తెలియజేసారు వాగ్దేవతలు. మంత్రము, తంత్రము మరియు యంత్రము అవినాభావ సంబంధముగలవని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇకపై వచ్చు తొమ్మిది నామములు యంత్రసంబంధితముగనున్నవి. వహ్నిమండలవాసిని నుండి తనుమధ్యా వరకుగల తొమ్మిదినామములు తల్లియంత్రమైన శ్రీచక్రమునందలి నవావరణములను తెలియజేయునవిగనున్నవి.

వహ్నిమండలవాసినీ – భూపురచక్రము

భక్తిమత్కల్పలతికా -  షోడశదళపద్మచక్రము – సర్వాశాపరిపూరకచక్రము.

పశుపాశవిమోచనీ -  అష్టదళపద్మము

పాశములవివరణను సాంఖ్యాశాస్త్రముననుసరించి గమనించిన,

చతుర్వింశతి తత్త్వాని మాయాకర్మగుణా అభీ 

విషయా ఇతి కథ్యంతే పాశా జీవనిబంధనః|| (శివపురాణము- వాయవీయసంహితము-1.)

 

సాంఖ్యశాస్త్రము(24తత్త్వములు)కశ్మీరశైవసిద్ధాంతముననుసరించి(36తత్త్వములు) చెప్పబడిన జీవులనుబంధించు మాయాతత్త్వసంబంధిత పాశములుకులార్ణవతంత్రమునందు మనకందరికి సుపరిచితమైన రీతిలో ఎనిమిది విధములుగా విభజించబడినవి.  

 

ఘృణా లజ్జా భయమ్ శోకో జుగుప్సా చేతి పఞ్చమమ్ |

కులమ్ శీలమ్ తథా జాతిరష్టయో పాశాః ప్రకీర్తితాః ||

పాశబద్ధః పశుర్జ్ఞేయః పాశముక్తో మహేశ్వరః |

తస్మాత్ పాశహరో యస్తు స గురుః పరమో మతః ||  (కులార్ణవతంత్రము 13.67,68)

ద్వేషము(ఘృణ), సిగ్గు/బిడియము(లజ్జ), భయముశోకముజుగుప్సకులముశీలముజాతి మొదలగు ఎనిమిది పాశబద్ధులు పశువులు

పశుపాశవిమోచనీ నామమునందలి పాశమను వార్త ఎనిమిదికి సూచితమగుటచే ఈ నామము అష్టదళపద్మచక్రమునకు సంకేతము.

 

సంహృతాశేషపాషండా – చతుర్దశకోణచక్రము

పురాణన్యాయమీమాంసా ధర్మశాస్త్రాఙ్గమిశ్రితాః|

వేదాః స్థానాని విధానామ్ ధర్మస్య చ చతుర్దశే|| (బ్రహ్మవైవర్తమహాపురాణము)

పురాణ, న్యాయ, మీమాంస మొదలగు పదినాలుగు ధర్మస్థానములు.

 

పాం త్రయీధర్మం ఖండయతీతి పాఖండి (శబ్దకల్పద్రుమ)

అవైదికక్రియోపేతాస్తే వై పాషండినః (ఆనందాశ్రమ పద్మపురాణము ఉత్తరఖండము 263అ.4)

ధర్మమును ఖండించి ప్రవర్తించువారు పాఖండులు/పాషండులు.

ఈ నామమునందలి ‘పాషండ-పదినాలుగు’ చతుర్దశకోణ సంకేతము.

 

సదాచారప్రవర్తికా – బహిర్దశారము

సత్యం వద ధర్మం చర యను వేదోక్తులననుసరించి, ధర్మముననుసరించి నడుచుటయే సదాచారము.  సదాచారము పాంచభౌతికదేహ, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తమనబడు అంతఃకరణము మరియు వాక్కు సంబంధితమైనది.  సదాచారసంబంధిత ఈ నామము బహిర్దశారచక్ర సూచితము.

 

తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా – అంతర్దశారము

ఆధ్యాత్మిక, ఆధిదైవిక మరియు ఆధిభౌతికమనబడు మూడు తాపములను అగ్నులందు తపనచెందువారిని ఆహ్లాదపరచు చంద్రికవంటిది తల్లి. ఆధ్యాత్మిక తాపము అంతఃకరణసంబంధితము, ఆధిదైవిక తాపము ఏకం సత్ విప్రా బహుధావదంతి యను సూక్తిననుసరించి సచ్చిదానందపరమాత్మ సంబంధితమైనది మరియు ఆధిభౌతిక తాపము పాంచభౌతిక సంబంధితమగుచున్నది. కాగా, వెరసి తాపత్రయములు పది సంఖ్య సూచితముగనున్నది. తద్వారా ఈ నామము అంతర్దశార ఆవరణకు సంకేతముగనున్నది.

 

తరుణీ -  అష్టకోణము

నిత్యాతారుణ్యవత్వాత్ తరుణీ; సదా షోడశవర్షీయాం

నిత్య తారుణ్యము/యవ్వనముతోకూడిన తల్లి, తరుణీయని చెప్పబడుచున్నది. నిత్యయవ్వనము అమృతత్వ సంబంధితము. సాధకులందు గ్రంథిభేదనము జరుపుతూ ఊర్ధ్వదిశగాప్రయాణించు కుండలినీ శక్తి, పదినారుదళములతోకూడి శీతాంశుమండలము/ఇందుచక్రమని చెప్పబడు లలాటచక్రస్థానమును జేరినప్పుడు జరుగు అమృతస్రావమును సూచించువిధముగా (యోగకుండలినీ ఉపనిషత్తు 1.69-71) వాగ్దేవతలు ఇక్కడ తల్లిని నిత్యతారుణ్యవతిగా వర్ణించారు. దేహాంతర్గత లలాటచక్రము, శ్రీచక్రమందలి అష్టకోణచక్ర సంబంధితమగుటచే ఈ నామము, అష్టకోణచక్రసంబంధితము.

 

తాపసారాధ్యా – త్రికోణము

భగవద్గీతయందు (17.14-16) కృష్ణభగవానుడు శారీరక, మానసిక మరియు వాక్కు నియంత్రణద్వారా జేయబడు మూడువిధములైన తపస్సులను వివరించడం జరిగినది. తాపసులచే ఆరాధింపబడుతల్లియని జెప్పు ఈ నామము, త్రికోణసంబంధితముగ తెలియుచున్నది.

 

తనుమధ్యా – సన్నని మధ్యభాగముగల తల్లి

శ్రీచక్రమ్ శివయోర్వపుః

తనువుయైన శ్రీచక్రము మధ్య బిందువు, సంవిద్బిందువును తెలియజేయునది ఈ నామము.  

తరువాత వచ్చు మూడునామములద్వారా ఈ సంవిద్బిందువునుండి ఏర్పడిన మూడు బిందువులను వర్ణిస్తూ కామకలావిష్కరణ జేయుచున్నారు వాగ్దేవతలు.

తమోపహా – తమస్సును పోగొట్టునది- వాగ్బీజము – మిశ్రబిందువు

చితిః – చైతన్య శక్తి – విమర్శబిందువు - కామరాజబీజము

తత్పదలక్ష్యార్ధా – ప్రకాశబిందువు – శక్తిబీజము

చిదేకరసరూపిణీ – నాలుగుబిందువులతోకూడిన కామకల

రసోవై సః

బిందుత్రికోణములు అవినాభావములుగాన, ఈ నాలుగునామములను కలిపి చెప్పబడు కామకలా-రసస్వరూపిణియైన అమ్మను సూచించు నామమిది.

స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః

సర్వానందమయచక్రమును సూచించు నామము.

 

ఈ విధముగా ఈ నామములందు, వాగ్దేవతలు తల్లియంత్రమైన శ్రీచక్రము నవావరణలను నిక్షిప్తపరచినట్లున్నది.

 

సుమేరుమధ్యశృంగస్థయైన తల్లిని ప్రార్ధిస్తూ,

 

శ్రీమాత్రేనమః